సాక్షి, మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో స్కిల్ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని సమావేశ మందిరంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు చెందిన 150 మంది ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమయ్యారు.
స్కిల్ యూనివర్సిటీ స్థాపనలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ హబ్‌లు, కాలేజీలు ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లేదా, ఐటీఐ, లేదా డిగ్రీ కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా కోర్సుల ప్రారంభానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.
యువతీయువకులకు ఉద్యోగావకాశాలు
రాష్ట్రంలోని యువతీయువకులందరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ చెప్పారు. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పాలిటెక్నిక్, ఐటీఐ, కాలేజీల ప్రిన్సిపాల్స్, టీపీవోలు, నోడల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో ఆయన విడివిడిగా శనివారం సమావేశమయ్యారు. ముందుగా ఆయన పలు ప్రరిశ్రమలకు చెందిన వివిధ హోదాల్లోని 30 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో ఆయన విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీకి పనికొచ్చే నైపుణ్యాభివృద్ధి కోర్సుల ఏర్పాటు విషయమై ఆయన చర్చించారు.
ప్రతి కోర్సు పరిశ్రమతో అనుబంధంగా ఉంటుంది. స్కిల్ డెవలప్‌మెంటు కోర్సు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఆ పరశ్రమలే ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నాటికి స్కిల్ హబ్‌లు, స్కిల్ కాలేజీలు ప్రారంభమవుతాయని డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. తమ పరిశ్రమల్లో ఉన్న శిక్షణ కేంద్రానికి శిక్షణనిచ్చే ఫ్యాకల్టీ కావాలని, మరికొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తామే శిక్షణనిస్తామన్నారు. కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ స్కిల్ కాలేజీల్లో అవసరమైన ల్యాబ్‌లు పెట్టి తాము శిక్షణనిస్తామని ఇందుకు అవసరమైన స్థలం ఇవ్వాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాస్కర్ అన్నారు.
కార్యక్రమంలో ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రామకోటిరెడ్డి, కార్పొరేట్ కనెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.సత్యప్రభ ప్రసంగించారు. కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి, భీమిలి, నర్శీపట్నం, అనకాపల్లి ఆముదాలవలస, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మురళీకృష్ణ, జీవీ రామచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ వైజాగ్ నోడల్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment