సాక్షి, పెద్దపల్లి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ అంశాలతో ప్రభావితమయ్యే నియోజకవర్గమవడం, ఎస్సీ స్థానం కావడంతో ఇక్కడ గెలుపును ఆ పార్టీ నిర్దేశించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయ అంశాల ఆధారంగా తమకు మద్దతు పలుకుతారని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది.
ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న నేతలు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ దృష్టిలో పడేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వాల్‌రైటింగ్స్ చేయిస్తూ, ఫ్లెక్సీలు కూడా కట్టిస్తున్నారు. వికసిత్ సంకల్ప్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.
టీడీపీ, బీజేపీ పోత్తులో గెలుపు!
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా నిలుస్తోంది. అలాగే బీజేపీ సైతం ప్రత్యక్షంగా పోరులో నిలవక, పోత్తులో భాగంగా టీడీపీకి పలుమార్లు సీటు కేటాయించింది. అందులో భాగంగా 2004లో టీడీపీ తరుఫున డాక్టర్ సుగుణకుమారి పోటీ చేసి గెలిచారు. 2019లో బీజేపీ తరుఫున ఎస్.కుమార్ నిలవగా 92,606 ఓట్లు సాధించారు. పార్లమెంట్ పరిధిలో గతంలో కంటే ఓటు బ్యాంకు స్థిరంగా పెరగడాన్ని గమనిస్తోన్న అధిష్టానం గతంలో వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించుకుంటుంది.
పొత్తులో టీడీపీ గెలిచిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతవరణం నెలకొన్న నేపథ్యంలో సరైన అభ్యర్థిని దింపి పక్కా ప్రణాళికతో గెలవవచ్చని భావిస్తుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపేలా అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గంలోని మాజీ ఎంపీ, మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
ఎంపీ టికెట్ రేసులో వీరే..
పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్ నరహరి క్లాస్‌మేట్, అతను స్థాపించిన ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్‌కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అయోధ్య రవి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, కరీంనగర్‌కు చెందిన బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్‌రెడ్డి, క్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే వీరిలో ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్ లిస్టు బీజేపీ అధిష్టానానికి చేరింది. అయితే పార్టీ టికెట్ వీరిలో ఎవరికై నా ఇస్తారా, చివరి నిమిషంలో మరెవరినైనా రంగంలోకి దింపుతారా అనే అంశం ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment