
వచ్చే ఎన్నికల్లో యూపీ, బీహార్‌లలో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్, యూపీల్లో సగం లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగలదని ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే వెల్లడించింది. యూపీలోని 20 లోక్‌సభ స్థానాలు, బీహార్‌లోని 10 లోక్‌సభ స్థానాల్లో శాంపిల్‌గా చేసిన సర్వే వివరాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 80 స్థానాల్లో 40, బీహార్‌లో 40 స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకోనుంది. సర్వే ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక స్థానాన్ని దక్కించుకోనుంది.
బీహార్‌లో జేడీయూ 9 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందని సర్వే పేర్కొంది. యూపీలో కాంగ్రెస్ ఈసారి 14 సీట్లను పొందొచ్చని వెల్లడైంది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, విపక్ష బీఎస్పీ చెరో 13 స్థానాల్లో గెలుస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీహార్‌లో 21 సీట్లను కైవసం చేసుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. లాలూ సారథ్యంలోని ఆర్జేడీకి 6 సీట్లు దక్కే అవకాశముంది.