మిస్డ్‌కాల్ కొట్టు.. ఉద్యోగం పట్టు
- నగరంలో ‘ఈ-వ్యాన్’ సదుపాయం
- ఉన్న చోటు నుంచే యువతకు ఉద్యోగ అవకాశం
- పథకాన్ని ప్రారంభించిన మేయర్ మాజిద్
సాక్షి, సిటీబ్యూరో:‘మీరు నిరుద్యోగులా... ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా?... ఇకపై ఆ అవసరం లేదు. ఉన్న చోటు నుంచే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఉద్యోగం కోసం మీ పేరు నమోదైనట్టే.. ఆపై అవసరమైన శిక్షణ.. ఇంటర్వ్యూ.. ఉద్యోగం మీకొచ్చినట్టే’.. ఈ ప్రయోగాత్మక పథకాన్ని జీహెచ్‌ఎంసీ శనివారం ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి జ్యోతి వెలిగించి పథకాన్ని ప్రారంభించారు.
టీఎంఐ సంస్థ సాంకేతిక సహకారంతో జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఈ-వ్యాన్ (ఎంప్లాయ్‌మెంట్ వ్యాన్)ను కూడా మేయర్ ప్రారంభించారు. మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ కార్పొరేషన్ చేయని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిరుద్యోగులు 040-71012014 నెంబర్‌కు ఫోన్ చేస్తే.. కార్యాలయ పనిదినాల్లో జీహెచ్‌ఎసీ నుంచి వారికి ఫోన్ కాల్ వెళ్తుందన్నారు.
విద్యార్హతలకు తగిన ఉద్యోగాల గురించి వివరించడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ-జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్‌లో కనీసం 10 ఈ-వ్యాన్‌లు, 25 ఈ-జోన్ కేంద్రాలు అవసరమన్నారు. వేదికనుంచే మల్కాజిగిరిలోని ఈ-జోన్ కార్యాలయాన్ని ఆన్‌లైన్ ద్వారా మేయర్ ప్రారంభించారు. అక్కడున్న నిరుద్యోగులతో మాట్లాడారు.
నిరుద్యోగుల కోసం ఎన్నో పథకాలు..
ఈ-వ్యాన్‌లో ఉండే సదుపాయాలతో నిరుద్యోగుల వివరాలు నమోదు చేస్తారని.. అనంతరం వారి అర్హతలకు తగిన ఉద్యోగాల గురించి ఈ-జోన్ కేంద్రాల్లో తెలుపుతారని, అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతోపాటు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఈ-వ్యాన్ ఆయా బస్తీల్లోని నిరుద్యోగులందరినీ ఒక చోటకు చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జోన్‌కొకటి చొప్పున ఐదు ఈ-వ్యాన్‌లు పనిచేస్తాయన్నారు.
ఈ-వ్యాన్ ద్వారా ఏటా 12వేల మందికి ఉపాధి చూపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టీఎంఐ సంస్థ చైర్మన్, ఎండీ మురళీధరన్ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి చూపాలని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు.