మీ సేవలు మరువలేం
జీహెచ్‌ఎంసీ పాలకమండలికి వీడ్కోలు
నేటితో పదవీ కాలం పూర్తి గ్రూప్ ఫొటో దిగిన కార్పొరేటర్లు
మేయర్, సభ్యులకు అధికారుల ప్రశంసలు
జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మేయర్ సహా పాలక మండలి సభ్యులకు అధికారులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. విందు ఏర్పాటు చేశారు. సభ్యులంతా కలసి గ్రూప్ ఫొటో దిగారు. పార్టీలు, విభేదాలు పక్కన పెట్టి... కాసేపు కులాసా కబుర్లతో గడిపారు. పాలనా కాలంలో తాము అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళా కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌లతో కలసి ప్రత్యేకంగా ఫొటో దిగారు. కార్పొరేటర్ల సేవలను అధికారులు కొనియాడారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలక మండలి గడువు బుధవారంతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులకు అధికారులు మంగళవారం వీడ్కోలు సమావేశం, గ్రూప్ ఫొటో, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదేళ్ల పాటు కార్పొరేటర్లు అందించిన సేవలను కొనియాడుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. జీహెచ్‌ఎంసీ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధికారులకు కార్పొరేటర్లు ఎంతగానో సహకరించార ని గుర్తు చేసుకున్నారు. పాలకమండలి సమన్వయం, సహకారంతోనే ఎన్నో పనులు చేయగలిగామని చెప్పారు. మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కమార్, వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు వాజిద్‌హుస్సేన్(కాంగ్రెస్), నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ)లు మాట్లాడుతూ అధికారులు, కార్పొరేటర్ల సమష్టి కృషితోనే లోటు బడ్జెట్‌తో ఉన్న కార్పొరేషన్ ఆర్థికంగా బలపడిందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సకల జనుల సమ్మె, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు వంటివి జరిగినప్పటికీ, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లామన్నారు. జలమండలి ఎమ్‌డీ జగదీశ్వర్, ట్రాఫిక్ చీఫ్ జితేందర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్లు బాబు అహ్మద్, పీఎస్ ప్రద్యుమ్న, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇద్దరు మేయర్ల పాలన
2009 డిసెంబర్4న జీహెచ్‌ఎంసీ పాలకమండలి కొలువుదీరింది. ఐదేళ్ల కాలాన్ని ఇద్దరు మేయర్లు పంచుకున్నారు.కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం మేరకు ఇద్దరు మేయర్లుగా, ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. బండ కార్తీకరెడ్డి(కాంగ్రెస్), మాజిద్ హుస్సేన్(ఎంఐఎం)లు మేయర్లుగా వ్యవహరించగా.. జాఫర్‌హుస్సేన్(ఎంఐఎం), జి.రాజ్‌కుమార్(కాంగ్రెస్)లు డిప్యూటీ మేయర్లుగా పనిచేశారు. వీరిలో జాఫర్ హుస్సేన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి మూడేళ్లు, ఎంఐఎం అభ్యర్థి రెండేళ్లు మేయర్ పదవిలో ఉండాల్సి ఉంది. మారిన పరిణామాల నేపథ్యంలో ఎంఐఎంకు మూడేళ్లు అవకాశం లభించగా... కాంగ్రెస్‌కు రెండేళ్లు అధికారంలో ఉండే అవకాశం లభించింది. మాజిద్‌హుస్సేన్ నగరానికి 24వ మేయర్ గా వ్యవహరించారు.