- శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు
- రూ.5కే భోజనం 50 కేంద్రాలకు విస్తరణ
- 1500 ప్లేస్కూల్స్ ఏర్పాటుకు చర్యలు
- జీహెచ్‌ఎంసీ పనులపై మేయర్ సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా పేదబస్తీల ప్రజలకు శుద్ధమైన తాగునీరందించేందుకు 400 ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ అధికారులకు సూచించారు. కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి శనివారం జీహెచ్‌ఎంసీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1500 ముస్కాన్ (ప్లే స్కూల్) సెంటర్లు, 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం కార్యక్రమాల అమలుకు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. తాగునీటి సదుపాయం, భవనాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తొలిదశ ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
ప్రజలెక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రేటర్‌లో 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 8 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అడ్డా కార్మికులు, ఆస్పత్రులు, బలహీనవర్గాల ప్రజలుండే ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్లు, ముస్కాన్‌లు, రూ. 5లకే భోజనం ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలు బుధవారం లోగా అందించాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ జోనల్ కమిషనర్లకు సూచించారు.
23 నుంచి రోడ్డు కటింగ్‌లుండవు..
ఈ నెల 23 నుంచి ఎలాంటి రోడ్డు కటింగ్‌లకు అనుమతించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వాటి అనుమతులపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సు దృష్ట్యా రహదారుల అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
లేన్‌మార్కింగ్, క్యాట్‌ఐస్, సైనేజీల ఏర్పాటుతోపాటు అన్ని ప్రధాన మార్గాల్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టంతో పనిచేసే ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 81 ఫౌంటెన్లకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లపై లైటింగ్, గ్రీనరీలను పెంచాలన్నారు. హెరిటేజ్ కారిడార్ల వద్ద బస్‌బేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు.