అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అధ్యక్షపదవి నుంచి దిగిపోయిన కారణంగా ఇన్నింగ్స్ ముగిసిందని ప్రకటించినా, లేక ఇతర కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించినా, ఎలాగైనా దేశ రాజకీయాలలో ఒక పెద్ద పరిణామంగానే పరిగణించాలి. ఒకప్పుడు దేశంలోనే తిరుగులేని సామ్రాజ్ఞిగా చక్రం తిప్పిన ఆమె ప్రస్తుతం రాజకీయంగా బాగా దెబ్బతిన్నారనే చెప్పాలి. అయినా ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించగలగడం , ఇంకా ఆ పార్టీ వారి గౌరవం పొందగలగడం విశేషమే .
కాంగ్రెస్ గత పాతికేళ్లలో ఉత్ధాన,పతనాలకు ఆమెనే బాద్యత వహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ,ఇతర పార్టీలతో కలిసి ఐక్య ప్రగతిశీల కూటమి పేరుతో ఒక ప్రంట్ ను ఏర్పాటు చేసి, అధికారం రావడానికి దోహదపడిన ఆమె , తదనంతర కాలంలో తనకు ఎదురు లేదన్న భావనతో తప్పుల పరంపర సాగించి కాంగ్రెస్ ను పాతాళానికి తీసుకువెళ్లారనే చెప్పాలి. పాతికేళ్ల రాజకీయ చరిత్రలో పార్టీలో చేరిన రెండు నెలలకే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. రికార్డు స్థాయిలో సుమారు 22 ఏళ్ళు ఆమె ఆ పదవిలో ఉన్నారు. సుమారు రెండున్నరేళ్లు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అద్యక్షుడుగా ఉన్నారు. గతంలో ఆమె దేశ ప్రధాని పదవికి ప్రయత్నించకపోలేదు. కానీ ఆమె విదేశీయురాలు అన్న కారణంగా ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించారు. అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉన్న శరద్ పవార్ వంటివారు కూడా ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ఒప్పుకోవడానికి నిరాకరించారు.
1999లో ఒక్క ఓటుతేడాతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని పడవేయడం, అందుకు అప్పటి ఒడిషా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గమాంగో ఓటే కారణం అవడం సంచలనం అయింది. దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగింది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో బీజేపీ ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమి విజయం సాధించింది. కానీ 2004 నాటికి ఇతర ప్రాంతీయ, వామపక్ష పార్టీ లతో కలిసి కూటమి కట్టి అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ నాయకత్వం కొంత ఉపయోగపడింది. అప్పటికి బీజేపీ ఇప్పుడున్న శక్తిమంతంగా లేకపోవడమే కారణం. పదేళ్లపాటు సోనియాగాందీ మకుటం లేని మహారాణిలా దేశాన్ని ఏలిందనే చెప్పాలి. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రదాని అయినా, ఆయన గౌరవ ప్రపత్తులు ఉన్న వ్యక్తే అయినా, మొత్తం పవర్ అంతా ఈమె చేతిలోనే ఉందన్న అభిప్రాయం ఉండేది. జాతీయ సలహామండలిని ఏర్పాటు చేసి , దానికి చైర్ పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరించారు. పలు కీలకమైన నిర్ణయాలను ఆ మండలిలో తీసుకునేవారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీతో విబేధాలు వచ్చాయి. చివరికి పీవీ మరణించాక ఆయన పార్దీవదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ లోపల పెట్టనివ్వలేదంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. మన్మోహన్ తో ఇబ్బంది లేకుండా సాగిపోయింది.
ఇదంతా ఒక కధ అయితే, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు 30 సీట్లు రావడం దేశంలో అధికారం రావడానికి ఎంతో ఉపయోగపడింది. అప్పుడు నాయకత్వం వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి బలమైన నేతగా అవతరించారు. అది గిట్టని కొందరు ఆయనకు వ్యతిరేకంగా సోనియాగాంధీ చెవినిల్లు కట్టుకుని ఫిర్యాదులు చేసేవారు. అయినా 2009లో వైఎస్ తిరిగి అధికారం సాదించడమే కాకుండా మళ్లీ ముప్పైకి పైగా లోక్ సభ స్థానాలను సాధించిపెట్టారు.ఈ ఎన్నికలలో కూడా ఏపీ నుంచి అన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టం అయ్యేది. ఈ విషయాన్ని స్వయంగా మన్మోహన్ సింగే చెప్పేవారు. ఎపిలో అన్నీ సీట్లు రావడం వైఎస్ వల్ల కాదని, అదంతా సోనియాగాంధీ ప్రభావం అని వైఎస్ వ్యతిరేకులు ప్రచారం చేసేవారు. దీనిని ఆమె కూడా నమ్మినట్లే అనిపిస్తుంది. వైఎస్‌ను ఎదగనిస్తే రాజకీయంగా ప్రమాదమని కోటరి భావించిందని అంటారు. వైఎస్ మాత్రం ఇందిరాగాంధీ కుటుంబీకులైన సోనియా, రాహుల్ గాంధీల పట్ల విధేయతను వీడలేదనే చెప్పాలి.
అయినా వైఎస్ కుటుంబానికి సోనియాగాంధీ తీరని అన్యాయం చేశారు. అనూహ్యంగా వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్‌తో రాజకీయంగా డీల్ చేసిన పద్దతి ఆమెలోని నియంతృత్వ దోరణి స్పష్టంగా కనిపించింది. పదేళ్ల అధికార సమయంలో కూడా అనేకసార్లు ఆమె తన అధికార దర్పాన్ని ప్రదర్శించినా, ఏపీ రాజకీయ పరిణామాలలో ఆమె ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని నష్టం చేసింది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలోకానీ, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించి పదహారు నెలలు జైలులో ఉంచడంలోగాని ఆమె కీలకభూమిక పోషించారని అంతా నమ్ముతారు. పైగా కాంగ్రెస్ కు ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ఈ విషయంలో చేతులు కలపడం కూడా కాంగ్రెస్‌కు తీరని నష్టం చేసింది. అధికారం బాగా తలకెక్కితే ఇలాగే చేస్తారేమో అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది.
సోనియాగాంధీ తండ్రి ఇటలీలో ఒకప్పుడు నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చేవారట. ఆయన హిట్లర్ నాజీలకు అనుకూలంగా యుద్దంలో కూడా పాల్గొన్నారట. బహుశా ఆయనలోని ఆ లక్షణాలు కొన్ని ఆమెకు వచ్చి ఉండాలి. ఆమె భర్త రాజీవ్ గాంధీ బతికి ఉన్నప్పుడు ఆమె రాజకీయాలలోకి రాకుండా, పరోక్షంగానే జోక్యం చేసుకునేవారని అంటారు. తదుపరి 1997లో ఏర్పడిన పరిణామాలలో కాంగ్రెస్‌లో చేరి అధ్యక్ష స్థానం కైవసం చేసుకున్నారు. ఆయా రాష్ట్రాలలో నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా చేసి, కాంగ్రెస్‌ను ఇప్పుడు ఈ క్షీణ దశకు తేవడంలో కూడా ఆమె పాత్ర ఉందనే చెప్పాలి. చివరికి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు రాకుండాపోయింది. శరద్ పవార్, మమత బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అజిత్ జోగి ఇలా పలువురు నేతలు సొంతంగా తమ రాష్ట్రాలలో పార్టీలు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్ర పేరుతో దేశం అంతటా పాదయాత్ర చేసినా, ఆశించినంత ఫలితం వచ్చినట్లు అనిపించడం లేదు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ చేసిన కొన్ని పిచ్చి చేష్టలు కూడా కాంగ్రెస్ కు చేటు చేశాయి. ప్రధాని పదవికి అవకాశం వస్తే వదలుకోవడం, మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను బహిరంగంగా చించివేయడం , నెలల తరబడి విదేశాలలో ఉండి రావడం వంటి చర్యలతో ప్రజలలో ఆయన నమ్మకం కోల్పోయారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవడం ఈయన వల్ల కాదన్న అభిప్రాయం బలపడింది. ఉమ్మడి ఏపీని విభజించిన తీరుతో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోయింది. జగన్‌కు అధికార పగ్గాలు దక్కకూడదన్న తలంపుతో విభజనను హడావుడిగా చేసిన ఫలితంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ తెలంగాణ ఇస్తే తన పార్టీ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముందుకు వచ్చినా, ఆమె తెలివిగా వ్యవహరించలేకపోయారు. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌కు పూర్తి గడ్డు పరిస్థితులు ఏర్పడడం జరిగిపోయింది.
సోనియాగాంధీకి ప్రధాన సలహాదారులుగా ఉన్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ అజాద్ వంటివారి వ్యవహార శైలి కూడా నష్టం చేసిందని పలువురు నమ్ముతారు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ జీరోకి వెళ్లిపోగా, తెలంగాణలో కునారిల్లిపోయి, మళ్లీ లేవడానికి నానా తంటాలు పడవలసి వస్తోంది. బెంగాల్,పంజాబ్, ఒడిషా, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, తమిళనాడు ,బీహారు వంటి ముఖ్యమైన రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడమే సమస్యగా ఉంది. పార్టీలో పాతికేళ్లపాటు, అధికారంలో పదేళ్లపాటు తన హవా సాగించిన సోనియాగాంధీ ప్రపంచలోనే శక్తిమంతమైన అతి కొద్దిమంది నేతలలో ఒకరిగా అప్పట్లో గుర్తింపు పొందారు. అలాగే ఆయా యూనివర్శిటీలు డాక్టరేట్లు ఇచ్చాయి. ఒక విదేశీ వనిత ఈ రకంగా భారత్ లో ఒక ప్రముఖ స్థానంలోకి వెళ్లడం గొప్ప విషయమే అయినా, దానిని ఆమె నిలబెట్టుకోలేకపోవడం కూడా చారిత్రక విషాదమే. ఆమె 76 ఏళ్ల వయసులో ఇన్నింగ్స్ ముగిస్తుంటే, ఎనభైఏళ్ల ఖర్గే ఎఐసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. దీనిని బట్టే కొత్త శక్తులు, యువతను కాంగ్రెస్‌లోకి తీసుకు రావడంలో ఆమె విఫలం అయ్యారు. అందివచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మొత్తం తానే అని భ్రమించి కాంగ్రెస్‌ను ఈ స్థితికి తెచ్చారు. ఈ దశలో ఆమె రిటైరైనా,రిటైర్ కాకపోయినా, ఏదైనా కొత్త శక్తి వచ్చి కాంగ్రెస్ ను కాపాడితే తప్ప మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పలేం.
-హితైషి
Comments
Please login to add a commentAdd a comment