చల్లార్చే శాఖ.. చతికిల
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నియంత్రణ, రక్షణ చర్యల్లో పటిష్టంగా ఉండాల్సిన అగ్నిమాపక శాఖ అనేకరకాల సమస్యలు, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. వేసవి కాలంలో షార్ట్ సర్క్యూట్లు సంభవించి భారీ అగ్నిప్రమాదాలు సైతం చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఫైర్ డిపార్ట్మెంట్ సన్నద్ధత చర్చనీయాంశమవుతోంది. ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టాన్ని నివారించడంతో పాటు ప్రాణాలు కోల్పోకుండా కృషి చేయాల్సిన అగ్నిమాపక శాఖకు.. తగిన సంఖ్యలో స్టేషన్లు, సిబ్బంది, వాహనాలు, అత్యాధునిక అగ్నిమాపక సాధనాలు లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అగ్నిమాపక శాఖ దుస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. \
స్టేషన్లు పెంచాల్సిందే..
స్టాండింగ్ ఫైర్ అడ్వయిజరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఏసీ) నిబంధనల ప్రకారం అర్బన్, మెట్రో నగరాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండాలి. అదే విధంగా ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్‌స్టేషన్ ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్‌స్టేషన్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో స్పష్టంగా ఉంది.
అయితే రాష్ట్రంలో కనీసం 5 లక్షల జనాభాకు ఒక ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా 2016లోనే నిర్ణయం తీసుకొని నిధులు మంజూరు చేసింది. కానీ కొన్నిచోట్ల ఇప్పటివరకు స్టేషన్లు ఏర్పాటు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణాన్ని (625 చ.కి.మీ) బట్టి చూస్తే జీహెచ్ంఎసీ పరిధిలో 40–50 వరకు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ 25 ఫైర్ స్టేషన్లే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి రెండు జిల్లాల్లో ఔట్ పోస్టులతో కలిపి మొత్తం 30 మాత్రమే అగ్నిమాపక కేంద్రాలున్నట్టు ఫైర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ పేర్కొంది.
వాహనాల సంఖ్య మరీ దారుణం
అహ్మదాబాద్, పుణెల్లో ఒక్కో ఫైర్స్టేషన్లో కనీసం 6 నుంచి 8 అగ్ని మాపక వాహనాలున్నాయని, రాష్ట్రంలో మాత్రం ఒక్కో స్టేషన్‌కు ఒకటి చొప్పున మాత్రమే ఉందని తెలిపారు. పరిశ్రమలున్న ప్రాంతాల్లో స్టేషన్ల సంఖ్యతో పాటు వీటి సంఖ్యను కనీసం 3 నుంచి 4కు పెంచితే ప్రమాదాలను త్వరితగతిన నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అత్యాధునిక వాహనం ఒక్కటే: అత్యాధునిక అగ్నిమాపక వాహనం ఒకటే ఉందని, వీటి సంఖ్య అత్యవసరంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 15 ఏళ్లకు పైబడిన అగ్నిమాపక వాహనాలు, పరికరాలు (ఎక్విప్మెంట్) 107 ఉండగా, 15 ఏళ్ల లోపువి 518 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వేధిస్తున్న సిబ్బంది, అధికారుల కొరత
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం 2,256 మంజూరు పోస్టులుండగా, 1,414 మంది ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే ఒక అదనపు డైరెక్టర్, ఒక రీజనల్ ఫైర్ అఫీసర్, మూడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారుల పోస్టులతో పాటు కీలకమైన 49 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 212 డ్రైవర్ ఆపరేటర్, 541 ఫైర్ మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మంజూరు పోస్టుల్లో దాదాపుగా 45 శాతం ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేస్తోంది.
అజమాయిషీ లేక ప్రమాదాలు!
రాష్ట్రంలో 15 మీటర్ల ఎత్తువరకు భవన నిర్మాణాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఆయా మున్సిపల్ అథారిటీలకు ప్రభుత్వం అప్పగించింది. భారీ పరిశ్రమలు, 15 మీటర్ల నుంచి ఆపై ఎత్తులో నిర్మించే భారీ గృహ నిర్మాణాలకు మాత్రమే రాష్ట్ర అగ్నిమాపక శాఖ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తోంది.
కాగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో డిప్యూటేషన్‌పై పనిచేసే అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడం వరకే పరిమితమవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు మొత్తం అగ్నిమాపక శాఖ నుంచే జరిగితే ఫీల్డ్ వెరిఫికేషన్‌తో పాటు సేఫ్టీ అడిటింగ్, సేఫ్టీ మెజర్మెంట్స్ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుంటుందని అంటున్నారు. 90 శాతం నిర్మాణాలు 15 మీటర్ల ఎత్తు వరకే ఉన్నాయని, వాటిపై తమకు పూర్తి అజమాయిషీ ఉండటం లేదని అంటున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇతర భారీ పరిశ్రమల్లో మాత్రం ప్రతి ఏటా సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు.
పేరుకే గ్రేటర్...
హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యధిక అగ్నిమాపక కేంద్రాల్లో నీటి సంపులే లేకపోవడం ఆ శాఖ దుస్థితిని స్పష్టం చేస్తోంది. రిజర్వా యర్ల వద్ద గానీ, చెరువులు, కుంటల వద్ద గానీ నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది.
పాత వాహనాలకు తోడు అధునాతన అగ్నిమాపక పరికరాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. సికింద్రాబాద్ బోయగూడ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలను ఆర్పడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ముషీరాబాద్ ఫైర్ స్టేషన్లో మంటలు ఆర్పడానికి అధునాతన పరికరాలు లేవు.
నగరానికి 50 వరకు ఫైర్ స్టేషన్లు అవసరం కాగా అందులో సగం మాత్రమే ఉండటంతో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినా, ఒకేసారి రెండు మూడు చోట్లకు ఫైరింజన్లు వెళ్లాల్సి వచ్చినా.. పరిస్థితి ఊహించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొన్నాళ్ల క్రితం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఆగ్ని ప్రమాదం అగ్నిమాపక శాఖలో ఉన్న లోపాలను బయటపెట్టింది. అక్కడ మోహరించిన ఫైరింజన్లలో కొన్నింటిలో నీరు లేకపోవడం, మరికొన్నింటిలో సగమే ఉండడం, ఓ వాహనం వాల్స్ తుప్పు పట్టి ఓపెన్ కాకపోవడం విమర్శలకు తావిచ్చింది.
నగరంలోని ఏ అగ్నిమాపక కేంద్రంలోనూ అగ్ని నిరోధక బాంబులు(ఫైర్ ఎక్సిటింగ్వి షర్ బాంబ్) లేవు. ఈ బాంబులు వినియోగి స్తే మంటలను సత్వరమే అదుపులోకి తీసుకురావచ్చు.