
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్‌పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అసలు ఈ కేసు వివాదం ఏంటి..?
డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.