Conference metropolis
-
కూలిన మెట్రోపొలిస్ స్వాగత ద్వారం
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు హైదరాబాద్: మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం యువకుడిని బలి తీసుకుంది. ఎంతో అట్టహాసంగా మెట్రోపొలిస్ సదస్సు కోసం నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అందులో రాయదుర్గంలోని సర్వే నంబర్ 83 వద్ద ఏర్పాటు చేసిన ద్వారం ఆదివారం కూలిపోయింది. అదే సమయంలో అటుగా వాహనంపై వస్తున్న పృథ్వీసేనారెడ్డిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నూతంకి గ్రామానికి చెందిన బి.పృథ్వీసేనారెడ్డి (29) నిజాంపేటలో నివాసముంటున్నాడు. నానక్‌రాంగూడలోని హిటాచీ కంపెనీలో హౌస్‌కీపింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కోకాపేటలోని స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం కంపెనీకి వచ్చాడు. విధుల్లో ఉన్న సూపర్వైజర్ శేఖర్‌కు చెందిన బైక్‌పై ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. అదేసవుయుంలో రాయదుర్గం సర్వేనంబర్ 83లోని ఎం హోటల్ సమీపంలో జీహెచ్ఎంసీ మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలి పృథ్వీసేనారెడ్డిపై పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకటేశ్వరరావు (30), రవిప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు మాదాపూర్‌లోని ఇన్ఫోటెక్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పృథ్వీసేనారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీ..పిటీ
గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాలు అంతంతే.. 33 శాతం మందికి మంచినీటి నల్లాలు లేవు.. 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం నిల్ శివారు ప్రాంతాలకు తాగునీరు కలే.. మెట్రోపొలిస్ సదస్సు నేపథ్యంలో జీహెచ్ఎంసీ నివేదిక వెల్లడైన కఠోర వాస్తవాలు సాక్షి, సిటీబ్యూరో: పేరుగొప్ప..ఊరు దిబ్బ అన్నచందంగా మారింది మన గ్రేటర్ నగరం పరిస్థితి. దేశంలో ప్రముఖ నగరాల జాబితాలో నాలుగోస్థానం దక్కించుకున్నప్పటికీ ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు మాత్రం అందనంత దూరంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పలు వాస్తవాలను జీహెచ్ఎంసీ నివేదిక రూపంలో విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం...శివార్లలో మంచినీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు అధ్వానం కాగా... మురికివాడల ప్రజలకు తాగునీటి సౌకర్యం సుదూరంలో ఉంది. గ్రేటర్ పరిధిలో జలమండలి కుళాయి నీటి సౌకర్యం ఉన్న కుటుంబాలు కేవలం 67 శాతమే. మిగతా 33 శాతం మందికి బోరుబావులు, ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్ప్లాంట్లే ఆధారం. శివారు ప్రాంతాల్లో జనం మంచినీటిని కొనుగోలు చేసే దుస్థితి తలెత్తింది. ఇక పేరుగొప్ప హైటెక్‌సిటీ పరిధిలో సుమారు 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం లేక ఆయా కుటుంబాలు మురుగునీటిని సెప్టిక్ ట్యాంకుల్లో నిల్వచేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అంతేకాదు ఉప్పల్, కుత్భుల్లాపూర్, మల్కాజ్గిరి, హయత్‌నగర్ వంటి శివారు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహోద్యమంగా చేపడుతున్న తరుణంలో ఇలాంటి వాస్తవాలు వెలుగుచూడడం బాధ్యతాయుత పౌరులను కుంగదీస్తున్నాయి. మరోవైపు మహానగరానికి రోజురోజుకూ వలసలు పెరిగిపోతుండడంతో జనసాంద్రత అనూహ్యంగా పెరుగుతుండడం కలవరపరుస్తోంది. నివేదికలో గ్రేటర్ సిటీకిసంబంధించి పరిశీలనాంశాలివీ... హైదరాబాద్ నగరం ప్రస్తుతం దేశంలో పేరెన్నికగన్న నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రతి చదరపు కి.మీ.కు 2345 మంది నివసిస్తున్నారు. నగర జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు సంపాదించే శక్తి కలిగి ఉన్నారు. గ్రేటర్లో శుద్ధిచేసిన నీరు పైప్‌లైన్ నెట్వర్క్ ద్వారా అందుకుంటున్న కుటుంబాలు: 93.20 శాతం కుళాయి సౌకర్యం ఉన్న కుటుంబాలు: 67 శాతం చేతిపంపులపై ఆధారపడిన కుటుంబాలు: 2.13 శాతం బోర్‌వెల్స్‌పై ఆధారపడిన కుటుంబాలు: 5.46 మురికివాడల్లో నివసిస్తున్న వారికి మంచినీటి సౌకర్యం దూరంగా ఉన్న కుటుంబాలు: 36.67 శాతం మరుగుదొడ్డి సౌకర్యం లేని కుటుంబాలు: 3 శాతం డ్రైనేజీ సౌకర్యం ఉన్న కుటుంబాలు: 70 శాతం సెప్టిక్ ట్యాంకుల్లో మురుగునీటిని నిల్వ చేస్తున్న కుటుంబాలు: 30 శాతం -
‘మహా’నగరి...నడిచే దారి?
మేమే రోడ్డు దాటలేకపోతున్నాం మెట్రోపొలిస్ సదస్సులో పోలీసు కమిషనర్లు పాదచారులకు రక్షణ లేదని అంగీకారం అన్ని విభాగాలకూ బాధ్యత ఉందని స్పష్టీకరణ నగర ప్రజల సమస్యలపై స్పందన సాక్షి,సిటీబ్యూరో: ‘హైదరాబాద్‌లో పాదచారులకు రక్షణ లేదన్న విషయం వాస్తవమే. మేమే రోడ్డు దాటలేకపోతున్నాం.’ అంటూ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు అంగీకరించారు. మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం సిటీ మేనేజ్మెంట్ సిరీస్‌లో భాగంగా ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ సమస్య ప్రస్తావనకొచ్చింది. పాదచారుల బతుకులకు రక్షణ లేకుండా పోయిందని, పెరిగినవాహన రద్దీ.. నడిచే దారులు లేకపోవడం.. అడ్డగోలు ఆక్రమణలు తదితరమైన వాటి వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై కమిషనర్లు స్పందిస్తూ ట్రాఫిక్ విభాగం మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. మున్సిపల్, ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తే తప్ప పరిష్కారం కాదన్నారు. రహదారుల డిజైన్ల దశలోనే పాదచారులకు సదుపాయంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఫుట్‌పాత్‌లు పాదచారులు వినియోగించుకునేలా ఫెన్సింగ్‌ల ఏర్పా టు, జంక్షన్ల అభివృద్ధి, సిగ్నల్ లైట్లు, యూ టర్న్ తదితరమైన వాటి వల్ల తాత్కాలిక పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. జీపీఎస్‌తో నేరాల అదుపు ఆటోవాలాల వేధింపుల నుంచి మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తిపై కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆటోలతో పాటు ప్రజా రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలకూ జీపీఎస్ వ్యవస్థను అమలు చేయాల్సి ఉందన్నారు. తద్వారా నేరాలను అరికట్టవచ్చునన్నారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులకు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబరు అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. సైబరాబాద్ పరిధిలో దాదాపు 11వేల క్యాబ్లుండగా, 6వేల క్యాబ్లే పోలీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. నగరంలో దాదాపు వెయ్యి జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగరంలోని ట్రాఫిక్, తదితర సమస్యలపై ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ బంజారాహిల్స్‌లో 22 అంతస్తులతో నిర్మాణమయ్యే భవనంలో ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వల్ల అన్ని అత్యవసర సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీల అమరికతో పాటు వీలైనన్ని ఎఫ్‌ఓబీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పుట్‌పాత్‌లపై చిరువ్యాపారుల తొలగింపులో సమస్యలు ఉన్నాయని చెప్పారు. అది జీవనాధారమైనందున సున్నిత సమస్యగా మారిందన్నారు. నగరానికి చెందిన పద్మజ, ఆనంద్, తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలను ప్రస్తావించారు. విపత్తుల నివారణపై శ్రద్ధ విపత్తుల నివారణకు అందుబాటులోని సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవాల్సి ఉందని ఈ అంశంలో నిపుణుడు సుబ్రహ్మణ్యం చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ముప్పును తగ్గించవచ్చన్నారు. విపత్తు సమయాల్లో ప్రణాళిక, స్పందించే వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చునన్నారు.