రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయనున్న జగన్, విజయమ్మ షర్మిల
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధం అవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల, ఇతర సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయం కూడా ఖరారవుతుందని, నేతలంతా ప్రచారానికి వెళ్లడం మాత్రం ఖాయమైందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్సభ... ఇలా ఒకేసారి అన్ని స్థాయులకు సంబంధించిన ఎన్నికలు జరగడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమం. సాధారణంగా ఎంతో కొంత సమయం తర్వాతే ఈ ఎన్నికలన్నీ జరుగుతుంటాయి. అయితే వివిధ కారణాల వల్ల మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వాటిని కూడా దాదాపుగా సార్వత్రిక ఎన్నికలకు కొంచెం అటూ ఇటూగా నిర్వహించాల్సి వస్తోంది.
దీంతో రాజకీయ పార్టీలన్ని తలమునకలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సీమాంద్ర ప్రాంతంలో పోటీ చేయించడానికి తగిన అభ్యర్థులు కూడా దొరక్క తల పట్టుకుంటోంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకు సాహసించడంలేదు. గ్రామాల్లో అయితే కాంగ్రెస్ పేరెత్తితే చాలు.. జనం కొట్టేలా ఉన్నారని స్వయంగా ఆ పార్టీ కిందిస్థాయి నాయకులే వాపోతున్నారు. అందుకే ఇప్పటికే చాలామంది వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తమ అధినేత లేఖ వల్లే విభజనకు పునాదులు పడ్డాయన్న భయంతో ఉంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాలికి బలపం కట్టుకుని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అందరినీ కలిసి మద్దతు పలకాల్సిందిగా కోరి, శాయశక్తులా రాష్ట్ర సమైక్యతకు ప్రయత్నించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం ధైర్యంగా జనంలోకి వెళ్లి ఆ మాట చెప్పగలుగుతున్నారు. వారికి అండగా ప్రచారం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులంతా సిద్ధమవుతున్నారు.