మాజీ మంత్రిగారి బంపర్ ఆఫర్ : సై అంటే రూ.3 లక్షలు!
మాజీ మంత్రి కోండ్రు బంపర్ ఆఫర్?
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే నజరానా
అయినా ముందుకురాని నేతలు
ఒక్క వంగరలోనే ఇద్దరి నామినేషన్
మిగతా మండలాల్లో పడని బోణీ
రాజాం: జాతీయ పార్టీ తరఫున పోటీ చేయడమంటే చిన్న విషయం కాదు. గెలిచినా.. ఓడినా పోటీ చేశారన్న గుర్తింపే చాలన్నట్లు చాలామంది టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు. అదీ.. దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అయితే ఇక చెప్పేదేముంది. మహా మహా నేతలే టిక్కెట్లు దొరక్క ఉసూరుమన్న సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్థానిక ఎన్నికలకే అభ్యర్థులు దొరకని దీనస్థితిలో పడిపోయింది. అందుకేనేమో.. మాజీమంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.
తన నియోజకవర్గంలో ప్రాదేశిక నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడితే చాలు.. రూ. 3లక్షలు ఇస్తామన్నది సదరు ఆఫర్ సారాంశం. ‘రండి బాబు.. రండి.. బీ ఫారంతోపాటు రూ.3 లక్షలు తీసుకెళ్లండి.. పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయండి’.. అని తన అనుచరగణం ద్వారా స్థానిక నాయకులకు ఎర వేస్తున్నారు. అయినా ఇప్పటివరకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగుస్తున్నప్పటికీ నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున ఒక్క వంగర మండలంలో రెండు ఎంపీటీలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి.
నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. వంగరలో 12 ఎంపీటీసీలకు గాను రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో కాంగ్రెస్ తరఫున బోణీ పడలేదు. గురువారం మధ్యాహ్నం 3గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. దీంతో మాజీ మంత్రి పరిస్థితి కుడితిలో పడిన ఎలక చందంగా తయారైంది. తను ప్రకటించిన బంపర్ ఆఫర్ చివరి రోజైనా నేతలను అకర్షించి అభ్యర్థులుగా మారుస్తుందేమో చూడాలి.