b tech
-
27 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు.. కొడుకు కోసం కలం పట్టిన నాగరాణి
బచ్చు స్మరణ్‌రాజ్. సివిల్స్ 676వ ర్యాంకు విజేత. లక్షల మంది పోటీపడిన పరీక్షల్లో అతని ఆలోచనాధారకు తల్లి నాగరాణి అక్షర రూపమిచ్చారు. సివిల్స్‌కోసం స్మరణ్‌తో పాటు ఆమె సైతం అహర్నిశలు శ్రమించారు. 27ఏళ్ల క్రితం డిగ్రీతో చదువు ఆపేసిన ఆమె కలానికి పదును పెట్టి.. సెకన్లు, నిమిషాలను లెక్కిస్తూ కాగితాలు నింపేశారు. ప్రతి ప్రశ్నకు అతడు మాటల్లో సమాధానం చెబుతుంటే ఆమె తన కలంతో అక్షరాలను పరుగులు పెట్టించారు. కొడుకు విజయంలో ప్రత్యక్ష భాగస్వామిగా నిలిచిన నాగరాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తార్నాకకు చెందిన స్మరణ్ చెన్నై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్) పూర్తి చేశారు. 2016 డిసెంబర్లో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. చేరిన కొద్ది రోజులకే 2017 ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న స్మరణ్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హేమరేజ్‌గా నిర్ధారించారు. శస్త్రచికిత్స తప్పనిసరైంది. కలం పట్టుకోవడమే కష్టం... చెన్నైలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన అరుదైన సర్జరీతో అతడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. మెదడుకు రక్షణగా ఉండే కపాల భాగాన్ని 37 రోజులు అతని పొట్టలోనే భద్రపరిచి అనంతరం తలకు అమర్చి కుట్లువేశారు. కానీ బ్రెయిన్ హేమరేజ్‌తో కుడివైపు శరీరానికి పక్షవాతం వచ్చింది. మరో మూడున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స పొందాడు. కుడివైపు భాగం అతని స్వాధీనంలోకి వచ్చింది. కానీ చేతివేళ్ల కదలిక కష్టమైంది. చదవగలడు. కానీ రాయలేడు. ఐఏఎస్ కావాలని కలలుగన్న స్మరణ్‌కు అది అవరోధంగా మారింది. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే అతనికి శిక్షణనిచ్చేందుకూ నిరాకరించాయి. మరోసారి నిరాశకు గురైన స్మరణ్ కలను సాకారం చేయాలని తల్లిదండ్రులు నాగరాణి, రమేష్‌లు సంకల్పించారు. సివిల్స్ కోచింగ్ ఇస్తోన్న బాలలతను సంప్రదించారు. అక్కడ అతని ఆశయానికి అండ లభించింది. కలం పట్టుకొని గెలిపించారు... ఆ శిక్షణ స్మరణ్‌కు మాత్రమే కాదు. అతని తల్లికి కూడా. ఇద్దరికీ కలిపి పరీక్షలు నిర్వహిం చిన బాలలత... కొడుకు చెప్పే వేగాన్ని ఆమె అందుకోగలుగుతుందా? లేదా? అని పరీక్షిం చారు. అలా 37 పరీక్షలు నిర్వహించారు. కొడుకు కోసం పరీక్షలు రాసేందుకు ఏడాది పాటు ప్రాక్టీస్ చేశారామె. స్మరణ్ రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడితే.. ఆ అంశాలను వేగంగా రాసేందుకు నాగరాణి పోటీపడ్డారు. తప్పుల్లేకుండా స్పష్టంగా రాసేందుకు యూట్యూబ్ శిక్షణ తీసుకున్నారు. నిమిషానికి రాయగలిగే అక్షరాలను లెక్కిస్తూ వేగం పెంచారు. ‘మొదట్లో గంటకో పేజీ రాయడం కష్టంగా ఉండేది. క్రమంగా 4 గంటల్లో 40 పేజీలు రాసే నైపుణ్యం వచ్చింది. స్మరణ్ చదివే పుస్తకాల్లోని అంశాలే రాయడం వల్ల సివిల్స్ పరీక్షల్లో ఇబ్బంది కాలేదు’ అని నాగరాణి చెప్పారు. అమ్మనే స్క్రైబ్.. ఎందుకంటే? సాధారణంగా ఏ పరీక్షల్లో అయినా రాయలేనంత వైకల్యం ఉన్న వాళ్లు స్క్రైబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అభ్యర్ధి చెప్పే సమాధానాలను స్క్రైబ్ తప్పుల్లేకుండా, ఉన్నదున్నట్లుగా రాయాలి. ‘స్క్రైబ్‌గా వ్యవహరించేందుకు బయటివాళ్లు అందు బాటులో ఉండొచ్చు. కానీ వాళ్లకు మా అబ్బాయి గెలుపు పట్ల తపన, అంకి తభావం ఉండవు కదా. అందుకే స్మరణ్ తల్లి ఆ బాధ్యతను తీసుకుంది’ అని స్మరణ్ తండ్రి రమేష్‌కుమార్ చెప్పారు. పైగా స్క్రైబ్‌గా వ్యవహరించేవాళ్లు యూపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాసే అర్హతను కోల్పోతారు. ‘నాకు, మా అబ్బాయిని గెలిపించడం కంటే గొప్ప పోటీ పరీక్ష మరొకటి లేదు కదా’ అని నవ్వేశారు నాగరాణి. -
బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! హైదరాబాద్ యాపిల్ క్యాంపస్‌లో జాబ్ ఆఫర్స్
కరోనా సంక్షోభం తర్వాత కార్పొరేట్ ప్రపంచం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దాదాపు ఏడాదిన్నరగా నియమకాలు చేపట్టిన సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ సంస్థ బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త తెలిపింది. యాపిల్ సంస్థకు చెందిన డెవలపింగ్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది. దీంతో పాటు బెంగళూరులో కూడా యాపిల్‌కి కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (డేటా ప్లాట్ఫార్మ్) ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్లు యాపిల్ కెరీర్ పోర్టల్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు ఇప్పటికే ఇదే క్వాలిఫికేషన్ మీద వివిధ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉండి మార్పు కోరుకునేవారికి ఇదో సువర్ణ అవకాశం. దాదాపు ఏడాది తర్వాత తిరిగి యాపిల్‌లో ఫుల్, పార్ట్‌టైం ప్రతిపాదికన ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఎంపికైన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. -
13 గిన్నిస్లు సాధించిన హైదరాబాద్ యువతి
పటాన్చెరు: బీటెక్ చదివిన శివాలి జోహ్ర అనే యువతి పదమూడో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె తల్లి కవిత, తండ్రి అనిల్ శ్రీవాస్తవ కూడా ఈ రికార్డుల్లో పాలుపంచుకున్నారు. చేతితో రూపొందించిన 2,200 క్విల్లింగ్ డాల్స్‌ను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పి తాజాగా పదమూడో గిన్నిస్ సాధించింది. ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, 4 యూనిక్ వరల్డ్ రికార్డులను ఈ కుటుంబం సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్ రికార్డులు సాధించడం కూడా ఓ విశేషం. ఇంతకు ముందు శివాలి కుటుంబం హ్యాండ్‌మేడ్ పేపర్‌తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి రెండో రికార్డు, 2,111 విభిన్న బొమ్మలు, 3,501 ఆరెగామి (కాగితం) వేల్స్, 2,100 ఆరెగామి పెంగ్విన్స్, 6,132 ఆరెగామి సిట్రస్ (నిమ్మతొన)లు, 6,100 ఆరెగామి వేల్స్, 2,500 ఆరెగామి పెంగి్వన్స్, 1,451 ఆరెగామి మాఘీలు, 2,200 క్విల్లింగ్ డాల్స్, 9,200 ఆరెగామి ఫిష్, 1,998 ఆరెగామి మాఘీ లీమ్లను ప్రదర్శనకు ఉంచి రికార్డులను సొంతం చేసుకుంది. (చదవండి: బుల్లి వాక్యూమ్ క్లీనర్.. గిన్నీస్ రికార్డుల్లోకి) -
21 నుంచి పద్మావతి వర్సిటీ పీజీ, బీటెక్ పరీక్షలు
సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున మంగళవారం తెలిపారు. ఇందుకోసం వర్సిటీ దూరవిద్యా అధ్యయన కేంద్రాలతో పాటు మరికొన్ని ఇతర కేంద్రాలు వినియోగించనున్నట్లు చెప్పారు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం నగరాల్లో ప్రతిరోజూ ఉ.10 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. ఎస్వీయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడవును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ ఆప్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసే అవకాశం కల్పించామన్నారు. -
నవంబర్ 1 నుంచి ఫస్టియర్‌కు క్లాసులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో తరగతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి సీనియర్ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మొదలుకానుండగా.. ఫస్టియర్ విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవనున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతి (క్లాస్‌రూం)లో నిర్దేశించిన విధంగా సీనియర్ విద్యార్థులకు తొలుత బోధన పెట్టాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాఠ్యాంశ బోధనతో పాటు కళాశాలల గుర్తింపు, మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ తదితర కార్యకలాపాలపైన స్పష్టమైన తేదీలను సూచించింది. ఇక సాంకేతిక, వృత్తి విద్య యూజీ, పీజీ కోర్సు (బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర) ల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ ఒకటో తేదీ నాటికి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన అకడమిక్ క్యాలెండర్ 2020–21ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ క్యాలెండర్ ఆధారంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినప్పటికీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు చేస్తే మార్పులు చేసే అవకాశముంటుందని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్లో సవరణలివే... ►సెప్టెంబర్ 1 నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తి కానందు న వారిని మినహాయించి మిగతా తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభించా లి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో లేకుంటే బ్లెండెడ్ మోడ్ (రెండు విధాలుగా)లో బోధన చేపట్టొచ్చు. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులకు మాత్రం బోధన తరగతుల నిర్వహణకు ఈ తేదీ వర్తించదు. ►ప్రతి విద్యా సంస్థకు సంబంధిత యూనివర్సిటీ లేదా బోర్డు అనుబంధ గుర్తింపునిస్తుంది. ఈ ప్రక్రియ వాస్తవానికి మే నెల15వ తేదీలోగా పూర్తి కావాలి. తాజాగా ఈ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించింది. నిర్దేశించిన గడువులోగా విద్యా సంస్థను తనిఖీ చేసి మౌలిక వసతులు, సౌకర్యాలను పూర్తిగా పరిశీలించి ఆమేరకు అనుబంధ గుర్తింపును జారీ చేయాలి. ►వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్లను త్వరితంగా నిర్వహించి అక్టోబర్ 20వ తేదీ నాటికి తొలి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆమేరకు అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ►అదేవిధంగా నవంబర్ ఒకటో తేదీ నాటికి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ ఒకటో తేదీ నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. అదే రోజు నుంచి ఫ్రెషర్స్‌కు తరగతులు ప్రారంభమవుతాయి. ►వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే నవంబర్ 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలి. మొత్తంగా 15వ తేదీ నాటికి కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఏఐసీటీఈ ఏప్రిల్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను తొలుత విడుదల చేసినప్పటికీ కోవిడ్ నేపథ్యంలో మార్పులు చేసి జూలై 2న సవరించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. అయితే విద్యా సంస్థలు తెరిచేందుకు కేంద్రం అనుమతినివ్వలేదు. ఈక్రమంలో వీటి మూసివేత ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వివిధ సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం వెసులుబాటునిస్తూ వచ్చిం ది. దీంతో వచ్చేనెలలో విద్యా సంస్థలు తెరుచుకుంటాయని సంకేతాలు వస్తుండటంతో ఏఐసీటీఈ తాజాగా మరిన్ని సవరణలు చేసిన అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ విడుదల చేశారు. -
కొత్త కోర్సుల్లో 15,690 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వీటితోపాటు కంప్యూటర్ సైన్స్‌లో 23,040 సీట్లు, ఈసీఈలో 18,495 సీట్లకు, ఈఈఈలో 8,430 సీట్లు, ఇతర కోర్సుల్లో మిగతా సీట్లకు అనుమతి ఇచ్చింది. ఈసారి అనుబంధ గుర్తింపు లభించేదెన్నింటికో.. రాష్ట్రంలో ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. చాలా వరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఈసారి కూడా ఏఐసీటీఈ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,873 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు అందులో ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తాయో వేచి చూడాల్సిందే. అయితే ఇందులో కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న సీట్లే 15,690 ఉన్నాయి. ఇపుడు వాటన్నింటికి అనుబంధ గుర్తింపును ఇస్తాయా? కాలేజీల స్థాయిని బట్టి, వసతులను బట్టి కోత పెడతాయా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈసారి చాలా కాలేజీలు తమ కాలేజీల్లో పాత కోర్సులను, బ్రాంచీలను, సీట్లను రద్దు చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా దాదాపు 8 వేల సీట్లను రద్దు చేసుకున్నాయి. అలా రద్దు చేసుకున్న సీట్ల సంఖ్యతో పాటు అదనంగా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లకు అనుమతి ఇస్తాయి? ఎన్నింటికి కోత పెడతాయన్నది ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో తేలనుంది. -
పెరగనున్న బీటెక్ ఫీజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.50 వేల లోపు వార్షిక ఫీజున్న కాలేజీల్లో 20%మేర, రూ.50 వేలకు పైగా వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి, సాంకేతిక విద్య కాలేజీ యాజమాన్యాలతో శనివారం విశ్వేశ్వరయ్య భవన్లో ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ), తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ గౌతంరావు, కార్యదర్శి సునీల్, వివిధ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఫీజుల ఖరారులో ఆలస్యం, ఫీజుల ఖరారులో న్యాయవివాదం తలెత్తడంతో యాజమాన్యాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త ఫీజులను అమలు చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఆయా కాలేజీల్లో ఉన్న ఫీజులపై 20%, 15% ఫీజులను పెంచేందుకు ఒకట్రెండు రోజుల సమయం పట్టనున్నందున.. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల ప్రక్రియను మరో రెండు మూడ్రోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. కాలేజీ వారీగా ఫీజులను ఖరారు చేశాకే, వెబ్ ఆప్షన్లను అందుబాటులో తేవాల్సి ఉంటుంది. దీంతో.. తాజా మార్పులను దృష్టిలో ఉంచుకుని వెబ్ఆప్షన్లను వాయిదా వేయనున్నారు. 103 ఇంజనీరింగ్ కాలేజీల్లో 20% రాష్ట్రంలో 2016–17 విద్యా సంవత్సరంలో 184 ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులను ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఇందులో కనీస ఫీజు రూ.35 వేల లోపు ఉన్న కాలేజీలు 26 ఉన్నాయి. వాటితో కలుపుకొని రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీల సంఖ్య 103. ప్రస్తుతం వాటన్నింటిలో 20% ఫీజులు పెరగనున్నాయి. మిగతా 81 కాలేజీల్లో 15% ఫీజులు పెంచనున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా తదితర వృత్తి విద్యాకోర్సుల ఫీజులు కూడా ఇదే నిష్పత్తిలో (20%, 15%) పెంచేందుకు అధికారులు ఓకే చెప్పారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల కోసం 1,235 వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలు ప్రతిపాదనలను అందజేశాయి. ప్రస్తుతం వాటన్నింటిలో ఈ పెంపు అమలు కానుంది. భారీగా పెంపుదలకు డిమాండ్ కొత్త ఫీజుల ఖరారు విషయంలో న్యాయ వివాదం నేపథ్యంలో ఫీజులను పెంచుతామని అధికారులు యాజమాన్యాల ముందు ప్రతిపాదన పెట్టగా కొన్ని కాలేజీలు 35–40% పెంచాలని డిమాండ్ చేశాయి. కానీ భారీగా పెంచితే వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం కారణంగా తాజా మార్పులను ఏఎఫ్ఆర్సీ సూచించింది. దీనికి మెజారిటీ యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. వాస్తవానికి ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌ను ముందుగా నియమించి ఉంటే, ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేసే వారు. నియామకంలో ఆలస్యం కావడం, ఫీజులను ఖరారు చేయకపోవడంతో ప్రవేశాలు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. ఈ పెంపును అధికారులే ప్రతిపాదించారు. దీనికి కోర్టును ఆశ్రయించిన కాలేజీలు కూడా చాలా వరకు అంగీకరించాయని అధికారులు వెల్లడించారు. అంతేకాదు రాతపూర్వకంగా అంగీకారాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేయాలంటే.. ఏఎఫ్ఆర్సీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించడకుండా, కోర్టు తీర్పునే అమలు చేయాలంటే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇచ్చిన కాలేజీల్లో కొన్ని 280% పెంపుదల కోరాయి. రూ.1,13,500 ఫీజు ఉన్న ఓ కాలేజీ రూ.3.19 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. ఇలా చాలా కాలేజీలు 200శాతానికి పైగా ఫీజులను ప్రతిపాదించాయి. అలాంటి వాటిల్లో మొదట 6 కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లి అదే తరహా ఆర్డర్ తెచ్చుకున్నాయి. దీంతో వాటి సంఖ్య 81కి చేరింది. అయితే శనివారం జరిగిన సమావేశంలో ఆ కాలేజీలకు చెందిన యాజమాన్యాలు కూడా పాల్గొన్నాయి. అందులో మెజారిటీ కాలేజీలు అధికారుల ప్రతిపాదనకు అంగీకరించాయి. ఇక భారీగా ఫీజును ప్రతిపాదించిన 20 వరకు కాలేజీలు ఈ పెంపు ప్రతిపాదనను అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. వారు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరే అవకాశం ఉంది. తమ ప్రతిపాదనకు రాత పూర్వకంగా అంగీకారం తెలుపని కాలేజీలతో మరోసారి మాట్లాడి ఒప్పించాలని భావిస్తున్నారు. వారు అంగీకరించకపోతే ఆయా కాలేజీలకు ఫీజులను నిర్ధారించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎలాగూ వెబ్ఆప్షన్లను వాయిదా వేయాలని భావిస్తున్నందున మరికొంత సమయం దొరుకుతుంది. వెబ్ ఆప్షన్ల చివరి తేదీ నాటికి ఆయా కాలేజీల ఫీజులను ఖరారు చేసి కౌన్సెలింగ్‌లో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. విద్యార్థులు కొత్త ఫీజులను చూసి చివరి రోజున తమ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మిగతా అన్ని కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి కొత్త ఫీజులను నెల, రెండు నెలల రోజుల్లోఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో విద్యార్థులు ఫీజులు చెల్లించే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు. ఫీజు తంటాలు తప్పవా? వెబ్ ఆప్షన్ల సమయంలో కాలేజీ వారీ ఫీజులను వెల్లడించాలి. వాటిని చూసే విద్యార్థులు ఆ ఫీజులను బట్టి తమకు ఇష్టమైన కాలేజీని ఎంచుకుంటారు. అయితే ఇప్పటివరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఓ కాలేజీకి అధికారుల చేసిన 15% పెంపు ప్రతిపాదన ప్రకారం రూ.9 వేలు పెరుగుతుంది. ఆ కాలేజీ ఫీజు రూ.69 వేలకు చేరుకుటుంది. అయితే ఇది తాత్కాలికమే. ఆదాయ వ్యయాలను బట్టి ఆ కాలేజీ ఫీజును వచ్చే నెల రెండు నెలల్లో పూర్తిస్థాయి ఫీజును ఖరారు చేస్తారు. ఇక్కడే ఓ సమస్యుంది. ఇప్పటి వరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఆ కాలేజీ కొత్త ఫీజును రెట్టింపు చేస్తూ రూ.1.20 లక్షలకు ప్రతిపాదిస్తే వాటిని ఏఎఫ్ఆర్సీ పరిశీలించనుంది. అందులో రూ.1 లక్షకు కనుక ఆ కాలేజీ ఫీజు ఖరారైతే ఆ కాలేజీలో చేరిన విద్యార్థిపై రూ.40 వేల అదనపు భారం పడనుంది. ఆ కాలేజీ ఫీజు ఇపుడు రూ.69వేలుగా చేసినా, ఆ తరువాత ఎంత వరకు పెరుగుతుందో.. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజుల నియంత్రణ కమిటీ ఎంతవరకు తగ్గిస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విద్యార్థి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు రూ.69 వేలు మాత్రమే కనిపిస్తుంది తప్ప కచ్చితమైన ఫీజు తెలియదు. ఇలాంటి పరిస్థితి చాలా కాలేజీల విషయంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో ఈసారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు ఇబ్బందులు, గందరగోళం తప్పేలా లేదు. ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలు బీటెక్–197, ఎంటెక్–130, ఎంబీఏ–285, ఎంసీఏ–33, బీఫార్మసీ–122, ఎంఫార్మసీ–113, ఫార్మ్‌డీ–57, ఫార్మ్‌డి (పీబీ)–28, బీఎడ్–196, ఎంఎడ్–9, బీపీఈడీ–9, డీపీడీడీ–2, ఎల్ఎల్బీ–29, ఎల్ఎల్ఎం–9, బీఆర్క్–9, ఎం.ఆర్క్–2, బీఎఫ్ఏ–5. -
తెలంగాణలో 27 కాలేజీల్లో ప్రవేశాలకు నో
సాక్షి, హైదరాబాద్: ఈ సారి 27 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుమతి నిరాకరించింది. దీంతో వాటిల్లోని దాదాపు 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. జేఎన్టీయూ ఇటీవల కాలేజీలకు జారీ చేసిన అనుబంధ గుర్తింపు లెక్కలు తేలాయి. రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా జేఎన్టీయూ 156 కాలేజీలకు గుర్తింపును జారీ చేసింది. దీంతో 27 కాలేజీలకు ఈసారి బీటెక్‌లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే వాటిల్లో ఎక్కువ శాతం కాలేజీల్లో వసతులు లేని కారణంగా అనుబంధ గుర్తింపును జేఎన్టీయూ నిరాకరించింది. మరికొన్ని కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గతంలో ప్రవేశాలు లేని కారణంగా చివరలో విరమించుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలతోపాటు ఇతర కాలేజీల్లో 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. గతేడాది రాష్ట్రంలోని 202 కాలేజీల్లో ప్రవేశాల కోసం యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లోని 174 కాలేజీల్లో 793 కోర్సులకు సంబంధించిన 86,176 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 183 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 156 కాలేజీల్లోని 686 కోర్సులకు సంబంధించి 77,500 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. వీటితోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు, కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపును జారీ చేసింది. ఫార్మసీలో గతేడాది 76 కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, 73 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 73 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, అందులో 67 కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. గతేడాది 17 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 16 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 13 కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 11 కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చింది. -
