జీహెచ్‌ఎంసీ బడ్జెట్ రూ.5,643 కోట్లు
- ఆమోదించిన స్టాండింగ్ కమిటీ
- డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించి రూ.5,643 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో విస్తృత చర్చల అనంతరం ముసాయిదా బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదిస్తూ, జనరల్‌బాడీకి పంపించాలని తీర్మానించారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం లాంఛనప్రాయమే. ఈసారి ఆదాయం, ఖర్చుల అమలు తీరెలా ఉన్నప్పటికీ భారీ బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ సైతం రూ.5,600 కోట్లతో భారీగా ఉన్నప్పటికీ ఇంతవరకు ఇందులో రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు తదితరమైనవి రాకున్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం భారీగానే ప్రతిపాదించారు. వాటి ని బడ్జెట్‌లో ఉంచడం సాంకేతిక అంశమని, అవి ఎలాగూ రావాల్సిన నిధులేనని, తప్పనిసరిగా వస్తాయని మేయర్ తెలిపారు. రాబోయే బడ్జెట్‌లోని రెవెన్యూ ఆదాయంలో అత్యధిక భాగం 29 శాతం రూ.1,611.45కోట్లు నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు కేటారుుంచారు. రూ.400కోట్లు పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు, డ్రైనేజీలకి రూ.249.8 కోట్లు కేటారుుంచారు. ఆస్తిపన్ను తదితర ట్యాక్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ వినియోగించుకుంటామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు.