సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు .. మేయర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు అప్పగించేందుకు వీలుగా ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనేదిప్పుడు జీహెచ్‌ఎంసీలో సస్పెన్స్‌గా మారింది. రెండుపార్టీల ఒప్పందాని కనుగుణంగా ఐదేళ్ల పాలకమండలిలో తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఉండాలి. ఎంఐఎం మధ్యన రెండేళ్లు తమ పార్టీ వారిని మేయర్‌గా ఉంచుతుంది.
ఈ లెక్కన గత డిసెంబర్‌లోనే ఎంఐఎం గడువు ముగిసింది. కాగా, మాజిద్ బాధ్యతలు స్వీకరించిన సమయాన్ని, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ జనవరి 3 నాటికైనా ఆయన రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ, ఎంఐఎం నుంచి ఆ దిశగా ఎలాంటి సంకేతాల్లేవు.
ఆసక్తి చూపని కాంగ్రెస్..
రాష్ట్ర విభజన అంశం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మేయర్ పదవి నాశిస్తున్న కొందరు కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు మాజిద్ రాజీనామాను కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల క్రితం ఎంఐఎంకు లేఖ పంపింది. దాదాపు నెల రోజులవుతున్నా దానిపై ఎంఐఎం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు.
కాంగ్రెస్ సైతం ఆ అంశాన్ని అంతటితో వదిలేసిందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న ఆరు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో తమ పార్టీకి ఖాయంగా రానున్న మూడు రాజ్యసభ స్థానాలు కాక మరో స్థానాన్ని అదనంగా దక్కించుకునేందుకు ఎంఐఎం మద్దతు పొం దాలనే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ నేతలున్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్లే చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖ రి కారణంగా ఎంఐఎం.. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నప్పటికీ, ఇటు జీహెచ్‌ఎంసీలోను, అటు ఇతరత్రా కాంగ్రెస్ నేతలతోనూ ఎంఐఎం సఖ్యతనే కొనసాగిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో, రాజ్యసభ ఎన్నికల్లో ఎంఐఎం సహకారాన్ని తీసుకునేందుకుగాను కాంగ్రెస్‌కు దక్కాల్సిన మేయర్ పదవీకాలాన్ని ఎరగా వేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ కోసం.. ?
ఎంఐఎంకు ఏడు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఒక ఎంపీ స్థానం ఉంది. వీటిని తమకు అనుకూలంగా మలచుకుంటే రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ నేతలు కొందరు ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. మేయర్ పదవీకాలం 10నెలలు కూడా లేకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న వారు దాని కంటే రాజ్యసభ సీటు ద్వారానే ఎక్కువ ప్రయోజనముంటుందనే తలంపుతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అది వెలువడితే జీహెచ్‌ఎంసీ నుంచి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడుతుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు. ఎటొచ్చీ మరో నాలుగైదు నెలలు మాత్రమే మేయర్ వైభోగం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే మేయర్ సీటు కోసం పట్టుబట్టకుండా ఎంఐఎం మద్దతుతో రాజ్యసభ సీటు పొందాలనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే మాజిద్ రాజీనామా కోసం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఏదో ఒకటి స్పష్టం చేయాలని మేయర్ పదవి కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరుతున్నారు. మేయర్ పదవి నాశిస్తున్న వారు అది తమ పార్టీకిస్తారో, లేదో తెలిస్తే కనీసం డిప్యూటీ మేయర్ పదవిలోనైనా మరొకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
మేయర్ ‘కుర్చీ’పై వీడని సస్పెన్స్
Published Sun, Jan 19 2014 6:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement