‘మహా’నగరి...నడిచే దారి?
- మేమే రోడ్డు దాటలేకపోతున్నాం
- మెట్రోపొలిస్ సదస్సులో పోలీసు కమిషనర్లు
- పాదచారులకు రక్షణ లేదని అంగీకారం
- అన్ని విభాగాలకూ బాధ్యత ఉందని స్పష్టీకరణ
- నగర ప్రజల సమస్యలపై స్పందన
సాక్షి,సిటీబ్యూరో: ‘హైదరాబాద్‌లో పాదచారులకు రక్షణ లేదన్న విషయం వాస్తవమే. మేమే రోడ్డు దాటలేకపోతున్నాం.’ అంటూ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు అంగీకరించారు. మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం సిటీ మేనేజ్‌మెంట్ సిరీస్‌లో భాగంగా ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ సమస్య ప్రస్తావనకొచ్చింది. పాదచారుల బతుకులకు రక్షణ లేకుండా పోయిందని, పెరిగినవాహన రద్దీ.. నడిచే దారులు లేకపోవడం.. అడ్డగోలు ఆక్రమణలు తదితరమైన వాటి వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పలువురు అభిప్రాయపడ్డారు.
దీనిపై కమిషనర్లు స్పందిస్తూ ట్రాఫిక్ విభాగం మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, జలమండలి తదితర విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తే తప్ప పరిష్కారం కాదన్నారు. రహదారుల డిజైన్ల దశలోనే పాదచారులకు సదుపాయంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఫుట్‌పాత్‌లు పాదచారులు వినియోగించుకునేలా ఫెన్సింగ్‌ల ఏర్పా టు, జంక్షన్ల అభివృద్ధి, సిగ్నల్ లైట్లు, యూ టర్న్ తదితరమైన వాటి వల్ల తాత్కాలిక పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.
జీపీఎస్‌తో నేరాల అదుపు
ఆటోవాలాల వేధింపుల నుంచి మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తిపై కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆటోలతో పాటు ప్రజా రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలకూ జీపీఎస్ వ్యవస్థను అమలు చేయాల్సి ఉందన్నారు. తద్వారా నేరాలను అరికట్టవచ్చునన్నారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులకు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబరు అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు.
సైబరాబాద్ పరిధిలో దాదాపు 11వేల క్యాబ్‌లుండగా, 6వేల క్యాబ్‌లే పోలీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. నగరంలో దాదాపు వెయ్యి జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగరంలోని ట్రాఫిక్, తదితర సమస్యలపై ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ బంజారాహిల్స్‌లో 22 అంతస్తులతో నిర్మాణమయ్యే భవనంలో ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వల్ల అన్ని అత్యవసర సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు తెలిపారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీల అమరికతో పాటు వీలైనన్ని ఎఫ్‌ఓబీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పుట్‌పాత్‌లపై చిరువ్యాపారుల తొలగింపులో సమస్యలు ఉన్నాయని చెప్పారు. అది జీవనాధారమైనందున సున్నిత సమస్యగా మారిందన్నారు. నగరానికి చెందిన పద్మజ, ఆనంద్, తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలను ప్రస్తావించారు.
విపత్తుల నివారణపై శ్రద్ధ
విపత్తుల నివారణకు అందుబాటులోని సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవాల్సి ఉందని ఈ అంశంలో నిపుణుడు సుబ్రహ్మణ్యం చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ముప్పును తగ్గించవచ్చన్నారు. విపత్తు సమయాల్లో ప్రణాళిక, స్పందించే వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చునన్నారు.