మేయర్ పదవికి నేడు మాజిద్ రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తాను రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమిషనర్ సోమేష్ కుమార్ చేతికి రాజీనామా లేఖ అందించనున్నారు. కాంగ్రెస్ - మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు చెడిపోవడం, ఇప్పటికే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండు సంవత్సరాలు దాటిపోవడంతో మేయర్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ - ఎంఐఎంల మధ్య పొత్తులో భాగంగా మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని, ఎంఐఎం డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాలని, రెండేళ్ల తర్వాత పదవులు మార్చుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే, తొలిసారి మేయర్ పదవి చేపట్టిన బండ కార్తీకరెడ్డి రెండు సంవత్సరాల తర్వాత మరొ కొంత కాలం పాటు మేయర్ పదవిలో కొనసాగడంతో, మాజిద్ హుస్సేన్ కూడా రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత మరికొంత కాలం ఉండి.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకు వద్దని ఎంఐఎం స్పష్టం చేసింది.
ఇక మేయర్ పదవిని విజయవంతంగా నిర్వర్తించిన మాజిద్ హుస్సేన్.. నగర ప్రజల నోళ్లల్లో బాగా నానారని, ఆయనకు మంచి పేరే వచ్చిందని ఎంఐఎం అధిష్ఠానం భావిస్తోంది. అందుకే మాజిద్ చేత నాంపల్లి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడున్న విరాసత్ రసూల్ ఖాన్ ను అవసరమైతే వేరే నియోజకవర్గానికి మార్చడం లేదా ఏమైనా ప్రత్యామ్నాయం చూడటం లాంటి యోచనలు కూడా చేస్తున్నారు.