‘కొత్త మేయర్’ పై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్-ఎంఐఎం ఒప్పందం మేరకు త్వరలో తమ అభ్యర్థిని మేయర్‌గా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఎంఐఎం మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా కోసం కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకు లేఖ పంపించినట్లు తెలుస్తోంది. మాజిద్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నందున తమపార్టీ అభ్యర్థి ఆ పదవి అధిష్టించేందుకు వీలుగా ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ పీసీసీ.. గ్రేటర్ కాంగ్రెస్ ద్వారా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి లేఖ పంపించినట్లు సమాచారం.
గత వారమే ఈ లేఖను ఆయనకు అందజేయాల్సి ఉండగా.. పార్లమెంటు సమావేశాల కోసం అసదుద్దీన్ ఢిల్లీ వెళ్లడంతో ఇవ్వలేకపోయార ంటున్నారు. అసదుద్దీన్ నగరానికి వచ్చినందున పీసీసీ సూచన మేరకు.. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి లేఖను అసదుద్దీన్‌కు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. నెలరోజుల క్రితమే కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ఎంఐఎం దృష్టికి తేగా ఒప్పందం మేరకు నడచుకునేందుకు ఎంఐఎం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడమే కాక.. లాంఛనప్రాయంగా అందజేయాల్సిన లేఖను అందజేయాల్సిందిగా కోరింది. అయినప్పటికీ ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు.
ప్రత్యేక తెలంగాణ తదితర అంశాల నేపథ్యంలో వారు జీహెచ్‌ఎంసీపై పెద్దగా దృష్టి సారించలేదు. కాగా జీహెచ్‌ఎంసీలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, కొందరు రాష్ట్రనేతలు ఇటీవల ఈ అంశాన్ని పీసీసీ దృష్టికి తేవడంతో.. ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల సంవత్సరం అయినందున గ్రేటర్లో పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగరంలో పార్టీ ఇమేజ్‌ను పెంచుకోవాలన్నది కాంగ్రెస్ యోచనగా ఉంది. ఇప్పటినుంచే పావులు కదిపితే కనీసం జనవరి నెలాఖరుకో, లేక ఫిబ్రవరి మొదటి వారానికో కొత్త మేయర్ వచ్చే అవకాశాలున్నాయి.
రెండు పార్టీల ఒప్పందం మేరకు.. ఐదేళ్ల మేయర్ పదవీకాలానికి గాను తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి.. మధ్యలో రెండేళ్లు ఎంఐఎం అభ్యర్థి మేయర్ పదవిలో కొనసాగాలి. ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించి త్వరలోనే రెండేళ్లు పూర్తికానుంది. వాస్తవానికి డిసెంబర్ నాటికే మేయర్ పదవికి రెండేళ్లు పూర్తి కానున్నప్పటికీ.. తొలి రెండేళ్లు మేయర్‌గా వ్యవహరించిన కార్తీకరెడ్డి రాజీనామా చేయడంలో జరిగిన జాప్యం.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ తదితరమైన వాటితో 2012 జనవరి 3న మాజిద్ బాధ్యతలు స్వీకరించారు.