సిటీ..పిటీ
- గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాలు అంతంతే..
- 33 శాతం మందికి మంచినీటి నల్లాలు లేవు..
- 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం నిల్
- శివారు ప్రాంతాలకు తాగునీరు కలే..
- మెట్రోపొలిస్ సదస్సు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నివేదిక
- వెల్లడైన కఠోర వాస్తవాలు
సాక్షి, సిటీబ్యూరో: పేరుగొప్ప..ఊరు దిబ్బ అన్నచందంగా మారింది మన గ్రేటర్ నగరం పరిస్థితి. దేశంలో ప్రముఖ నగరాల జాబితాలో నాలుగోస్థానం దక్కించుకున్నప్పటికీ ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు మాత్రం అందనంత దూరంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పలు వాస్తవాలను జీహెచ్‌ఎంసీ నివేదిక రూపంలో విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం...శివార్లలో మంచినీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు అధ్వానం కాగా... మురికివాడల ప్రజలకు తాగునీటి సౌకర్యం సుదూరంలో ఉంది.
గ్రేటర్ పరిధిలో జలమండలి కుళాయి నీటి సౌకర్యం ఉన్న కుటుంబాలు కేవలం 67 శాతమే. మిగతా 33 శాతం మందికి బోరుబావులు, ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్‌ప్లాంట్లే ఆధారం. శివారు ప్రాంతాల్లో జనం మంచినీటిని కొనుగోలు చేసే దుస్థితి తలెత్తింది. ఇక పేరుగొప్ప హైటెక్‌సిటీ పరిధిలో సుమారు 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం లేక ఆయా కుటుంబాలు మురుగునీటిని సెప్టిక్ ట్యాంకుల్లో నిల్వచేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అంతేకాదు ఉప్పల్, కుత్భుల్లాపూర్, మల్కాజ్‌గిరి, హయత్‌నగర్ వంటి శివారు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి.
దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహోద్యమంగా చేపడుతున్న తరుణంలో ఇలాంటి వాస్తవాలు వెలుగుచూడడం బాధ్యతాయుత పౌరులను కుంగదీస్తున్నాయి. మరోవైపు మహానగరానికి రోజురోజుకూ వలసలు పెరిగిపోతుండడంతో జనసాంద్రత అనూహ్యంగా పెరుగుతుండడం కలవరపరుస్తోంది.
నివేదికలో గ్రేటర్ సిటీకిసంబంధించి పరిశీలనాంశాలివీ...
హైదరాబాద్ నగరం ప్రస్తుతం దేశంలో పేరెన్నికగన్న నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది.
ప్రతి చదరపు కి.మీ.కు 2345 మంది నివసిస్తున్నారు.
నగర జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు సంపాదించే శక్తి కలిగి ఉన్నారు.
గ్రేటర్‌లో శుద్ధిచేసిన నీరు పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా అందుకుంటున్న కుటుంబాలు: 93.20 శాతం
కుళాయి సౌకర్యం ఉన్న కుటుంబాలు: 67 శాతం
చేతిపంపులపై ఆధారపడిన కుటుంబాలు: 2.13 శాతం
బోర్‌వెల్స్‌పై ఆధారపడిన కుటుంబాలు: 5.46
మురికివాడల్లో నివసిస్తున్న వారికి మంచినీటి సౌకర్యం దూరంగా ఉన్న కుటుంబాలు: 36.67 శాతం
మరుగుదొడ్డి సౌకర్యం లేని కుటుంబాలు: 3 శాతం
డ్రైనేజీ సౌకర్యం ఉన్న కుటుంబాలు: 70 శాతం
సెప్టిక్ ట్యాంకుల్లో మురుగునీటిని నిల్వ చేస్తున్న కుటుంబాలు: 30 శాతం