మేయర్ చాంబర్ సొగసు చూడతరమా....
హైదరాబాద్ : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉన్నత స్థానాల్లోని వారు తలచుకుంటే సౌకర్యాలకు కొరతా... అన్నట్టుంది జీహెచ్ఎంసీలో పరిస్థితి. ఓ వైపు గ్రేటర్ ప్రజలు తాగే నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నా పట్టించుకోని పెద్దలు తమ కార్యాలయను మాత్రం ఆగమేఘాలపై సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అందుకోసం భనవం గోడలు కూల్చేసి అద్దాలతో పచ్చని మైదానం కనువిందు చేసేలా తీర్చి దిద్దుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ళలోనే తన చాంబర్కు మార్పులు చేయించి..సీత్రూ గార్డెన్ను ఏర్పాటు చేసుకోగా తాజాగా మేయర్ మాజిద్ తన చాంబర్కు సొబగులు దిద్దాలని ఆదేశించారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం లక్షల రూపాయిలు వెచ్చిస్తున్నారు.
ఇక కమిషనర్ రూ.5కే భోజనం పథకాన్ని ప్రారంభించగా..దానికి లభించిన ఆదరణతో మేయర్ రూపాయికే టిఫిన్ కార్యక్రమం ప్రారంభించాలంటున్నారు. కమిషనర్ చాంబర్ను అందంగా తీర్చిదిద్దుకోగా లేనిది... తన చాంబర్ నెందుకు అద్దంలా తీర్చిదిద్దరాదనుకున్నారో ఏమో! తన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగిసిపోతున్న తరుణంలో మేయర్ ఈ పనికి సిద్ధం కావటం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశమైంది.