- పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీ చేసే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలి దశలో 72 స్లమ్స్‌లో సర్వే పూర్తి చేశారు. స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా ఆయా స్లమ్స్‌లో రెండు పడకగదుల ఇళ్లతోపాటు తాగునీరు, డ్రైనేజీ , విద్యుత్తు.. తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నారు. ఇందులో భాగంగా మూడు రకాలైన ఇళ్లను నిర్మిం చేందుకు జీహెచ్‌ఎంసీ మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.
ప్రస్తుతం నిర్వహించిన సర్వే మేరకు ఇన్‌సిటు రీ డెవలప్‌మెంట్‌కు 52 స్లమ్స్‌లోని ప్రజలు, ఇన్ సిటు అప్‌గ్రే డేషన్ కింద ఇళ్ల నిర్మాణాలకు 20 స్లమ్స్ ప్రజలు తమ అంగీకారం తెలిపారు. రీ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఉన్న ఇళ్లను కూల్చివేసి, అందరికీ సరిపడే ఇళ్లను కొత్తగా నిర్మిస్తారు. అప్‌గ్రేడేషన్‌లో భాగంగా.. ఉన్న ఇళ్లకు అవసరమైన మరమ్మతులు చేసి సదుపాయవంతంగా ఆధునీకరిస్తారు.
తొలుత నియోజకవర్గానికి ఒకటి , రెండు చొప్పున స్లమ్స్‌ను ఎంపిక చేయాలని భావించిన అధికారులు ప్రస్తుతం గ్రేటర్‌లోని ఐదు జోన్లలో గల 1472 మురికివాడల్లో.. 72 స్లమ్స్‌లో సర్వే పూర్తి చేశారు. సెంట్రల్ జోన్‌లో 28 స్లమ్స్ రీ డెవలప్‌మెంట్‌కు, 5 స్లమ్స్ అప్‌గ్రేడేషన్‌కు ప్రజలు ముందుకొచ్చారు. అలాగే నార్త్‌జోన్‌లో 3 స్లమ్స్‌లో రీ డెవలప్‌మెంట్‌కు, 4 స్లమ్స్‌లో అప్‌గ్రేడేషన్‌కు, వెస్ట్‌జోన్‌లో 18 స్లమ్స్‌లో అప్‌గ్రేడేషన్‌కు, 9 స్లమ్స్‌లో రీ డెవలప్‌మెంట్‌కు ముందుకొచ్చారు. మిగతా జోన్లలోనూ ఆయా స్లమ్స్‌ను అప్‌గ్రేడేషన్‌కు,రీ డెవలప్‌మెంట్‌కు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టుగా వీటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రతిపాదించిన మూడు విధానాలు ఇలా..
1. ఇన్‌సిటు రీ డెవలప్‌మెంట్: స్లమ్‌లోని ఇళ్లన్నింటికీ కూల్చివేసి, ఆ స్లమ్‌లోని అందరికీ సరిపడినన్ని ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
2. ఇన్‌సిటు అప్‌గ్రెడేషన్: ప్రస్తుతం ఉన్న ఇళ్లకే అదనపు నిర్మాణాలు చేసి అభివృద్ధి పరుస్తారు.
3. రీ లొకేషన్: సమీపంలో ప్రమాదకర పరిశ్రమల వంటివి ఉంటే.. సదరు స్లమ్స్‌లోని ప్రజలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తారు. జీవనోపాధికి మార్గం చూపుతారు.