సర్‘కారు’ సాయం
మరో 600 మందికి కార్లు
డ్రైవర్ కమ్ ఓనర్ పథకంతో లబ్ధి
సీఎం కేసీఆర్
సిటీబ్యూరో: డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా మరో 600 మందికి ఉపాధి అవకాశం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రక్రియను చేపట్టాలన్నారు. నగరంలో రెండు దశల్లో 408 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారని... మరో 600 మందికి ఆ పథకాన్ని వర్తింపచేస్తే బాగుంటుందని స్పెషలాఫీసర్ విజ్ఞప్తి చేయడంతో సీఎం అంగీకరించారు. శుక్రవారం ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం ద్వారా చేపట్టిన కారుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ... యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆరువేల మందికి ఈ సదుపాయం వర్తింపజేసినా, ఇంకా ఎందరికో ఉపాధి కల్పించగల స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సుమారు రూ.21 కోట్ల విలువైన కార్లు లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు.
ఇందులో రూ.3 కోట్లకు పైగా సబ్సిడీ ఉందన్నారు. లబ్ధిదారులకు రూ.50 వేల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మారుతి సంస్థ అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, డాక్టర్ రాజయ్య, రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, ఎమ్‌డీసలీమ్, ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, కనకారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, తీగల కృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.