కూల్చివేతలు ఆపండి
- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం
- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచన
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ కొనసాగిస్తోంది. తాజాగా గురువారం నగరంలోని వివిధ సర్కిళ్ల పరిధిలోని 19 భవనాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గడచిన మూడు రోజుల్లో మొత్తం 44 భవనాలను కూల్చివేశారు. అధికారుల ఈ చర్యలపై ప్రజల నుంచి పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోకుండా.. ఏళ్ల తర్వాత కూల్చివేతలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు.
ప్రజల నుంచి కార్పొరేటర్లపై ఒత్తిళ్లు పెరగడంతో పలువురు కార్పొరేటర్లు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నంమేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కూల్చివేతకు ముందు.. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే అడ్డుకోకుండా ప్రోత్సహించిన సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ల (ఏసీపీలు)పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్పొరేటర్ల ధర్నా
కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అంతకుముందు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కూల్చివేతలకన్నా ముందు అక్రమ భవనాలు రావడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రికి రాసిన మరో లేఖలో టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పక్షపాతంతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో జరగుతున్న కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఎక్కడెక్కడ..
అధికారులు గురువారం చర్లపల్లి, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, ఆజంపురా, బడాబజార్, జాస్మిన్‌నగర్, రాంనగర్, మధురానగర్, బంజారాహిల్స్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని భవనాలను నేలమట్టం చేశారు.
కూల్చివేతలు యధాతథం: కమిషనర్
ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు యధాతథంగా కొనసాగుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల మేరకు అక్రమ భవనాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణను కోరుతూ కార్పొరేటర్ల విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.
పాత పద్ధతిలోనే ట్రేడ్‌లెసైన్స్ ఫీజు
గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలకు ఒకేలా ట్రేడ్‌లెసైన్సు ఫీజు విధించడాన్ని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నిలుపు చేస్తూ పాత పద్ధతినే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది.
వీటికి ఆమోదం..
కార్పొరేటర్లకు యాపిల్ ఐపాడ్లు, మీడియా ప్రతినిధులకు టాబ్లెట్లు ఇచ్చేందుకు గతంలో ఆమోదించిన తీర్మానం ఉపసంహరణ
ప్రభుత్వోద్యోగుల తరహాలో 2014 జనవరి నుంచి జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు డీఏ పెంపు
రూ. 74 లక్షలతో సైనిక్‌పురి షాపింగ్‌కాంప్లెక్స్ రెండో అంతస్తు నిర్మాణం
జోహ్రాబీ దర్గా నుంచి డీఆర్‌డీఎల్ వరకు రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి పరిహారం.
తిరస్కరించినవి..
మోహన్‌నగర్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు సీసీరోడ్డు పనులు.
కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ప్రహరీగోడ, అంతర్గత రహదారి నిర్మాణపనులు.
హైదర్‌గూడ రింగ్‌రోడ్డు వద్ద సర్దార్ వల్లభాయిపటేల్ విగ్రహం ఏర్పాటు. దాన్ని తెలంగాణ అమరవీరుల ప్రదేశంగా గుర్తించాలని ప్రతిపాదన.
పెండింగ్..
బల్దియా పెట్రోల్ సప్లయ్ కంపెనీకి స్థలం లీజు పొడిగింపు అంశం.
2013- 14 బడ్జెట్ రీ అప్రాప్రియేషన్ చేయాలనే అంశాన్ని వాయిదా వేశారు.
60 వేలపై అయోమయం: నగరంలో 60 వేల అక్రమ నిర్మాణాలున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్ని నిర్మాణాలెక్కడ ఉన్నాయో తెలియక జీహెచ్‌ఎంసీ అధికారులు అమోమయానికి గురవుతున్నారు. బీపీఎస్ పథకం అమల్లో ఉన్నప్పుడు అందిన 2.05 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 60 వేల దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటినే సీఎం అక్రమ నిర్మాణాలుగా చెబుతున్నారా అనేది అంతుబట్టక జీహెచ్‌ఎంసీ అధికారులు తిరిగి అక్రమ నిర్మాణాల లెక్కల్లో పడ్డారు.