
పార్టీ ఏం చెబితే అదే చేస్తా!
మీరు నాంపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటున్నారు. ఇంకొన్ని పేర్లూ వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?.. ఎమ్మెల్యే.. ఎంపీ.. దేన్ని ఎంచుకుంటారు?’.. శుక్రవారం మేయర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాజిద్ హుస్సేన్‌ను చుట్టుముట్టిన ప్రశ్నలివి.
మజ్లిస్ పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని, అంతకుమించి వ్యక్తిగత నిర్ణయమంటూ ఉండదని ఆయన బదులిచ్చారు. ప్రథమ పౌరుడనేది హోదా అయినప్పటికీ.. నగరానికి ప్రథమ సేవకుడిగానే పనిచేశానన్నారు. మేయర్‌గా పనిచేసిన 26 నెలల కాలం సంతృప్తినిచ్చిందని, అన్నివర్గాల సహకారంతో బాధ్యతలు నిర్వహించానన్నారు. ఇళ్ల వద్దకే బర్త్‌సర్టిఫికెట్లు, వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ సేవలు, పేదలకు సబ్సిడీ పై భోజనం, బస్తీల్లో నీటిశుద్ధి ప్లాంట్లు వంటి పనులు బాగా సంతృప్తినిచ్చాయన్నారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా, లోటు బడ్జెట్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఖజానాను పరిపుష్టం చేశామన్నారు.
ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా ఉద్యోగాల భర్తీ, శివార్లలోని 36 గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం కాకుండా కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా తీర్మానించామని గుర్తు చేశారు. మెట్రోపాలిటన్ సిటీ కి తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందన్నారు. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు, తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశం మేరకు తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కొత్తగా రాబోయే కాంగ్రెస్ పార్టీ మేయర్‌కు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్, పార్టీ ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు.
22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
తన రాజీనామాకు ఆమోదం తెలిపేందుకు వీలుగా ఈనెల 22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మాజిద్ హుస్సేన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు మేయర్ రాజీనామాను సర్వసభ్య సమావేశం ఆమోదించాలి. ఆ సమావేశాన్ని మేయరే ఏర్పాటు చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ ఆశావహుల్లో ఆశలు..
మాజిద్ హుస్సేన్ రాజీనామాతో.. మేయర్ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఆశలు చిగురించాయి. కొత్తగా మేయర్‌గా ఎన్నికయ్యే వారికి ఆరేడు నెలల అవకాశమే ఉన్నప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా, ఓవైపు అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే మేయర్ పదవికి అవకాశం రానుండటంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ టిక్కెట్ అడగాలా? లేక మేయర్ పదవి కోరుకోవాలా? అనే ఊగిసలాటలో ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. మేయర్ రాజీనామాతో డిప్యూటీ మేయర్‌గా ఉన్న రాజ్‌కుమార్ (కాంగ్రెస్) సైతం రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన రాజీనామాను మేయరే ఆమోదించాల్సి ఉన్నందున.. 22లోగా ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ రాజీనామా చేయగలరనే అభిప్రాయాలున్నాయి.
‘‘మాజిద్ హుస్సేన్ ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ డివిజన్ కార్పొరేటర్. రేపు ఎమ్మెల్యేగా నిలబడాలా.. ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏం చెబితే అది చేస్తా. ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ బాధ్యత చూడటమే నా పని’’
- శుక్రవారం సాయంత్రం మేయర్ పదవికి రాజీనామా చేసిన
అనంతరం మాజిద్ హుస్సేన్