స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో | My Campus Life | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో

Published Sun, Nov 9 2014 11:46 PM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో - Sakshi

స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో

 మై క్యాంపస్ లైఫ్
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - హైదరాబాద్.. భాగ్యనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ వంటి కోర్సులను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రావుల మనీశ్‌చంద్రరెడ్డి తన క్యాంపస్ లైఫ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా..
 
క్యాంపస్‌లో సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తరగతులు ముగుస్తాయి. లంచ్ తర్వాత  2.30 నుంచి 5.30 గంటల వరకు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ఉంటుంది.
 
ఫ్యాకల్టీ.. ఎంతో ఫ్రెండ్లీ

ఫ్యాకల్టీలో ఎక్కువ మంది యువతే. స్టూడెంట్స్‌కు.. ఫ్యాకల్టీ మధ్య పెద్దగా వయసులో తేడా లేదు. అందువల్ల విద్యార్థులను చక్కగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త బోధన పద్ధతులు అమలు చేస్తారు. మేము ఫ్యాకల్టీ నుంచి ఏమి ఆశిస్తున్నామో సులువుగా గ్రహిస్తారు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు.
 
మూస పద్ధతికి స్వస్తి


బోధన వినూత్నంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్ గంటన్నరపాటు ఉంటుంది. విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తారు లేదా విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్ సమాధానాలివ్వడం.. నిజ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయించడం ఇలా బోధనలో వివిధ పద్ధతులను పాటిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే ఎన్‌పీటీఈఎల్, ఎడెక్స్, కోర్సెరా ద్వారా కూడా విద్యార్థులు కోర్సులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే ప్రతి విద్యార్థీ లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలి. నేను ఇప్పటివరకు క్రియేటివ్ ఆర్ట్స్, వెస్ట్రన్ పెయింటింగ్, మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం, షార్ట్‌స్టోరీ రైటింగ్, ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటివాటిని అధ్యయనం చేశాను.
 
స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం

యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం మూడు స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. స్టార్టప్ ఏర్పాటు చేసేవారికి కార్యాలయం కోసం స్థలం, కంప్యూటర్స్, ఇంటర్‌నెట్, ప్రింటర్స్, ఫ్యాక్స్, టెలిఫోన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు.
 
క్యాంపస్.. కలర్‌ఫుల్

ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్‌లు వంటి మొత్తం 180 ఈవెంట్లు ఉంటాయి. నేను కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో వాక్, రోబో కాంపిటీషన్స్‌తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలుంటాయి.  
 
సదుపాయాలెన్నో..

క్యాంపస్ సదుపాయాల విషయానికొస్తే ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంపస్ అంతా మంచి స్పీడ్‌తో వై-ఫై సౌకర్యం ఉంది. క్యాంపస్‌లో రెండు భోజనశాలలున్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఆధునిక లేబొరేటరీలున్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి 150 ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే లైబ్రరీని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి అందరికీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇస్తారు.
 
పీహెచ్‌డీ చేస్తా

పరిశోధనలంటే నాకు ఎంతో ఆసక్తి. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ప్రాక్టికల్స్‌కే కేటాయిస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement