దేశంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు వేళ్లానుకునిపోయిన సమయం అది. ఆ సమయంలో.. భర్త చనిపోవడంతో ఆమెనే ప్రధాని అవుతుందని అంతా భావించారు. కానీ, పీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలనూ వద్దనుకుని పార్టీ క్యాడర్‌ను, యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశారామె. దాదాపు అర్ధదశాబ్దంపాటు రాజకీయం ఊసే ఎత్తలేదు. అయితే.. పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో దారుణ ఓటమి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దశాబ్దంపాటు పవర్‌ఫుల్ ఉమెన్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకోలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా.. సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ పరిస్థితులను కొంతైనా చక్కబెడుతూ వచ్చారు.
సోనియా గాంధీ.. అప్పటిదాకా రాజీవ్ గాంధీ సతీమణి. భర్త మరణాంతరం దాదాపు అర్థదశాబ్దంపాటు రాజకీయాల్లోకి రావడానికి అనాసక్తిని కనబరిచారు. అయితే.. 1996 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఛిన్నాభిన్నం అయ్యింది. మూకుమ్మడిగా సీతారాం కేసరి నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీలోని చాలామంది సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఆ పరిణామాల నడుమ రాజకీయాల్లోకి అన్యమనస్కంగానే అడుగుపెట్టారామె.
1997 కలకత్తా(కోల్‌కతా)లో జరిగిన ప్లీనరీ సెషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్నారామె. ఆపై 62 రోజులకే ఆమెకు పార్టీ బాధ్యతలు ఆఫర్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు . అయితే.. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె పేరు తెర మీదకు రావడంతో.. 1999 మే నెలలో పార్టీలో సీనియర్లు ముగ్గురు వ్యతిరేక గళం వినిపించారు. విదేశీ మూలాలు ఉన్న ఆమె.. భారత్‌కు ఎలా ప్రధాని అవుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేసేసి బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారామె. కానీ, ఆమెను నిలువరించిన పార్టీ.. ఆ ముగ్గురు రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ముగ్గురే శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్.. వాళ్లు స్థాపించుకున్న పార్టీనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. వీళ్లే కాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇది ఆమె ప్రధాని పదవికి అడ్డు తగిలిన మొదటి సందర్భం.
1999 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ.. కర్ణాటక బళ్లారి నుంచి, ఉత్తర ప్రదేశ్ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారామె. ఈ రెండింటిలో ఆమె అమేథీనే ఎంచుకున్నారు. ఇక బళ్లారిలో ఆమె ఓడించింది ఎవరినో తెలుసా?.. చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్‌ను.
సోనియాగాంధీ బంపర్‌మెజార్టీతో నెగ్గినప్పటికీ.. వాజ్‌పేయి పేరు, ఛర్మిష్మా, ఇతరత్రా కారణాలతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారామె. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. అవతలి అభ్యర్థి జితేంద్ర ప్రసాదను 97 శాతం మార్జిన్‌తో ఓడించారామె. అప్పటి నుంచి ఓటింగ్ లేకుండానే ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు.. 2003లో ఏకంగా వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె.
అధికారంలోకి యూపీఏ కూటమి
2004 సార్వత్రిక ఎన్నికల్లో.. సోనియా గాంధీ ఆమ్ ఆద్మీ(ఆర్డీనరీ మ్యాన్) పేరుతో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించారు. అప్పటికే బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి.. 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సోనియా గాంధీ. దాదాపు 15 పార్టీల కూటమి యూపీఏ పేరుతో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఎన్నికల విజయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీనే దేశానికి ప్రధాని కాబోతున్నారంటూ చర్చ మొదలైంది. కానీ..
► ప్రతిపక్ష కూటమి సోనియా ప్రధాని కాకుండా మోకాలడ్డింది. సుష్మా సర్వాజ్ అయితే ఏకంగా హెచ్చరికలకే దిగారు. సోనియా గనుక దేశానికి ప్రధానిని చేస్తే.. తాను గుండు చేయించుకుంటానని, కటిక నేలపై నిద్రిస్తానని శపథం చేసి.. రాజకీయ దుమారం రేపారు. మరోవైపు ఎన్డీయేలోని పక్షాలు న్యాయపరమైన కారణాలు చూపించి అభ్యంతరాలు లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం.. కోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమెకు ఊరటనే ఇచ్చింది.
► రాజకీయంగా చెలరేగుతున్న రగడ కారణంగా.. ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయానికి వచ్చారామె. బదులుగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారామె. పార్టీ నేతలు కూడా అందుకు అంగీకరించారు. ఆ సమయంలో ఆమె త్యాగనీరతిని అభిమానులు ఆకాశానికెత్తగా.. పొలిటికల్ స్టంట్ అంటూ ప్రత్యర్థులు పెదవి విరిచారు. ఇది రెండోసారి.
► ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వివాదం కారణంగా.. ఎంపీ పదవికి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదవికి ఆమె రాజీనామా ప్రకటించారు. ఆపై 2006 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో రాయ్ బరేలీ నుండి 400,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
► 2009లో ఆమె నాయకత్వంలోనే మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో కొలువు దీరింది. ఆ ఎన్నికల్లో 206 లోక్‌సభ సీట్లు గెలవగా.. 1991 నుంచి అప్పటిదాకా ఏపార్టీ కూడా అంత సీట్లు గెలవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ నుంచి ఆమె గెలుపొందారు.
► 2013లో.. పదిహేనేళ్లపాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వ్యక్తి రికార్డును నెలకొల్పారామె.
► 2013లోనే.. ఎల్జీబీటీ హక్కులను బలపరుస్తూ ఐపీసీ సెక్షన్ 377 మద్దతు ప్రకటించారు.
► 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు 44, మొత్తంగా యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే.. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు.
► అదే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల విభజన ద్వారా సోనియమ్మగా పార్టీ నేతలచేత పిలిపించుకున్నారామె.
► ప్రతిపక్షాన్ని బంధించే జిగురు లాంటి వ్యక్తి సోనియా. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు వామపక్ష దిగ్గజ నేత సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి. కాంగ్రెస్ పగ్గాలు సోనియాకా? రాహుల్‌కా? అనే చర్చ నడిచిన సమయంలో ఆయన సోనియాకే ఓటేశారు.
► 2016 నుంచి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. 2017 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి 49వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. తిరిగి.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం ద్వారా తెర మీదకు వచ్చారు. బీజాపూర్‌లో ఆమె బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో బీజాపూర్ పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. జనతా దళ్ (సెక్యులర్)తో పోత్తు విషయంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు.
► 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్-యూపీఏ కూటమి ఓటమిపాలైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో.. తిరిగి సోనియా గాంధీకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.
► కాంగ్రెస్‌కు కుటుంబ పార్టీ అనే మచ్చ చెరిపేసేందుకు.. శాశ్వత అధ్యక్ష ఎన్నిక జరగాలని, ఆ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఆమె అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. అయితే గెహ్లాట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోగా.. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించి కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
► 1999లో అమేథీ నుంచి 4,18,960 ఓట్లు(67.12 శాతం ఓటు షేర్), బళ్లారి నుంచి 4,14,650 ఓట్లు(51.70 శాతం ఓటు షేర్) మెజార్టీతో ఆమె నెగ్గారు. ఆ తర్వాత 2004 ఎన్నికలో రాయ్ బరేలీ నుంచి 3,90,179 ఓట్ల మెజార్టీతో.. 2006 ఉప ఎన్నికలో ఏకంగా 4,74,891 ఓట్ల మెజార్టీతో ఆమె నెగ్గారు. తిరిగి 2009 ఎన్నికలో 4,81,490 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 5,26,434 ఓట్ల మెజార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5,34,918 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ప్రతీ ఎన్నికకు ఆమె విక్టరీ మెజార్టీ గణనీయంగా పెరుగుతూ పోవడం గమనార్హం.
► 2004-14 అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో దేశంలో శక్తివంతమైన మహిళలు, ప్రభావశీలుర జాబితాలోనూ ఆమె ప్రతీ ఏడాది నిలుస్తూ వచ్చారు.
► 2007లో టైమ్స్ మ్యాగజైన్.. టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో సోనియా గాంధీకి చోటు ఇచ్చింది.
► 2013లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో 21వ ర్యాంక్, మహిళల్లో 9వ ర్యాంక్ కట్టబెట్టింది.
► మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. 2007 అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. ఆనాటి నుంచి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తూ వస్తున్నారు(ఐరాసలో తీర్మానం పాస్ అయ్యింది 2007 జులై 15న).
► నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూపీఏ చైర్‌పర్సన్‌గానూ ఆమె కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్, రైట్ టు ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ చట్టంగా మారడం అనే రెండు ప్రధానమైనవి ఉన్నాయి.
రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్ ప్లీనరీలో 76 ఏళ్ల సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. పొలిటికల్ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన సందర్భంలో..
Comments
Please login to add a commentAdd a comment