ఇంజనీరింగ్‌లో బాలురు..అగ్రి–మెడికల్‌లో బాలికల హవా
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఆర్‌ఆర్‌పేట (ఏలూరు): బీటెక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్సు టెక్నాలజీ, బి–ఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ హార్టికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్–2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కోటేశ్వరరావు, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొ. సీహెచ్.సాయిబాబు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జీఎస్ పండాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణతా శాతాలు ఇలా.. ఇంజనీరింగ్‌లో బాలురు, అగ్రి–మెడికల్ విభాగంలో బాలికలు ఆధిక్యాన్ని కనబరిచారు. అలాగే, ఇంజనీరింగ్‌లో 74.39 శాతం మంది, అగ్రి–మెడికల్‌లో 83.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ టాప్ పది ర్యాంకుల్లో బాలురు ఉండగా.. అగ్రి–మెడికల్‌లో బాలురు, బాలికలు చెరో అయిదు స్థానాల్లో నిలిచారు. ఇంజనీరింగ్, అగ్రి–మెడికల్ రెండు విభాగాల్లోని 20 ర్యాంకర్లలో తొమ్మిది మంది తెలంగాణ, ఒకరు బీహార్‌కు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ఏపీ విద్యార్థులు. కాగా, ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఫలితాలను మే 1న విడుదల చేయాలని అధికారులు భావించినా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలలో గందరగోళం ఏర్పడడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. కనీస అర్హత మార్కులు 40 ఇదిలా ఉంటే.. 160 మార్కులకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా 40 మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కుల్లేవు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,719 మంది దరఖాస్తు చేయగా 1,85,711 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,38,160 (74.39 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రి, మెడికల్ విభాగంలో 86,986 మంది దరఖాస్తు చేయగా 81,916 మంది పరీక్ష రాశారు. వీరిలో 68,512 మంది (83.64 శాతం) అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు 82,088 మంది, బాలికలు 56,072 మంది అర్హత సాధించారు. అగ్రి–మెడికల్‌లో బాలురు 22,946 మంది, బాలికలు 45,566 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఇంజనీరింగ్ విభాగంలో 1,22,188 మందికి, అగ్రి, మెడికల్ విభాగంలో 63,206 మందికి ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్‌లో పాసైనా ఇంటర్లో ఫెయిల్ మరోవైపు.. ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అందులో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఫెయిల్ కావడంతో వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో 12,874 మంది ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేదు. అగ్రి–మెడికల్ విభాగంలో ఉత్తీర్ణులైన 3,152 మంది ఇంటర్లో పాస్ కాలేదు. అలాగే, ఇంటర్మీడియెట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరైన ఇంజనీరింగ్ విభాగంలోని 3,067 మంది, అగ్రి–మెడికల్ విభాగంలో 2,153 మంది విద్యార్థులు ఇంటర్ మార్కులు అందచేయకపోవడంవల్ల వారికి ర్యాంకులు కేటాయించలేదు. సమాధానాల ఆప్షన్లలో మార్పులు ఇంజనీరింగ్ విభాగంలో ఏడు సెషన్లలో నిర్వహించిన పరీక్షలలో ప్రాథమిక కీ కి సంబంధించి 139 ప్రశ్నలపై అభ్యంతరాలు రాగా నిపుణుల సలహా మేరకు 10 ప్రశ్నలకు ఆప్షన్లు మార్పుచేశారు. మరో 10 ప్రశ్నల మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు. అలాగే, మెడికల్ విభాగంలో మూడు సెషన్లలో జరిగిన పరీక్షలలో 41 ప్రశ్నలకుగాను నిపుణుల సలహా మేరకు మూడు ప్రశ్నలకు ఆప్షన్లను మార్పు చేయగా ఒక ప్రశ్న మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు. 10 నుంచి ర్యాంకు కార్డులు ఇదిలా ఉంటే.. ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ పదో తేదీ నుంచి ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్‌లో అర్హత పొంది ర్యాంకు రాని వారు ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చిన డిక్లరేషన్ ఫారంను పూర్తిచేసి ఇంటర్ మార్కుల జాబితాను కన్వీనర్ ఆఫీస్ అడ్రస్‌కు పోస్టు ద్వారా, లేదా ఈమెయిల్ ఐడీ ‘హెల్ప్లైన్ఏపీఎంసెట్2కె19ఎట్దరేట్జీమెయిల్డాట్కామ్’కు పంపితే తదుపరి జాబితాల్లో వారికి ర్యాంకులు కేటాయిస్తారు. విద్యార్థులు తమ ప్రశ్నపత్రం, నిర్ధారించిన కీ తో సరిపోల్చుకునేందుకు వారి ఆన్లైన్ జవాబుపత్రాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు ఎంసెట్ అధికారులు పంపించారు. వాటిని ఎంసెట్ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. 18లోగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ఎంసెట్ ఫలితాల విడుదల దాదాపు నెలరోజుల పాటు ఆలస్యం కావడంతో విద్యార్థుల్లో అనేకమంది ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై పడనుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈనెల 18 లోగానే అడ్మిషన్లను చేపడతామని అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు.. – కురిశేటి రవి శ్రీతేజ (పశ్చిమగోదావరి) – పి. వేదప్రణవ్ (రంగారెడ్డి, తెలంగాణ) – గొర్తి భానుదత్త (పశ్చిమగోదావరి) – డి. చంద్రశేఖర్ ఎస్ఎస్ హేతహవ్య (రంగారెడ్డి, తెలంగాణ) – బి. కార్తికేయ (రంగారెడ్డి, తెలంగాణ) – రిషి షరాఫ్ (మాధేపూర్, బీహార్) – జీవీకె సూర్య లిఖిత్ (పశ్చిమగోదావరి) – ఎ. అభిజిత్‌రెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ) – ఆర్యన్ లద్ధా (రంగారెడ్డి, తెలంగాణ) – ఎ. హేమవెంకట అభినవ్ (కొత్తగూడెం, తెలంగాణ) అగ్రి–మెడికల్‌లో టాప్ 10 ర్యాంకర్లు.. – సుంకర సాయిస్వాతి (చిత్తూరు) – దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి (తూర్పుగోదావరి) – అత్యం సాయిప్రవీణ్ గుప్తా (తూర్పుగోదావరి) – తిప్పరాజు హాసిత (హైదరాబాద్) – జి.మాధురిరెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ) – గొంగటి కృష్ణవంశీ (నెల్లూరు) – కేజే వైష్ణవీ వర్మ (కర్నూలు) – డి. సుభిక్ష (తూర్పుగోదావరి) – కొర్నెపాటి హరిప్రసాద్ (గుంటూరు) – ఎంపటి కుష్వంత్ (భూపాలపల్లి, తెలంగాణ) ఐఏఎస్ అవుతా ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఫస్ట్ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముంబై ఐఐటీలో సీఎస్ఈ గ్రూపు చదవాలని ఉంది. తల్లిదండ్రులు గీతాకుమారి, నాగ వెంకట ఉమామహేశ్వర గుప్తాల సహకారంతో పాటు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగా. పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్ ఎంపీసీలో పదికి పది జీపీఏ, జేఈఈ మెయిన్స్‌లో 136వ ర్యాంకు వచ్చింది. బిట్ శాట్‌లో 450 మార్కులకు 450 మార్కులు వచ్చాయి. నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదల, క్రమశిక్షణతో రోజుకు 14 గంటలు చదివేవాడని శ్రీతేజ తల్లిదండ్రులు తెలిపారు. – రవి శ్రీతేజ, తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా, ఎంసెట్ ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కార్డియాలిజిస్ట్ను అవుతా మెడిసిన్‌లో కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. తల్లిదండ్రులు విజయశాంతి, సూర్యభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో ఎంసెట్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించగలిగా. టెన్త్, ఇంటర్లో పదికి పది జీపీఏ సాధించా. నీట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి మంచి కార్డియాలజిస్ట్‌గా గుర్తింపు పొందాలన్నది నా కోరిక. – దాసరి కిరణ్‌కుమార్, ఎంసెట్ ఆగ్రికల్చర్ విభాగంలో 2వ ర్యాంకర్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా పరిశోధనా రంగంలో రాణిస్తా పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణలు చేసి దేశాన్ని సమాచార, సాంకేతిక రంగంలో ముందంజలో నిలపాలని ఉంది. అమ్మానాన్నలు నాగ వెంకట విశ్వనాథం, సూర్య సుందరలక్ష్మి. ఇద్దరూ టీచర్లు. పేద విద్యార్థుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వీరు తమ కుమారుడి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. – గొర్తి భానుదత్త, ఇంజనీరింగ్ 3వ ర్యాంకర్, భీమవరం, ప.గో. జిల్లా -
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 'బీటెక్' ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : 2018 ఏడాదికిగానూ బీటెక్ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన కట్టాన్కులాంతుర్, రామపురం, వడపలాని, ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హర్యానా సోనేపట్లలో బీటెక్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు 1 నవంబర్ 2017 నుంచి 31 మార్చి 2018 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ ప్రవేశ అర్హతా పరీక్ష ఉత్తీర్ణత, ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దేశంలోని 130 కేంద్రాలతో పాటూ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 2018 ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వరకు అభ్యర్థులు తమ సౌలభ్యాన్ని బట్టి ఏరోజైనా పరీక్షకు హాజరు కావచ్చు. గత ఏడాది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1,50,000 విద్యార్థులు బీటెక్ విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో పాటూ, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారు. -
బీటెక్ మాత్రమే చేసిన టెకీలకు షాకింగ్ న్యూస్!
ముంబై: అసలే భారీ ఉద్యోగాల కోత వార్తలతో ఆందోళనలో పడిపోయిన సాఫ్ట్వేర్ల ఇంజనీర్లకు పిడుగులాంటి కబురు ఇది. ముఖ్యంగా బీటెక్ తోనే సరిపెట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల అయిన వారికి ఇది షాకింగే. కేవలం బీటెక్ డిగ్రీ ఉంటే సరిపోదనీ ఎంటెక్ తోపాటు, ప్రత్యేక నైపుణ్యాలను కూడా కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి యువతకు భవిష్యత్‌లో ఐటీ సెక్టార్లో జాబ్స్ కష్టంగా ఉంటుందని ప్రముఖ టెక్ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఐటీ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన పోస్ట్గ్రాడ్యుయేట్ల ఎంపిక పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నాయని ఎన్ఎస్ఈ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, టీవీ మోహన్ దాస్ పాయ్ చెప్పారు. నైపుణ్యం గల నిపుణులతో పోస్టు గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలనే కంపెనీలు కోరుకుంటాయని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రస్తుత చైర్మన్ పాయ్ చెప్పారు. ఐటి సెక్టార్ లో మంచి ఉద్యోగం పొందడానికి బి టెక్ డిగ్రీ సరిపోదని ఇన్ఫోసిస్ మాజీ హెచ్ ఆర్ హెడ్ మోహన్ దాస్ పేర్కొన్నారు. ఇందుకు ఎంటెక్‌తో పాటు, స్పెషలైజేషన్ చేయాలని సలహా ఇచ్చారు. కాలేజీ విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. అంతేకాదు అదనపు తరగతుల ద్వారా సొంత కోడింగ్ టెక్నాలజీ అలవర్చుకోవాలన్నారు. ఎందుకంటే కంపెనీలు మీకు ఆరు నెలలు జీతం ఇచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా లేవన్నారు. తద్వారా ఆయా కంపెనీలు సమయం, డబ్బు ఎందుకు వృధా చేసుకుంటాయని ఆయన ప్రశ్నించారు. కోడింగ్ లో నైపుణ్యం సాధిస్తేనే కంపెనీలు ఎంపిక చేసుకుంటాయన్నారు. గత రెండు దశాబ్దాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పరిశ్రమలో ఫెషర్స్ జీతాల గురించి అడిగినప్పుడు, ఇది "గొప్ప విషాదం" గా పాయ్ పేర్కొన్నారు. ఎందుకంటే మొత్తం పరిశ్రమ వృద్ధి మందగించిందని తెలిపారు. సరఫరా (సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య) పెరిగిపోయింది, కానీ దానికి దగ్గ డిమాండ్ లేదన్నారు. ఐటిలో గ్లోబల్ వ్యయం ఈ ఏడాది కేవలం రెండు శాతం మాత్రమే పెరగనుందని అంచనా వేశారు.( అంతకు ముందు 3-4 శాతం ఉన్నది) ఇది కూడా ప్రభావం చూపిస్తుందన్నారు. అలాగే ఐటీ ఉద్యోగాల సంక్షోభ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐటీ పరిశ్రమలో విస్తృత ఉద్యోగ నష్టాలను సూచించే నివేదికలన్నీ అతిశయోక్తులను కొట్టిపారేశారు. దీనికి డాటాను పరిశీలించాలన్నారు. ఐటీ యూనియన్లనుకూడా తప్పుబట్టారు. ఎవరూ వారికి మద్దతు ఇవ్వడంలేదన్నారు. అలాగే యూనియన్లతో పాటు వెళ్ళే వ్యక్తులు ఎప్పటికీ ఉద్యోగాలు పొందలేరని హెచ్చరించారు. -
ఐఐటీలో మూడున్నరేళ్లకే బీటెక్ కంప్లీట్!
కాన్పూర్: సాధారణంగా ఇంజనీరింగ్ కంప్లీట్ కావాలంటే నాలుగేళ్లు పడుతుంది. విద్యార్ధులు కాస్త అలసత్వం ప్రదర్శిస్తే మరికొన్నేళ్లు అదనంగా పట్టే అవకాశం కూడా ఉంది. అలాంటిది ప్రతిష్టాత్మక ఐఐటీలో బీటెక్ చేస్తున్న ముగ్గురు విద్యార్ధులు తమ కోర్సును మూడున్నరేళ్లకే కంప్లీట్ చేశారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లలో కంప్లీట్ కావాల్సిన కోర్సును ఏడు సెమిస్టర్లలోనే ఫినిష్ చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన వారు కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు. అలాగే అక్కడ బీటెక్, ఎంటెక్ కలిసి ఉండే డ్యూయల్ డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు తమ కోర్సును నాటుగున్నరేళ్లకే కంప్లీట్ చేశారు. వాస్తవానికి ఈ కోర్సు 10 సెమిస్టర్లలో పూర్తి కావాల్సి ఉండగా 9 సెమిస్టర్లలోనే వీరు కంప్లీట్ చేశారు. కోర్సు తొందరగా పూర్తి చేయడానికి ఈ ఐదుగురు విద్యార్థులు చాలా కష్టపడ్డారని కాన్పూర్ ఐఐటీ సెనేట్ మెంబర్స్ మీటింగ్‌లో ప్రశంసలు కురిపించారు. ఈ ఐదుగురు విద్యార్ధులు 2017లో జరిగే కాన్వకేషన్ సెరిమొనిలో డిగ్రీలు అందుకోనున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. -
4డి టెక్నాలజీతో జంతువులను క్రియేట్ చేసిన యువకుడు
-
స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - హైదరాబాద్.. భాగ్యనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రావుల మనీశ్చంద్రరెడ్డి తన క్యాంపస్ లైఫ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. క్యాంపస్‌లో సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తరగతులు ముగుస్తాయి. లంచ్ తర్వాత 2.30 నుంచి 5.30 గంటల వరకు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఫ్యాకల్టీ.. ఎంతో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీలో ఎక్కువ మంది యువతే. స్టూడెంట్స్‌కు.. ఫ్యాకల్టీ మధ్య పెద్దగా వయసులో తేడా లేదు. అందువల్ల విద్యార్థులను చక్కగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త బోధన పద్ధతులు అమలు చేస్తారు. మేము ఫ్యాకల్టీ నుంచి ఏమి ఆశిస్తున్నామో సులువుగా గ్రహిస్తారు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. మూస పద్ధతికి స్వస్తి బోధన వినూత్నంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్ గంటన్నరపాటు ఉంటుంది. విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తారు లేదా విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్ సమాధానాలివ్వడం.. నిజ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయించడం ఇలా బోధనలో వివిధ పద్ధతులను పాటిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్సెరా ద్వారా కూడా విద్యార్థులు కోర్సులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే ప్రతి విద్యార్థీ లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలి. నేను ఇప్పటివరకు క్రియేటివ్ ఆర్ట్స్, వెస్ట్రన్ పెయింటింగ్, మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం, షార్ట్‌స్టోరీ రైటింగ్, ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటివాటిని అధ్యయనం చేశాను. స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం మూడు స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. స్టార్టప్ ఏర్పాటు చేసేవారికి కార్యాలయం కోసం స్థలం, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ప్రింటర్స్, ఫ్యాక్స్, టెలిఫోన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్లు వంటి మొత్తం 180 ఈవెంట్లు ఉంటాయి. నేను కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో వాక్, రోబో కాంపిటీషన్స్తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలుంటాయి. సదుపాయాలెన్నో.. క్యాంపస్ సదుపాయాల విషయానికొస్తే ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంపస్ అంతా మంచి స్పీడ్‌తో వై-ఫై సౌకర్యం ఉంది. క్యాంపస్‌లో రెండు భోజనశాలలున్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఆధునిక లేబొరేటరీలున్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి 150 ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే లైబ్రరీని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఆన్లైన్లో చదువుకోవడానికి అందరికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. పీహెచ్డీ చేస్తా పరిశోధనలంటే నాకు ఎంతో ఆసక్తి. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ప్రాక్టికల్స్‌కే కేటాయిస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్, పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. -
కాంతులీనే కెరీర్‌కు ‘కొలువంత’ అండగా...
‘‘నేను బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్నాను?.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధిక శాతం ఉద్యోగార్థుల నోటి నుంచి వస్తున్న మాట ఇది! గ్రూప్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్లు కరువైన వేళ.. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వస్తున్న బ్యాంకు ఉద్యోగాల ప్రకటనలు నిరుద్యోగులకు అడగా నిలుస్తున్నాయి.. కాస్త్త శ్రమిస్తే చాలు.. కాంతులీనే కొలువును చేజిక్కించుకోవచ్చనే ధీమానిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి వారి ముందుకు ఐబీపీఎస్ నుంచి పీవో నోటిఫికేషన్ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది.. ఈ నేపథ్యంలో పీవో నోటిఫికేషన్ వివరాలతో పాటు పరీక్షలో గెలుపు గమ్యానికి చేర్చే సుస్థిర సోపానాలపై ఫోకస్.. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రంగానే ఉన్నప్పటికీ, ప్రకటనలు కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో కష్టపడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగం-కుటుంబ జీవితానికి మధ్య సమన్వయం సాధించగలిగే చక్కటి పని వాతావరణం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు విస్తృతంగా ఉండటం.. ఇలా వివిధ కారణాల వల్ల నేటి యువత బ్యాంకులో కొలువుదీరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగానికి మరింత ఊపునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దేశంలో ఆర్థిక అనుసంధానానికి ఊతమిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 15 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవాలని, వీటిలో అత్యధికంగా 12 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరవాలనే ఆలోచన ఉంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు ఉద్యోగావకాశాలు పలకరించనున్నాయి. ఐబీపీఎస్.. పీవో: తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రెయినీస్ లేదా తత్సమాన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా, పోస్టులు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణతోపాటు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఖాళీలు పెరుగుతున్నాయి. భాగస్వామ్య బ్యాంకులు: ఐబీపీఎస్ ఆధారంగా ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంటున్న బ్యాంకులు.. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ. అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులు. అయితే ఫలితాలు 2014, ఆగస్టు 11 లేదా అంతకంటే ముందు వెల్లడై ఉండాలి.వయో పరిమితి: కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. జూలై 2, 1984; జూలై 1, 1994 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: తొలుత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఖాళీలనుబట్టి నిర్దేశిత కటాఫ్ ఆధారంగా కామన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష స్కోర్ కార్డు మార్చి 31, 2016 వరకు చెల్లుబాటవుతుంది. ప్రశ్నపత్రం: ఆన్లైన్లో జరిగే పరీక్ష ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలుంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. విభాగం గరిష్ట మార్కులు రీజనింగ్ 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి) 40 కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్ప) మాధ్యమంలో ఉంటుంది. ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. 506 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష- విభాగాలు: విభాగం {పశ్నలు మార్కులు రీజనింగ్ 40 40 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 న్యూమరికల్ ఎబిలిటీ 40 40 జనరల్ అవేర్నెస్ 40 40 కంప్యూటర్ నాలెడ్జ్ 40 40 ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు: జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (ఆన్లైన్): జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (బ్యాంకు శాఖల్లో): జూలై 18-ఆగస్టు 11, 2014. ఆన్లైన్ పరీక్ష: సెప్టెంబర్, 2014. వెబ్సైట్: rbi.org.in ఇండియన్ బ్యాంక్ ముఖ్య తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 16-జూలై 30, 2014. దరఖాస్తు సవరణకు చివరి తేదీ: జూలై 30, 2014. ఫీజు చెల్లింపు: జూలై 16-జూలై 30, 2014. పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఒక్కో పోస్టుకు) రూ.50. ఇతర అభ్యర్థులకు రూ.550 వెబ్సైట్: www.indianbank.in సన్నద్ధతకు సిద్ధం.. (ఐబీపీఎస్ పీవో పాటు ఇతర బ్యాంకు ఉద్యోగాలకూ ఉపయోగపడే ప్రిపరేషన్ ప్రణాళిక..) రీజనింగ్: అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని, తార్కిక విశ్లేషణను అంచనా వేసేందుకు బ్యాంకు పరీక్షలో రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 50 మార్కులు దీనికి కేటాయిస్తారు. స్టేట్మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్; ర్యాంకింగ్స్, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. కాన్సెప్టులపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాసేజ్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ను గుర్తించగలగాలి. ఈ పరిజ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ప్రీవియస్ పేపర్ల్లోని ప్రశ్నలకు అన్వయిస్తూ ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వేగంగా చదవడం, తప్పులను గుర్తించే నైపుణ్యం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ విభాగం నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థులు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విభాగంలో పైచార్టు, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పారాగ్రాఫ్/కేస్‌లెట్స్; టేబుల్స్ రూపంలోని సమస్యలను సాధించాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు, వర్గ మూలాలు, ఘన మూలాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. మొత్తంమీద ఆైఈకఅ సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ; యావరేజ్; ప్రాఫిట్-లాస్; సింపుల్-కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో-ప్రొపోర్షన్-వేరియేషన్; నంబర్ థియరీ (రిమైండర్స్); టైమ్-స్పీడ్-వర్క్; జియోమెట్రీ (ఏరియా, వాల్యూమ్, పెరీమీటర్) తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో సాధారణంగా 75 శాతం ప్రశ్నలు బ్యాంకింగ్ రంగానికి, మిగిలిన 25 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌పై వస్తున్నాయి. క్రీడలు; పుస్తకాలు-రచయితలు; వార్తల్లో వ్యక్తులు; అవార్డులు; జనాభా లెక్కలు; సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్బీఐకి సంబంధించిన అంశాలను కరెంట్ అఫైర్స్ కోణంలో అధ్యయనం చేయాలి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు, మాట్లాడే ఏటీఎంల ఏర్పాటు, కార్డ్ లెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ తదితర వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దినపత్రికలు, ప్రామాణికమైన పోటీ పరీక్షల మ్యాగజైన్లను చదవడం ద్వారా జనరల్ అవేర్నెస్పై పట్టు సాధించవచ్చు. న్యూస్ బులెటన్లు చూస్తుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్వేర్ బేసిక్స్, ఇంటర్నెట్/నెట్వర్క్, వైరస్/సెక్యూరిటీ, డేటాబేస్ తదితర అంశాలకు సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకోవాలి. షార్ట్‌కట్ కమాండ్స్‌ను తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ బేసిక్ కంప్యూటర్ పుస్తకాలు అక్కరకొస్తాయి. బ్యాంక్ పీవో కెరీర్ ప్రస్థానం ప్రభుత్వ/ప్రైవేటురంగ బ్యాంకుల్లో జూనియర్, మిడిల్, సీనియర్, టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలుంటాయి. అధిక బ్యాంకుల్లో జూనియర్ స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్; మిడిల్ మేనేజ్మెంట్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్; సీనియర్ మేనేజ్మెంట్లో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్; టాప్ మేనేజ్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలుంటాయి. వీటిని స్కేల్-1, స్కేల్-2.. ఇలా స్కేల్-7 వరకు పోస్టులుగా వ్యవహరిస్తారు. ఇవి కాకుండా స్పెషల్ స్కేలుగా చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డెరైక్టర్ ఉద్యోగాలుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఎండీ స్థాయికి చేరిన వారంతా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించినవారే.. అంటే సుమారు 25 ఏళ్లకు కెరీర్‌ను ప్రారంభించిన వారు 35 ఏళ్లకు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశముంది. జీతభత్యాలు: పీవోల జీతం వారు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని చోట్లా మూల వేతనం, కరువు భత్యం వంటివి సమానంగా ఉన్నా.. హెచ్ఆర్ఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వంటివి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఒకరకంగా; జైపూర్, చండీగఢ్, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో మరో విధంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తక్కువగా ఉంటాయి. నెలకు రూ.25 వేల కనీస వేతనం నుంచి కెరీర్ ప్రారంభమవుతుంది. చాలా బ్యాంకుల్లో ఆఫీసర్ ఇల్లు వెతుక్కుంటే దాన్ని బ్యాంకే లీజుకు తీసుకొని, అందులో ఫర్నిచర్ సమకూరుస్తుంది. ఆ ఫర్నిచర్ నిర్వహణకు అదనపు అలవెన్సు అందిస్తుంది.రెండు/నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. వాహనాల కోసం ఆఫీసర్ స్థాయికి అనుగుణంగా పెట్రోలు ఇస్తారు. ఇల్లు కొనుగోలుకు/నిర్మాణానికి తక్కువ వడ్డీకి, సాధారణ వడ్డీపై రుణాలిస్తారు (సాధారణంగా బ్యాంకుల్లో అన్ని రుణాలపైనా నెలవారీ చక్రవడ్డీ వసూలు చేస్తారు). బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంచుకునేందుకు రెండు/మూడు దినపత్రికలు, మ్యాగజైన్లు సమకూర్చుకునేందుకు అవకాశమిస్తారు. నాలుగేళ్లకోసారి ఉద్యోగం చేసే చోటు నుంచి, స్వస్థలానికి వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి డబ్బులిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కుటుంబంతో కలిసి పర్యటించేందుకు అవకాశమిస్తారు. కొన్ని బ్యాంకులు సీనియర్ స్థాయి అధికారులకు విదేశీ పర్యటనకు అవకాశమిస్తున్నాయి. మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి క్రాస్ సెల్లింగ్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీటివల్ల రాజమార్గంలో అదనపు ఆదాయం సమకూరుతుంది. క్రాస్ సెల్లింగ్ బాగా చేసిన వారికి ధన రూపంలోనే కాకుండా, విదేశీ పర్యటన అవకాశాం కూడా కల్పిస్తున్నారు. విధుల నిర్వహణ: ఉద్యోగంలో బాధ్యతల విషయానికొస్తే ఎప్పుడైనా కనీసం మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి. ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ప్రత్యేక అలవెన్సు ఇస్తారు. ప్రొబేషన్ పూర్తికాగానే ఫీల్డ్ ఆఫీసర్‌గా, ఐదారు ఏళ్ల తర్వాత స్వతంత్రంగా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ప్రతిభ కనబరిస్తే, పెద్ద బ్రాంచ్‌లో మేనేజర్ అవకాశమిస్తారు. ఆపైన పదోన్నతలు ద్వారా 30-45 బ్రాంచ్‌ల సమాహారమైన ప్రాంతీయ కార్యాలయం; 100-150 బ్రాంచ్‌ల సమాహారమైన జోనల్ కార్యాలయాల్లో వివిధ సాయిల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. క్రెడిట్, కంప్యూటర్, ఫారెన్ ఎక్స్ఛ్ంజ్, రికవరీ, ట్రెజరీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధచూపి, ప్రావీణ్యం సంపాదించిన వారికి ప్రధాన కార్యాలయంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులకు విదేశాల్లో శాఖలున్నాయి. ఆయా దేశాల్లో క్లరికల్ ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారుగానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై పంపిస్తారు. వీరికి ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి. విభిన్న నేపథ్యాల నుంచి బ్యాంకుల్లో చేరిన వారికి బ్యాంకింగ్ దైనందిన జీవితంలో అవసరమైన విద్యను అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ముంబై).. జేఏఐఐబీ/సీఏఐఐబీ కోర్సులు అందిస్తోంది. వీటిని పూర్తిచేసిన వారికి ఒక్కో పరీక్షకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారు. వీటి ప్రభావం పదోన్నతులపైనా ఉంటుంది. ఈ కోర్సులకు అదనంగా మరికొన్ని డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రాక్టీస్ కొద్దీ ఫలితం రోజువారీ పరీక్షలు: రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ‘బ్యాంకింగ్ అండ్ యూ’ మ్యాగజైన్లు ఉపయోగపడతాయి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేశామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో దానికే ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యమైన అంశాలు: రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. నమూనా పరీక్షలు: ప్రతి రోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించి పేరున్న పబ్లికేషన్ల మ్యాగజైన్లలో మోడల్ టెస్ట్‌లు ఇస్తున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రచురణ సంస్థలు ఆన్లైన్ మాక్ టెస్ట్‌ల ప్యాకేజీలను అందిస్తున్నాయి. కొంత మొత్తం చెల్లించి వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి మాక్ టెస్ట్‌ల వల్ల విజయంలో కీలకపాత్ర పోషించే టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అసలు పరీక్ష రోజున ఒత్తిడికి చోటు లేకుండా చేయొచ్చు. వ్యూహం: పరీక్షలో తొలుత ఒక్కో విభాగానికి 20 నిమిషాలు చొప్పున కేటాయిస్తూ వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలో మిగిలిన ప్రశ్నలను సాధించేందుకు ప్రయత్నించాలి. తొలుత న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలను సాధిస్తే మంచిది. -
అక్క బాట.. నాన్న మాట స్ఫూర్తిగా
కుటుంబ నేపథ్యం: మా స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామం. నాన్న పుల్లయ్య. గుదిమెళ్ల ఉన్నతపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అమ్మ పద్మ గృహిణి. అక్క కిరణ్మయి. జేఎన్టీయూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. మా చదువుల కోసం అమ్మా నాన్నలు సొంతూరుకు దూరంగా ఖమ్మంలో ఉండాల్సి వచ్చింది. అక్కను చూసి: అక్క కిరణ్మయి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. జేఎన్టీయూ హైదరాబాద్‌లో సీటు సాధించింది. అక్కను చూసి అమ్మా, నాన్న మురిసిపోయేవారు. అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఎందుకో అక్కను చూసి ఆమె కంటే బాగా రాణించాలని మనసులో అనుకున్నాను. ఏడో తరగతి నుంచే పునాది: మంచి ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలని నాన్నను అడిగా. ఐఐటీలో చదవాలన్నారు. నేను చేస్తా నన్ను చదివించండంటూ పట్టు బట్టాను. సరేనంటూ ఏడో తరగతి నుంచేఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేర్పించారు. అలా చిన్నప్పుడే పట్టుదలతో చదివాను. ఏ తరగతిలో ఉన్నా ఐఐటీ ధ్యాసగానే చదివాను. చదువొక్కటే తెలుసు: పుస్తకమే నా ప్రపంచం. తోటి విద్యార్థులకు దూరంగా ముభావంగా ఉండే స్వభావిని నేను. నన్ను గమనించిన కృష్ణవేణీ కళాశాల డెరైక్టర్ వై.వెంకటేశ్వర్రావు చుట్టూ ఉన్న సమాజం, సంబంధాలు మొదలైన అంశాల గురించి చెప్పేవారు. అందరితో కలిసి ఉండాలి.. అందరికంటే బాగా చదవాలని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి చదువుపరంగా అర్థం కాని విషయాలను ఫ్రెండ్స్‌తో చర్చించడం మొదలు పెట్టాను. అధ్యాపకులను అడిగి తెలుసుకోవడం అలవాటైంది. ఇది పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడింది. ప్రణాళికే విజయ సోపానం: విద్యాసంవత్సరం ఆరంభం నుంచే టైం టేబుల్ ప్రకారం చదవడం అలవాటు చేసుకున్నాను. ఇంటర్‌లోనూ అలానే చేశాను. ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేశాను. దీంతో పరీక్షల సమయంలో ఏనాడూ ఒత్తిడికి లోనవలేదు. ఏమాత్రం అలసినట్లు అనిపించినా.. బోర్‌కొట్టినా షటిల్ అడటం.. ఆ తర్వాత మళ్లీ చదువుకోవడం ఇదే నా నిత్యకృత్యం. నాన్న సూచనలు: సిలబస్ పరంగా ఏ పుస్తకాలు చదవాలి? ఏ తరహాలో చదవాలనే విషయంలో నాన్న సూచనలు ఎంతగానో ఉపకరించాయి. అకడమిక్ సిలబస్‌నే అనుసరించమన్నారు. అకడమిక్ పుస్తకాలు చదివే సమయంలో కొత్తపదాలు. ముఖ్యమైన అంశాలను వెంటనే నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవడమెలా? అనే విషయాలపై మంచి సలహాలిచ్చేవారు. ఇలా చేయడంతో ఏ ప్రశ్నలు ఏ రూపంలో అడుగుతారో అవగాహన ఏర్పడింది. పరీక్షలంటే భయం పోయింది. గ్రాండ్ టెస్టులతో మేలు: ఎంత చదివాం అన్నది కాదు. చదివిన అంశాలను ఏ విధంగా పరీక్షల్లో అన్వయించామన్నదే కీలకం. అందుకోసం గ్రాండ్ టెస్టులు ఎంతో దోహదపడ్డాయి. 25కు పైగా ఐఐటీ గ్రాండ్ టెస్టులు రాశాను. వాటి ఫలితాలపై విశ్లేషించుకునే వాళ్లం. ఎక్కడ ఏ సబ్జెక్టులో పొరపాట్లు తలెత్తుతున్నాయో తెలిసేది. ఎందులో వెనుకబడి ఉన్నానో తెలుసుకొని ఆ అంశాలను మరింత లోతుగా చదివాను. ఇలా గ్రాండ్ టెస్టులతో తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి మార్గం సుగమమైంది. ఖరగ్‌పూర్-ఐఐటీలో చేరతా: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయస్థాయిలో 137వ ర్యాంక్ వచ్చింది. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తాను. జాతీయ స్థాయిలో పోటీనా అనుకుంటే ఏదీ సాధించలేం. అలాని కోచింగ్ తీసుకుంటే వస్తుందని అనుకోవద్దు. పట్టుదల, ప్రణాళికతో సాగితే ఏదైనా సాధ్యమే. ఐఐటీ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ముందుగా ఒత్తిడి, భయాన్ని వీడాలి. లక్ష్యం... ఐఏఎస్: చిన్నప్పటి నుంచి తరగతిలో ప్రథమస్థానం నాదే. నా ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు కలెక్టర్వి అవుతావు అనేవాళ్లు. టెన్త్ నుంచి ఇప్పటిదాకా నేను సాధించే విజయాలు చూస్తే ఆ నమ్మకం నిజమేననిపిస్తుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మంచి మార్కులు సాధించి ఆ తర్వాత సివిల్స్‌పై దృష్టి సారిస్తా. మా ఊరికి..ఆ తర్వాత జిల్లా ప్రజలకు సేవ చేస్తా. అకడమిక్ ప్రొఫైల్: పదో తరగతి (2012): 10/10 ఇంటర్: 992 మార్కులు ఎంసెట్ ర్యాంకు(2014): 156 బిట్‌శాట్ 2014 స్కోర్: 330 జేఈఈ-మెయిన్ ర్యాంక్: 4 జేఈఈ- అడ్వాన్స్డ్ ర్యాంక్: 137 సహకారం: ఈరగాని భిక్షం, న్యూస్‌లైన్ ఖమ్మం. -
యాడున్నవ్ బిడ్డా
కరీంనగర్ క్రైం: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన శ్రీనిధి ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. ఆరు రోజులుగా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనిధి జ్ఞాపకాలను తల్చుకుంటూ ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఆర్కే విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనిధి విహారయాత్రకు వెళ్లిన తోటి విద్యార్థులతో పాటు ఈ నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యింది. మరుసటి రోజు నుంచి నిరంతరాయంగా గాలింపు జరుపుతున్నప్పటికీ శ్రీనిధి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 9న బియాస్ నది వద్దకు చేరుకున్న ఆమె తండ్రి రాజిరెడ్డి కుమార్తె ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్నాడు. ఈ సంఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా, ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. అందులో శ్రీనిధి లేకపోవడంతో ఆమె సజీవంగా ఉంటుందన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బియాస్ నది వద్ద నుంచి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. శనివారం నదిపై ఉన్న మూడు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని ఆపివేసి, నదిలో నీటిని పూర్తిగా నిలిపివేసి మరింత ముమ్మరంగా గాలింపు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మూడు గంటల పాటు నీటిని నిలిపివేసి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పారు. దీంతో శ్రీనిధి ఆచూకీ దొరికే అవకాశాలున్నాయని రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ లక్ష్యమే గేట్ దాటించింది!
బీటెక్ మూడో సంవత్సరంలోనే భవిష్యత్ దిశగా ప్రణాళిక.. కెరీర్, ఉన్నత విద్య ఏదైనా ‘గేట్’ దాటాల్సిందే.. దాంతోనే సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకోవడం సాధ్యమవుతుంది.. ఇదే లక్ష్యంగా శ్రమించి.. ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నా అంటున్నారు.. గేట్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో) జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన రాపోలు జయప్రకాశ్. లక్ష్యం దిశగా ప్రకాశించిన అతని సక్సెస్ స్టోరీ.. స్వస్థలం వరంగల్ జిల్లా కేసముద్రం. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఏఐఈఈఈలో ర్యాంకుతో నిట్-వరంగల్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)లో ప్రవేశం లభించింది. ఇంటర్మీడియెట్ వరకు అకడమిక్ పరంగా మంచి స్కోర్లు సాధించే వాణ్ని. నిట్‌లో ప్రవేశంతోనే భవిష్యత్ లక్ష్యంపై అవగాహన ఏర్పడింది. ఈ దిశగా అక్కడి ప్రొఫెసర్లు అందించిన సహకారం ఎంతో విలువైంది. ఈ క్రమంలోనే గేట్ ర్యాంకును లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. అంతేకాకుండా గతేడాది గేట్లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రవితేజ మా క్యాంపస్ కావడం కూడా నాలో మరింత స్ఫూర్తినింపింది. మూడో ఏడాది నుంచి: బీటెక్ రెండో సంవత్సరంలోనే గేట్ గురించి ఆలోచన, అవగాహన ఏర్పడినప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించింది మాత్రం మూడో సంవత్సరం నుం చే. మూడో సంవత్సరం(రెండు సెమిస్టర్లు) పూర్తయ్యే నాటికి.. అకడమిక్స్‌తో సమాంతరంగా గేట్ ప్రిపరేషన్ సాగించాను. ఆ తర్వాత వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు కోచింగ్ తీసుకున్నాను. గతేడాది సెప్టెంబర్ నుం చి ఈ ఏడాది మార్చి వరకు సమయాన్ని పూర్తి స్థాయిలో గేట్ కోసమే కేటాయించాను. అకడమిక్ సిలబస్, గేట్ సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ రోజుకు నాలుగైదు గంటలు కష్టపడే వాణ్ని. వారాంతాల్లోనైతే ప్రిపరేషన్ కోసం తొమ్మిది గంటలు కేటాయించాను. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా: గతేడాది నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఎల్ అండ్ టీ సంస్థకు ఎంపికయ్యాను. అయితే గేట్లో ర్యాంకు ద్వారా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లలో ఉద్యోగం సాధించాలని లక్ష్యం ఉండేది. దాంతో గేట్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిచ్చాను. అంతేకాకుండా పీఎస్‌యూలలో ఉద్యోగం చేయడం ద్వారా సమాజానికి పరోక్షంగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో కూడా గేట్ దిశగా అడుగులు వేశాను. ప్రస్తుతం ఉద్యోగానికి ప్రాధాన్యం. నాలుగైదేళ్లు అనుభవం గడించాక ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తాను. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ : లక్షల మంది పోటీ పడే గేట్లో ర్యాంకు సొంతం చేసుకోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ ఆధారితంగానే ఉంటాయి. గత ప్రశ్నపత్రాల పరిశీలన, మాక్ టెస్ట్‌ల ఆధారంగా ఈ విషయాన్ని గ్రహించాను. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని థియరీ, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదువుతూ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకుంటూ ముందుకుసాగాను. ఇలా.. నవంబర్ నాటికి గేట్ సిలబస్‌ను పూర్తి చేశాను. ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలకు సంబంధించి సొంతంగా నోట్స్ రూపొందించుకున్నాను. ఇది రివిజన్‌కు ఎంతో లాభించింది. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం కూడా విజయానికి దోహదం చేశాయి. సలహా: బీటెక్ మూడో సంవత్సరం నుంచి.. గేట్ తేదీకి కనీసం ఆరు నెలల ముందు నుంచి పూర్తిస్థాయిలో ఉద్యుక్తులవ్వాలి. అంతేకాకుండా చివరి నిమిషం వరకు చదవకుండా.. పరీక్షకు రెండు నెలల ముందు సిలబస్ పూర్తి చేసుకుని ఆ తర్వాత సమయాన్ని రివిజన్, మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. విజయాన్ని నిర్దేశించడంలో సమయపాలన కీలక పాత్ర. కాబట్టి ఔత్సాహికులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా నిర్దేశించిన సమయంలో కచ్చితత్వం కూడా సమాధానాలు ఇవ్వడం అలవడుతుంది. ఇలాంటి ప్రణాళికతోనే ప్రిపరేషన్ సరైన మార్గంలో ఉంటుంది. అకడమిక్ ప్రొఫైల్: 2008లో పదో తరగతి (532 మార్కులు) ఉత్తీర్ణత 2010లో ఇంటర్మీడియెట్ (949 మార్కులు) ఉత్తీర్ణత 2010లో ఏఐఈఈఈలో తొమ్మిది వేల ర్యాంకు; ఎంసెట్‌లో 860వ ర్యాంకు; బిట్‌శాట్ స్కోర్ 293 పస్తుతం నిట్-వరంగల్‌లో బీటెక్ ఈఈఈలో ఫైనల్ సెమిస్టర్. -
రేపటి నుంచి బీటెక్, బీ ఫార్మశీ పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: జేఎన్టీయూహెచ్ పరిధిలో ఫైనలియర్ బీటెక్, బీఫార్మశీ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వర్సిటీ అధికారులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. తొలుత అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఫైనలియర్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలంటూ.. వర్సిటీ అధికారులు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించేందుకు ఈ నెల 4న ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 90,228 మంది... ఫైనలియర్ బీటెక్, బీఫార్మశీ పరీక్షలకు మొత్తం 90,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 85993 మంది బీటెక్ విద్యార్థులు కాగా, 4235 మంది బీఫార్మశీ వారు. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఎన్నికల అనంతరం (మే 19 తర్వాత) నిర్వహిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ దఫా బీటెక్, బీఫార్మశీ పరీక్షలకు కూడా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తప్పని అవస్థలు... జంబ్లింగ్ విధానం ప్రకారం ఒక కళాశాల విద్యార్థులకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే.. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు 20 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో కేంద్రాల వల్ల అక్కడికి వెళ్లే క్రమంలో గతంలో ఎంతోమంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు గురైనా... యూనివర్సిటీ అధికారులకు మాత్రం పట్టడం లేదు. అందని హాల్‌టికెట్లు మరో 24 గంటల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన కొన్ని కళాశాలల విద్యార్థులకు ఇంకా హాల్‌టికెట్లు అందలేదు. ప్రైవేటు యాజమాన్యాలు యూనివర్సిటీకి కామన్ సర్వీస్ ఫీజు బకాయిలు చెల్లించనందుకు హాల్‌టికెట్లను నిలిపివేసినట్లు సమాచారం. ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా రాలేదని మరి కొన్ని కళాశాలల సిబ్బంది యూనివర్సిటీ పరీక్షల విభా గం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు... ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా యి. -
బీటెక్ టు గేట్.. వయా ఎంబీఏ
సక్సెస్ స్టోరీ గేట్ ఈసీఈ 4వ ర్యాంకర్ ఎంసెట్.. ఏఐట్రిపుల్ఈ.. ఐఐటీ.. బిట్‌శాట్.. ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు. అటు అకడమిక్‌గా పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు మంచి పర్సంటేజీలు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేసి.. తర్వాత ఎంబీఏ చదివి.. మళ్లీ తనకిష్టమైన ఇంజనీరింగ్‌లో పీజీ కోసం దృష్టి సారించి.. అందుకు మార్గంగా గేట్‌ను ఎంచుకుని.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో నిలిచారు కె.కె.శ్రీనివాస్.. నాన్నవృత్తి రీత్యా బరోడా నుంచి హైదరాబాద్ వచ్చాం. ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే చదివాను. అన్ని తరగతుల్లోనూ 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సబ్జెక్ట్‌లను ఇష్టంగా చదవడం వల్లే ఈ ఫలితాలు లభించాయి. అందుకే ఇంటర్మీడియెట్ తర్వాత రాసిన నాలుగు ఎంట్రన్స్లలోనూ (ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ, బిట్‌శాట్) మంచి ర్యాంకులు సొంతమయ్యాయి. అన్నిటికంటే బిట్స్ పిలానీ అంటే ఆసక్తి ఉండటంతో అక్కడ బీటెక్‌లో చేరాను. ఇంజనీరింగ్‌పై మక్కువ తగ్గలేదు: 2011లో బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తిచేసిన వెంటనే ముంబైలోని కె.జె.సోమయ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏలో చేరాను. ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో కోర్సు పూర్తి చేశాను. వాస్తవానికి మేనేజీరియల్ స్కిల్స్ పెంచుకోవాలని ఎంబీఏలో చేరా. కానీ, ఇష్టమైన ఇంజనీరింగ్‌ను వదులుకోలేకపోయా. అందుకే ఎంబీఏ పూర్తి చేశాక మళ్లీ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య ఎంటెక్ కోసం గేట్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. 2013 నుంచి ఏడాదిపాటు హైదరాబాద్‌లో పూర్తిస్థాయి కోచింగ్ తీసుకున్నాను. దీనివల్ల జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు వచ్చింది. రెండేళ్ల విరామం: బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరడంతో రెండేళ్ల విరామం వచ్చింది. అయినా బీటెక్‌లోని అన్ని అంశాలను సమగ్రంగా చదివి ఉండటంతో గేట్ ప్రిపరేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా ఉద్దేశంలో బీటెక్ చదివేటప్పుడే అన్ని సబ్జెక్టులను ఔపోసన పడితే గేట్ గురించి ఆందోళన చెందక్కర్లేదు. ప్రతి సబ్జెక్ట్‌కు సొంత ఫార్ములా: గేట్ ప్రిపరేషన్ పరంగా పకడ్బందీ కసరత్తు చేశాను. ప్రతి సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన, క్లిష్టంగా భావించిన అన్ని ఫార్ములాలు, కాన్సెప్ట్‌లతో చిన్నపాటి నోట్స్‌లు రూపొందించుకున్నాను. పునశ్చరణకు ఇవి ఎంతో ఉపకరించాయి. అంతేకాకుండా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం కూడా లాభించింది. ఆ మూడు ఇన్స్టిట్యూట్లలో సీటే లక్ష్యం: గేట్ ప్రస్తుత ర్యాంకుతో ఐఐఎస్సీ బెంగళూరు లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ సీటు పొందాలని భావిస్తున్నాను. ఐఐటీల్లో ప్రసిద్ధ క్యాంపస్‌గా గుర్తింపు పొందిన ఐఐటీ-బాంబేలో నా బ్రాంచ్‌కు సరిపడే ఏ స్పెషలైజేషన్‌లో సీటు వచ్చినా చేరతాను. ఎంటెక్ పూర్తి చేశాక మంచి కెరీర్లో అడుగుపెట్టి.. తద్వారా సమాజానికి సాధ్యమైనంత సేవ చేయడమే లక్ష్యం. ఔత్సాహికులకు సలహా: బీటెక్ మూడో సంవత్సరం నుంచే గేట్ కోసం కసరత్తు ప్రారంభించడం వల్ల సత్ఫలితాలు ఆశించొచ్చు. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరవడం మంచిది. మాక్టెస్టుల వల్ల పరీక్ష అంటే భయం పోతుంది. సబ్జెక్ట్‌ల వారీగా కనీసం రెండు గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం మంచిది. పరీక్షకు కనీసం పదిహేను రోజుల ముందునుంచి రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బీటెక్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయిలో కాన్సెప్టుల వారీగా పరిజ్ఞానం సంపాదిస్తే గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించవచ్చు. సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అకడమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. ఉన్నత విద్యావకాశాలకు వీలు కల్పించే గేట్‌కు ఏటా పోటీ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వీయ ప్రణాళికలు రూపొందించుకొని పరీక్షకు సిద్ధమవాలి. అకడమిక్ నేపథ్యం: పదో తరగతి: 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్: 98.1 శాతం మార్కులు. ఎంసెట్‌లో 131వ ర్యాంకు; ఏఐఈఈఈలో 795వ ర్యాంకు; బిట్‌శాట్‌లో 317వ ర్యాంకు; ఐఐటీ-జేఈఈలో 3210వ ర్యాంకు. 2011లో బిట్స్ పిలానీ నుంచి 9.42 సీజీపీఏతో బీటెక్ (ఈసీఈ) ఉత్తీర్ణత. 2013లో 72 శాతంతో ఎంబీఏ ఉత్తీర్ణత. -
బీటెక్ పరీక్ష ల షెడ్యూల్ విడుదల
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న బీటెక్ కోర్సు పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం సీఈ డి.సత్యనారాయణ విడుదల చేశారు. బీటెక్ 4/4, బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ , 3/4 బీటెక్ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి, 4/4 బీటెక్ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, 3/4 బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఏప్రిల్ పదో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో 22 తేదీ వరకు చెల్లించవచ్చు. కళాశాలలు నామినల్ రోల్స్‌ను ఈనెల 24 తేదీలోగా సమర్పించాలి. పరీక్ష ఫీజు 4/4 బీటెక్ కోర్సులకు ఒక్కో సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులకు రూ.760, 3/4 బీటెక్ కోర్సులకు ఒక్కో సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులకు రూ.685గా నిర్ణయించారు. ఒక్కో ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.185, బెటర్మెంట్ ఫీజు రూ.265, ఒరిజినల్ డిగ్రీ ఫీజు రూ.375, కన్సాలిడేట్ మార్కుల జాబితా ఫీజు రూ. 1365 అదనంగా చెల్లించాలి. ఎల్ఎల్బీ పరీక్షల షెడ్యూల్.. వర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్న మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు 4,6వ సెమిస్టర్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు 4, 8, 10 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం సీఈ డి. సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వ తేదీ వరకు చెల్లించవచ్చు. కళాశాలలు సంబంధిత నామినల్ రోల్స్‌ను ఏప్రిల్ తేదీలోగా యూనివర్సిటీకి సమర్పించాలి. పరీక్షలు ఈ ఏడాది 21వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు 4వ సెమిస్టర్, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులోని 6, 8వ సెమిస్టర్లు ఒక్కో దానిలో అన్ని సబ్జెక్టులకు రూ. 365, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆరో సెమిస్టర్, ఐదేళ్ల పదో సెమిస్టర్లో ఒక్కో దానిలో అన్ని సబ్జెక్టులకు రూ. 585 చెల్లించాలి. రెండు సబ్జెక్టులకు రూ.225, మూడు పేపర్లకు రూ. 275 చెల్లించాలి. బెటర్మెంట్ ఫీజు రూ. 225 నిర్ణయించారు. స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆరు వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు ఈ ఏడాది కూడా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ఆచార్య వై. కిషోర్ తెలిపారు. కోచింగ్ మేనెల 15 తేదీ నుంచి జూన్ 24 తేదీ వరకు అథ్లెటిక్స్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో , సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల్లో ఉంటుందని తెలిపారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 20 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. అప్లికేషన్ ఫారం తదితర వివరాలను ఠీఠీఠీ.టజీట.ౌటజ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వివరాలకు 8331852264, 8331852265 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
దరఖాస్తుల వెల్లువ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఒక్కపోస్టుకు సుమారుగా 200 మంది పోటీ.. ఇదేదో తహశీల్దార్.. ఆపై పోస్టులకు కాదు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు పోటీపడుతున్న జిల్లా అభ్యర్థుల సంఖ్య. దరఖాస్తు గడువుకు సోమవారమే చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్లో క్యూ కట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి జిల్లాలో 98 వీఆర్ఓ, 172 వీఆర్ఏ పోస్టులుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 59,342 దరఖాస్తులు అందాయి. వీఆర్ఓ పోస్టులకు అత్యధిక మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీఆర్ఓ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ మొదలు పీజీ, బీటెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 98 వీఆర్ఓ పోస్టులకు 56,710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక జిల్లాలో 172 వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 1,631 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ రెండు పోస్టులకు జిల్లాలో 1,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు సోమవారం రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తారు. -
బేకార్ టెక్...!
‘‘అన్నా.. బీటెక్ అయిపోయి రెండేళ్లయ్యింది. కాలేజీలో నేర్చుకున్న అంతంత మాత్రం సబ్జెక్టు కూడా మరిచిపోతున్నా. హైదరాబాద్ వచ్చి కంపెనీల్లో ఉద్యోగం వెతుక్కునే స్తోమత లేదు. ఇక్కడే ఏదైనా కళాశాలల్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించన్నా..’’ - పి.శ్రీనివాస్ అనే సీఎస్ఈ గ్రాడ్యుయేట్ వేడుకోలు ‘‘బీటెక్ పూర్తయింది. ఏడాది గడిచిపోయింది. కళాశాలలో నేర్చుకున్నదేమీ లేదు. హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలో రూ.17 వేలు చెల్లించి కోర్ జావా కోర్సు నేర్చుకున్నా. కానీ ఫ్రెషర్లకు ఎక్కడా ఉద్యోగాలు దొరకడం లేదు..’’ - బీటెక్ పట్టభద్రుడైన వెంకట్‌రెడ్డి ఆవేదన ...ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు.. రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల దుస్థితి. చదువుల్లో గట్టెక్కినా, ఉద్యోగం మెట్టెక్కలేక తడబడుతున్న విద్యార్థుల వెతలివి. సాంకేతిక విద్య పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదంటూ లక్షలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. 2012-13 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని కాలేజీల నుంచి బయటికి వచ్చిన 1.25 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 25 వేల మందికే క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించాయి. మిగిలిన వారికి కొలువు తిప్పలు తప్పడం లేదు. బీటెక్ పూర్తయినవారిలో చాలా మంది తమ చదువులతో సంబంధం లేని చిన్నాచితక ఉద్యోగాల్లో చేరిపోతుండగా.. మిగతావారు అయిష్టంగానే పైచదువులకు వెళ్తున్నారు. 2012-13 విద్యా సంవత్సరానికి ముందు కూడా ఇదే పరిస్థితి. ఇలా ఏటా దాదాపు లక్ష మంది పట్టభద్రులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు. చేరిన ఉద్యోగాల్లో పట్టుమని రూ.10 వేల వేతనం కూడా లేని పరిస్థితుల మధ్య ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మానసిక వేదనకు లోనవుతున్నారు. ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న వారికీ నిరాశే మిగులుతోంది. ఐదారేళ్ల అనుభవం ఉన్న వారిని మినహా ఫ్రెషర్లను పట్టించుకున్న కంపెనీ ఒక్కటీ లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఓయూ, ఏయూ, ఎస్వీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 1.25 లక్షల మంది ఉత్తీర్ణులైనట్టు సాంకేతిక విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. లక్షల మంది కాలేజీల్లో చేరుతున్నా.. వారిలో ఉత్తీర్ణులై బయటకు వస్తున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువే ఉంది. అటు ల్యాబ్ వసతులు, ఇటు బోధనా ప్రమాణాలు లేకపోవడంతో ఫెయిల్ అవుతున్నవారు కొందరైతే.. పాసవుతున్నా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నవారు ఎందరో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉద్యోగాలు కరువు.. రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు దాదాపుగా 30-60 కళాశాలలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఐటీ రంగంలో 2004-05 నుంచి 2008-09 మధ్య ఏటా 50 వేలకు పైగా (ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీ బ్రాంచీలతో కలిపి) కొత్త ఉద్యోగవకాశాలు దక్కేవి. 2010-11లో ఆ సంఖ్య 27 వేలకు పడిపోయింది. గడిచిన మూడేళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం ఏర్పడడంతో అటు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా అవకాశాలు సన్నగిల్లాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోవడం కూడా వీరి అవకాశాలకు గండికొట్టింది. రాష్ట్రంలో కొత్తగా నేదునూరు, శంకరపల్లి ప్రాంతాల్లో విద్యుత్తు ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఎలక్ట్రికల్ పట్టభద్రులకు నిరాశే మిగిలింది. అలాగే గడిచిన రెండేళ్లలో తీవ్ర విద్యుత్తు కోతలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి. కొత్త పట్టభద్రులు వైపు చూడడమే మానేశాయి. ఫ్యాబ్‌సిటీ, ఈ-సిటీ అంటూ ప్రభుత్వం నిరుద్యోగులను ఊరించినా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బ్యాంకింగ్ రంగం వైపు చూపు.. రాష్ట్రంలో అటు ప్రభుత్వరంగ ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితి లేకపోవడం, ఇటు ప్రైవేటు రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో బీటెక్ పట్టభద్రులకు ఒక్క బ్యాంకింగ్ రంగమే ఆశాజనకంగా కనిపిస్తోంది. ‘‘రెండు మూడేళ్లు ఏటా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పెద్ద ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. త్వరలోనే కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు దక్కుతాయన్న వార్తలు వస్తుండడంతో బ్యాంకింగ్ ఉద్యోగాలపై తాజా పట్టభద్రులు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని అమీర్‌పేట్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్న కె.శ్రావణ్ పేర్కొన్నారు. బ్యాంకు కొలువుల వైపు బీటెక్ పట్టభద్రులు మొగ్గు చూపుతుండడంలో రాజధానిలోని బ్యాంకింగ్ ఉద్యోగ శిక్షణ సంస్థలు విద్యార్థులతో నిండిపోయాయి. అయితే కోచింగ్‌కు రూ.7, 8 వేలు, హాస్టల్‌కు రూ.3 వేల చొప్పున వెచ్చించ గలిగే స్తోమత ఉన్న వారే ఈ శిక్షణ పొందుతున్నారు. అంత ఆర్థిక స్తోమత లేనివారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఇంటి వద్దే ఉంటూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖాళీగా ఉండలేక సమీప పట్టణాల్లో ఐదారు వేల వేతనంతో ఏ చిరుద్యోగంలోనే చేరిపోతున్నారు. పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం: అజయ్‌జైన్, కమిషనర్, సాంకేతిక విద్య ‘‘విద్యా బోధనలో నాణ్యత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (టెక్విప్)లో చేరిన కొన్ని కళాశాలలు నాణ్యమైన విద్య అందిస్తూ ప్లేస్మెంట్లు కూడా చూపాయి. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరం? మనం ఏం శిక్షణ ఇవ్వాలి? అన్న అంశాలను నిత్యం సమీక్షించుకునేందుకు పారిశ్రామిక అనుసంధానం ఉండాలి. నాణ్యతకు అర్థం ఇదే. ప్రతిష్టాత్మక సంస్థలన్నీ చేసేది ఇదే. థియరీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రాక్టికల్‌గా పెంపొందించాలంటే పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం’’ దేశీయంగా ప్రాజెక్టులు పెరగాలి: ఎన్.ఎల్.ఎన్.రెడ్డి, ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్, సీబీఐటీ ‘‘ఇప్పటికీ మన దేశంలోని ఐటీ కంపెనీలన్నీ అమెరికా ప్రాజెక్టులపైనే ఆధారపడుతున్నాయి. మనదేశం ఇ-గవర్నెన్స్ అమలుచేస్తున్నప్పటికీ ఇది చాలా స్వల్పం. దీన్ని విస్తృతపరిస్తే దేశీయ ప్రాజెక్టులతో ఐటీ రంగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయి’’ ఆ కాలేజీలపై ఉక్కుపాదం మోపాలి: డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ నిపుణులు ‘‘కాలేజీల్లో కనీస ప్రమాణాల నియంత్ర ణ కరువైంది. కొన్ని యాజమాన్యాలు ప్రమాణాలు పెంచకుండా సీట్లు పెంచుకోవడం ఎలా? వాటిని నింపుకోవడం ఎలా? అటెండెన్స్ లేని వారికి అటెండెన్స్ వేసి డబ్బులు సంపాదించడం ఎలా? వంటి చర్యలకు దిగజారాయి. ఇప్పటికైనా ప్రమాణాలు పాటించని కళాశాలలపై ఉక్కుపాదం మోపాలి. టాస్క్‌ఫోర్స్ కమిటీలు చేసిన తనిఖీ నివేదికలను బయటపెట్టాలి’’ బీటెక్ చదువు.. కానిస్టేబుల్ పోస్టు బీటెక్ పట్టాలు చేతిలో ఉన్నా ఎందరో అభ్యర్థులు కిందిస్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇక సర్కారీ కొలువైతే అదే పదివేలు అనుకుంటున్నారు. ఎంత చిన్న పోస్టు అయినా అందులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం శిక్షణలో ఉన్న 12 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 10 శాతం మంది.. అంటే 1,200 మంది బీటెక్ అభ్యర్థులే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బీటెక్ చదివినా ఇంటర్మీడియెట్ స్థాయితో భర్తీ అయ్యే పోస్టుల్లో చేరిపోయారు. వీరే కాదు.. ఈ 12 వేల మందిలో దాదాపు 6 వేల మంది పీజీ పట్టభద్రులు ఉండడం గమనార్హం. తమ వద్దకు వచ్చిన అభ్యర్థుల్లో తెలుగు కూడా సరిగ్గా రానివారు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీస్ నియామకాలు చూసే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బీటెక్ సర్టిఫికెట్ పట్టుకొని బయటకు వస్తున్న వారిలో కేవలం 10 శాతం మందికే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యం ఉంటోందని ఇటీవల నాస్కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. బయటకు వస్తున్న చాలా మందిలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని తెలిపింది. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
బాసర, న్యూస్‌లైన్ : నిజామాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని మంగళవారం బాసర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీకి చెందిన మూడ సదానందంకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు శ్యామల(20) ఇటీవల బీటెక్ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసింది. అందులో ఒక సబ్జెక్టు తప్పడంతో మనస్తాపం చెందింది. ఇక తనను చదివించలేరనే బాధతో బాసర గోదావరి నది బ్రిడ్జిపై నుంచి నదిలో దూకింది. చెప్పులు, పర్సు అక్కడే వదిలేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పర్సులో ఉన్న ఫొటోలు, డ్రెస్‌పై ఉన్న టేలర్ నంబరుకు పోలీసులు ఫోన్ చేయడంతో వివరాలు లభించాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.