employment opportunity
-
స్కిల్ హబ్, కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు
సాక్షి, మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో స్కిల్ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని సమావేశ మందిరంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు చెందిన 150 మంది ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ స్థాపనలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ హబ్‌లు, కాలేజీలు ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లేదా, ఐటీఐ, లేదా డిగ్రీ కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా కోర్సుల ప్రారంభానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. యువతీయువకులకు ఉద్యోగావకాశాలు రాష్ట్రంలోని యువతీయువకులందరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ చెప్పారు. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పాలిటెక్నిక్, ఐటీఐ, కాలేజీల ప్రిన్సిపాల్స్, టీపీవోలు, నోడల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో ఆయన విడివిడిగా శనివారం సమావేశమయ్యారు. ముందుగా ఆయన పలు ప్రరిశ్రమలకు చెందిన వివిధ హోదాల్లోని 30 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో ఆయన విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీకి పనికొచ్చే నైపుణ్యాభివృద్ధి కోర్సుల ఏర్పాటు విషయమై ఆయన చర్చించారు. ప్రతి కోర్సు పరిశ్రమతో అనుబంధంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంటు కోర్సు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఆ పరశ్రమలే ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నాటికి స్కిల్ హబ్‌లు, స్కిల్ కాలేజీలు ప్రారంభమవుతాయని డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. తమ పరిశ్రమల్లో ఉన్న శిక్షణ కేంద్రానికి శిక్షణనిచ్చే ఫ్యాకల్టీ కావాలని, మరికొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తామే శిక్షణనిస్తామన్నారు. కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ స్కిల్ కాలేజీల్లో అవసరమైన ల్యాబ్‌లు పెట్టి తాము శిక్షణనిస్తామని ఇందుకు అవసరమైన స్థలం ఇవ్వాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రామకోటిరెడ్డి, కార్పొరేట్ కనెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.సత్యప్రభ ప్రసంగించారు. కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి, భీమిలి, నర్శీపట్నం, అనకాపల్లి ఆముదాలవలస, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మురళీకృష్ణ, జీవీ రామచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఏపీఎస్ఎస్డీసీ వైజాగ్ నోడల్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. (చదవండి: సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు) -
నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి
హోంమంత్రికి అమరవీరుల కుటుంబాల వేదిక వినతి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ‘అమరవీరుల కుటుం బాల వేదిక’ సోమవారం సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి ఒక వినతిపత్రం అందజేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలైన ‘విద్యార్హతల ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగ అవకాశం, ఒక ఇల్లు, మూడెకరాల భూమి, ప్రత్యేక ఆరోగ్య కార్డు, తల్లిదండ్రులకు పింఛన్, ఆయా కుటుంబాలు నివసించే గ్రామాలలో అమరవీరుల స్తూపం నిర్మాణం’ వంటి వాటిని త్వరితగతిన చేపట్టాలని విన్నవించింది. -
సర్‘కారు’ సాయం
మరో 600 మందికి కార్లు డ్రైవర్ కమ్ ఓనర్ పథకంతో లబ్ధి సీఎం కేసీఆర్ సిటీబ్యూరో: డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా మరో 600 మందికి ఉపాధి అవకాశం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రక్రియను చేపట్టాలన్నారు. నగరంలో రెండు దశల్లో 408 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారని... మరో 600 మందికి ఆ పథకాన్ని వర్తింపచేస్తే బాగుంటుందని స్పెషలాఫీసర్ విజ్ఞప్తి చేయడంతో సీఎం అంగీకరించారు. శుక్రవారం ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం ద్వారా చేపట్టిన కారుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ... యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆరువేల మందికి ఈ సదుపాయం వర్తింపజేసినా, ఇంకా ఎందరికో ఉపాధి కల్పించగల స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సుమారు రూ.21 కోట్ల విలువైన కార్లు లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు. ఇందులో రూ.3 కోట్లకు పైగా సబ్సిడీ ఉందన్నారు. లబ్ధిదారులకు రూ.50 వేల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మారుతి సంస్థ అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, డాక్టర్ రాజయ్య, రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, ఎమ్డీసలీమ్, ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, కనకారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తీగల కృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిస్డ్‌కాల్ కొట్టు.. ఉద్యోగం పట్టు
నగరంలో ‘ఈ-వ్యాన్’ సదుపాయం ఉన్న చోటు నుంచే యువతకు ఉద్యోగ అవకాశం పథకాన్ని ప్రారంభించిన మేయర్ మాజిద్ సాక్షి, సిటీబ్యూరో:‘మీరు నిరుద్యోగులా... ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా?... ఇకపై ఆ అవసరం లేదు. ఉన్న చోటు నుంచే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఉద్యోగం కోసం మీ పేరు నమోదైనట్టే.. ఆపై అవసరమైన శిక్షణ.. ఇంటర్వ్యూ.. ఉద్యోగం మీకొచ్చినట్టే’.. ఈ ప్రయోగాత్మక పథకాన్ని జీహెచ్ఎంసీ శనివారం ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి జ్యోతి వెలిగించి పథకాన్ని ప్రారంభించారు. టీఎంఐ సంస్థ సాంకేతిక సహకారంతో జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఈ-వ్యాన్ (ఎంప్లాయ్మెంట్ వ్యాన్)ను కూడా మేయర్ ప్రారంభించారు. మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ కార్పొరేషన్ చేయని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిరుద్యోగులు 040-71012014 నెంబర్‌కు ఫోన్ చేస్తే.. కార్యాలయ పనిదినాల్లో జీహెచ్ఎసీ నుంచి వారికి ఫోన్ కాల్ వెళ్తుందన్నారు. విద్యార్హతలకు తగిన ఉద్యోగాల గురించి వివరించడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ-జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్లో కనీసం 10 ఈ-వ్యాన్లు, 25 ఈ-జోన్ కేంద్రాలు అవసరమన్నారు. వేదికనుంచే మల్కాజిగిరిలోని ఈ-జోన్ కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా మేయర్ ప్రారంభించారు. అక్కడున్న నిరుద్యోగులతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఎన్నో పథకాలు.. ఈ-వ్యాన్‌లో ఉండే సదుపాయాలతో నిరుద్యోగుల వివరాలు నమోదు చేస్తారని.. అనంతరం వారి అర్హతలకు తగిన ఉద్యోగాల గురించి ఈ-జోన్ కేంద్రాల్లో తెలుపుతారని, అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతోపాటు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఈ-వ్యాన్ ఆయా బస్తీల్లోని నిరుద్యోగులందరినీ ఒక చోటకు చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జోన్‌కొకటి చొప్పున ఐదు ఈ-వ్యాన్లు పనిచేస్తాయన్నారు. ఈ-వ్యాన్ ద్వారా ఏటా 12వేల మందికి ఉపాధి చూపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టీఎంఐ సంస్థ చైర్మన్, ఎండీ మురళీధరన్ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి చూపాలని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు.