సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నట్టు టీపీసీసీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ స్థానాలతోపాటు రాష్ట్ర శాసన మండలిలో పలు సీట్లు ఖాళీ అవుతుండటంతో.. ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో పోటీ పెరిగింది. మార్చి నాటికి రెండు రాజ్యసభ స్థానాలతోపాటు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీకానున్నాయి. సొంత పార్టీ నేతలతోపాటు టీజేఎస్, సీపీఐ నేతలు కూడా ఎమ్మెల్సీ సీట్లు, ఇతర పదవులను ఆశిస్తున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుంటే..
సోనియా గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని.. లేదంటే తెలంగాణ నుంచే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరుతూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తీర్మానం చేసి అధిష్టానానికి పంపింది. సోనియా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పోటీచేసే అవకాశం ఉందని.. అక్కడ ప్రియాంకా గాంధీని పోటీకి పెడితే, సోనియా తెలంగాణకు మారవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
ఈసారి సోనియా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ ఉందని.. ఈ క్రమంలో ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని టీపీసీసీ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనితో రాష్ట్ర కాంగ్రెస్‌కు రానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి రిజర్వ్ అయినట్టేనని.. మరో సీటు కోసం ఏఐసీసీలో కీలక భూమిక పోషిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది.
మరోవైపు రాజ్యసభ పో టీలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్రస్థాయిలో పదవి ఇవ్వాలని, కుదరకపోతే రాజ్యసభకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని టీపీసీసీ పెద్దలు భా విస్తున్నట్టు సమాచారం. ఆయనకు ఏ చాన్స్ దక్కుతుందన్నదానిపై చర్చ జరుగుతోంది.
20 మందికిపైగా ఆశావహులు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా పోటీ నెలకొంది. ప్రజా గాయకుడు అందెశ్రీతోపాటు పార్టీలోని పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు టీజేఎస్, సీపీఐ నేతలకు ఇప్పుడే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారా, లేక భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానాలను ఇస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా సీట్లు త్యాగం చేసినవారు, పోటీ చేసి ఓడినవారు, వివిధ కోటాల కింద తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నవారు చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు.
ఈ జాబితాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్‌ను మంత్రి చేయాలనుకుంటే.. ఈసారి ఎమ్మెల్సీ కోటాలోనే ఆయనకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. లేదంటే వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్సీ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక సాహిత్య రంగం నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అందెశ్రీ పేరు దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యరి్థగా చిన్నారెడ్డి పేరు ఖరారు కావచ్చని సమాచారం. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలో ఎవరెవరికి పదవీ యోగం కలుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
రాష్ట్రం నుంచి పెద్దల సభకు సోనియా!
Published Sun, Dec 31 2023 4:15 AM | Last Updated on Sun, Dec 31 2023 4:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment