
మహేష్ నాకు మద్దతిస్తాడు
హీరో మహేష్ బాబు ఏ పార్టీకి చెందిన వాడు కాదని, ఆయన ఎప్పుడూ ఎవరికీ ప్రచారం చేయలేదు గానీ, తనకు మాత్రం మద్దతిస్తాడని మహేష్ బావా గల్లా జయదేవ్ వెల్లడించారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు జయదేవ్ శనివారం హైదరాబాద్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడారు. సీమాంధ్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని, అందుకే తాను టీడీపీలో చేరానని వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నామని, అయితే రాష్ట్ర విభజనతో తమను ఆ పార్టీ నట్టేట ముంచిందని గల్లా అరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంతో కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గతంలో గల్లా అరుణ భావించారు. ఆ క్రమంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె కుమారుడు జయదేవ్ను బరిలో దింపాలని యోచించారు. టీడీపీ అగ్రనేతలతో గల్లా కుటుంబసభ్యులు సంప్రదింపులు జరిపారు. అందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు పచ్చ జెండా ఊపడంతో అరుణతోపాటు ఆమె కుమారుడు శనివారం టీడీపీలో చేరారు.