ABP news Nielsen national survey
-
వచ్చే ఎన్నికల్లో యూపీ, బీహార్లలో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్, యూపీల్లో సగం లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగలదని ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే వెల్లడించింది. యూపీలోని 20 లోక్‌సభ స్థానాలు, బీహార్‌లోని 10 లోక్‌సభ స్థానాల్లో శాంపిల్‌గా చేసిన సర్వే వివరాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 80 స్థానాల్లో 40, బీహార్‌లో 40 స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకోనుంది. సర్వే ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక స్థానాన్ని దక్కించుకోనుంది. బీహార్‌లో జేడీయూ 9 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందని సర్వే పేర్కొంది. యూపీలో కాంగ్రెస్ ఈసారి 14 సీట్లను పొందొచ్చని వెల్లడైంది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, విపక్ష బీఎస్పీ చెరో 13 స్థానాల్లో గెలుస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీహార్‌లో 21 సీట్లను కైవసం చేసుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. లాలూ సారథ్యంలోని ఆర్జేడీకి 6 సీట్లు దక్కే అవకాశముంది. -
బీజేపీకి డబుల్ సెంచరీ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండువందలకు పైగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఏబీపీ న్యూస్-నీల్సన్ జాతీయ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 210 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్‌కు ఇదివరకటి ఏ ఎన్నికల్లోనూ రానంత తక్కువగా 81 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 11 స్థానాలు దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం... - బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైపే ఓటర్లలో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మోడీ ప్రధాని కావాలని 53 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాలని 15 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. - ‘ఆప్’ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ ప్రధాని కావాలని కేవలం 5 శాతం ఓటర్లు మాత్రమే కోరుకుంటున్నారు. - ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతోంది. యూపీఏ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వరాదని 61 శాతం ఓటర్లు భావిస్తున్నారు. - యూపీఏ సర్కారు పనితీరు అత్యంత దారుణంగా ఉందని 43 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. - ఇదివరకటి ఎన్డీఏ సర్కారు పనితీరు ప్రస్తుత యూపీఏ సర్కారు కంటే మెరుగ్గా ఉందని 52 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. - ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. - ‘ఆప్’ గురించి తమకు తెలుసునని 63 శాతం ఓటర్లు చెప్పారు. అయితే, తాము ‘ఆప్’కు ఓటు వేయబోమని 49 శాతం ఓటర్లు తేల్చి చెప్పారు. - దేశవ్యాప్తంగా 2013 డిసెంబర్ 28 నుంచి 2014 జనవరి 12 వరకు మొత్తం 64,006 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఏబీపీ న్యూస్ వెల్లడించింది.