టార్గెట్‌.. తెలంగాణ  | Sonia Gandhi Rahul and other top leaders of AICC coming Telangana | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. తెలంగాణ 

Published Tue, Sep 5 2023 12:52 AM | Last Updated on Tue, Sep 5 2023 4:14 AM

Sonia Gandhi Rahul and other top leaders of AICC coming Telangana - Sakshi

హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ను పరిశీలిస్తున్న మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌:  సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్‌ అతిరథ మహారథులు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్‌ కమిటీ సభ్యులు.. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శాసనసభాపక్ష నాయకులు.. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలోని కీలక కాంగ్రెస్‌ నేతలంతా తెలంగాణకు రానున్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీని వెనుక కాంగ్రెస్‌ అధిష్టానానికి పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం దక్కించుకునే ప్రణాళికలో భాగంగానే.. హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో..    

రాష్ట్ర పార్టీ వ్యూహాలకు తోడుగా నిలిచి, చేయూత అందించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైందని అంటున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారేలా, ప్రజల్లో భరోసా కల్పించేలా.. సోనియా సహా పార్టీ కీలక నేతలు ఎన్నికల హామీలను ప్రకటించనున్నారని చెప్తున్నాయి. 

నియోజకవర్గానికో నేత పర్యటన.. 
కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించనున్న ఐదు గ్యారెంటీ కార్డు స్కీమ్‌లతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిïÙట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలు కార్యాచరణ సిద్ధంచేశారు. ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌ సభ ముగిశాక.. 18వ తేదీన సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక్కో కీలక నేత వెళ్లి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

ఆ రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా.. 
కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన కాంగ్రెస్‌ తమ హామీలను నిలబెట్టుకునే దిశగా ముందుకెళుతోంది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ 5 గ్యారెంటీ స్కీమ్‌లను అమలుచేస్తామని హామీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, పింఛన్లు రూ.4 వేలకు పెంపు, రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్, అసైన్డ్‌ భూములపై సర్వహక్కులు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు ఈ గ్యారెంటీ కార్డు స్కీమ్‌లలో ఉంటాయని గాందీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి.అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని.. ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించనున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ ఐదు హామీలను కూడా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్‌ 17న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీతో ఇప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు వివరిస్తున్నాయి. 

మిగతా డిక్లరేషన్ల ప్రకటన కూడా.. 
వాస్తవానికి సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ భావించింది. అయితే మేనిఫెస్టో రూపకల్పన పూర్తికాకపోవడంతో.. ఆ రోజున గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల ప్రకటనకే పరిమితం కానున్నట్టు తెలిసింది. ఇప్పటికే రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ప్రకటించనున్నారు. డిక్లరేషన్లు, ఇతర అంశాలను ఈ సభలోనే ప్రకటించాలని యోచిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి కూడా వెల్లడించారు. 
 
సమావేశాలు తాజ్‌కృష్ణాలో.. సభ పరేడ్‌ గ్రౌండ్స్‌లో.. 
సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ కోసం హైదరాబాద్‌ శివార్లలోని రిసార్టులను ఎంచుకోవాలని తొలుత భావించిన టీపీసీసీ.. చివరికి తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. గ్యారెంటీ కార్డు స్కీంల ప్రకటన కోసం పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించనుండటంతో.. పార్టీ పెద్దలు శివార్ల నుంచి సభకు రావడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో తాజ్‌ కృష్ణాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే తాజ్‌ కృష్ణా హోటల్‌తోపాటు పరేడ్‌ గ్రౌండ్స్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ నెల ఆరో తేదీన సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 
 
తెలంగాణ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజాం సంస్థానం పరిధిలోని కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంటే ఆయనది తెలంగాణనే. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత తొలి సీడబ్ల్యూసీ సమావేశాలను తన సొంత రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టే. దీన్నిబట్టి తెలంగాణకు ఏఐసీసీ ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశాల వేదికగానే జాతీయ స్థాయి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. దేశమంతా హైదరాబాద్‌ వైపు చూస్తుంది. 
– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement