కాంతులీనే కెరీర్‌కు ‘కొలువంత’ అండగా...
‘‘నేను బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్నాను?.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధిక శాతం ఉద్యోగార్థుల నోటి నుంచి వస్తున్న మాట ఇది! గ్రూప్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్లు కరువైన వేళ.. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వస్తున్న బ్యాంకు ఉద్యోగాల ప్రకటనలు నిరుద్యోగులకు అడగా నిలుస్తున్నాయి.. కాస్త్త శ్రమిస్తే చాలు.. కాంతులీనే కొలువును చేజిక్కించుకోవచ్చనే ధీమానిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి వారి ముందుకు ఐబీపీఎస్ నుంచి పీవో నోటిఫికేషన్ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది.. ఈ నేపథ్యంలో పీవో నోటిఫికేషన్ వివరాలతో పాటు పరీక్షలో గెలుపు గమ్యానికి చేర్చే సుస్థిర సోపానాలపై ఫోకస్..
బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రంగానే ఉన్నప్పటికీ, ప్రకటనలు కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో కష్టపడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగం-కుటుంబ జీవితానికి మధ్య సమన్వయం సాధించగలిగే చక్కటి పని వాతావరణం, కెరీర్‌లో ఎదగడానికి అవకాశాలు విస్తృతంగా ఉండటం.. ఇలా వివిధ కారణాల వల్ల నేటి యువత బ్యాంకులో కొలువుదీరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగానికి మరింత ఊపునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దేశంలో ఆర్థిక అనుసంధానానికి ఊతమిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 15 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవాలని, వీటిలో అత్యధికంగా 12 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరవాలనే ఆలోచన ఉంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు ఉద్యోగావకాశాలు పలకరించనున్నాయి.
ఐబీపీఎస్.. పీవో:
తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్‌మెంట్ ట్రెయినీస్ లేదా తత్సమాన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా, పోస్టులు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణతోపాటు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఖాళీలు పెరుగుతున్నాయి.
భాగస్వామ్య బ్యాంకులు:
ఐబీపీఎస్ ఆధారంగా ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంటున్న బ్యాంకులు.. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ.
అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులు. అయితే ఫలితాలు 2014, ఆగస్టు 11 లేదా అంతకంటే ముందు వెల్లడై ఉండాలి.వయో పరిమితి: కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. జూలై 2, 1984; జూలై 1, 1994 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: తొలుత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఖాళీలనుబట్టి నిర్దేశిత కటాఫ్ ఆధారంగా కామన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష స్కోర్ కార్డు మార్చి 31, 2016 వరకు చెల్లుబాటవుతుంది.
ప్రశ్నపత్రం:
ఆన్‌లైన్‌లో జరిగే పరీక్ష ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలుంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
విభాగం గరిష్ట మార్కులు
రీజనింగ్ 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
జనరల్ అవేర్‌నెస్
(బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి) 40
కంప్యూటర్ నాలెడ్జ్ 20
ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్ప) మాధ్యమంలో ఉంటుంది.
ఆర్‌బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. 506 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష- విభాగాలు:
విభాగం {పశ్నలు మార్కులు
రీజనింగ్ 40 40
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40
న్యూమరికల్ ఎబిలిటీ 40 40
జనరల్ అవేర్‌నెస్ 40 40
కంప్యూటర్ నాలెడ్జ్ 40 40
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు: జూలై 16-ఆగస్టు 6, 2014.
ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్): జూలై 16-ఆగస్టు 6, 2014.
ఫీజు చెల్లింపు (బ్యాంకు శాఖల్లో):
జూలై 18-ఆగస్టు 11, 2014.
ఆన్‌లైన్ పరీక్ష: సెప్టెంబర్, 2014.
వెబ్‌సైట్: rbi.org.in
ఇండియన్ బ్యాంక్
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జూలై 16-జూలై 30, 2014.
దరఖాస్తు సవరణకు చివరి తేదీ: జూలై 30, 2014.
ఫీజు చెల్లింపు: జూలై 16-జూలై 30, 2014.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఒక్కో పోస్టుకు) రూ.50. ఇతర అభ్యర్థులకు రూ.550
వెబ్‌సైట్: www.indianbank.in
సన్నద్ధతకు సిద్ధం..
(ఐబీపీఎస్ పీవో పాటు ఇతర బ్యాంకు
ఉద్యోగాలకూ ఉపయోగపడే ప్రిపరేషన్ ప్రణాళిక..)
రీజనింగ్:
అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని, తార్కిక విశ్లేషణను అంచనా వేసేందుకు బ్యాంకు పరీక్షలో రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 50 మార్కులు దీనికి కేటాయిస్తారు. స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ర్యాంకింగ్స్, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. కాన్సెప్టులపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించవచ్చు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్:
కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాసేజ్‌లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్‌ను గుర్తించగలగాలి. ఈ పరిజ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ప్రీవియస్ పేపర్‌ల్లోని ప్రశ్నలకు అన్వయిస్తూ ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వేగంగా చదవడం, తప్పులను గుర్తించే నైపుణ్యం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ విభాగం నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
అభ్యర్థులు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విభాగంలో పైచార్టు, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పారాగ్రాఫ్/కేస్‌లెట్స్; టేబుల్స్ రూపంలోని సమస్యలను సాధించాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు, వర్గ మూలాలు, ఘన మూలాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. మొత్తంమీద ఆైఈకఅ సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ; యావరేజ్; ప్రాఫిట్-లాస్; సింపుల్-కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో-ప్రొపోర్షన్-వేరియేషన్; నంబర్ థియరీ (రిమైండర్స్); టైమ్-స్పీడ్-వర్క్; జియోమెట్రీ (ఏరియా, వాల్యూమ్, పెరీమీటర్) తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్:
ఈ విభాగంలో సాధారణంగా 75 శాతం ప్రశ్నలు బ్యాంకింగ్ రంగానికి, మిగిలిన 25 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌పై వస్తున్నాయి. క్రీడలు; పుస్తకాలు-రచయితలు; వార్తల్లో వ్యక్తులు; అవార్డులు; జనాభా లెక్కలు; సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్‌నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్‌బీఐకి సంబంధించిన అంశాలను కరెంట్ అఫైర్స్ కోణంలో అధ్యయనం చేయాలి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు, మాట్లాడే ఏటీఎంల ఏర్పాటు, కార్డ్ లెస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫండ్స్ తదితర వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దినపత్రికలు, ప్రామాణికమైన పోటీ పరీక్షల మ్యాగజైన్లను చదవడం ద్వారా జనరల్ అవేర్‌నెస్‌పై పట్టు సాధించవచ్చు. న్యూస్ బులెటన్లు చూస్తుండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం:
కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్‌వేర్ బేసిక్స్, ఇంటర్నెట్/నెట్‌వర్క్, వైరస్/సెక్యూరిటీ, డేటాబేస్ తదితర అంశాలకు సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకోవాలి. షార్ట్‌కట్ కమాండ్స్‌ను తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ బేసిక్ కంప్యూటర్ పుస్తకాలు అక్కరకొస్తాయి.
బ్యాంక్ పీవో కెరీర్ ప్రస్థానం
ప్రభుత్వ/ప్రైవేటురంగ బ్యాంకుల్లో జూనియర్, మిడిల్, సీనియర్, టాప్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగాలుంటాయి. అధిక బ్యాంకుల్లో జూనియర్ స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్; మిడిల్ మేనేజ్‌మెంట్‌లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్; సీనియర్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్; టాప్ మేనేజ్‌మెంట్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలుంటాయి. వీటిని స్కేల్-1, స్కేల్-2.. ఇలా స్కేల్-7 వరకు పోస్టులుగా వ్యవహరిస్తారు. ఇవి కాకుండా స్పెషల్ స్కేలుగా చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డెరైక్టర్ ఉద్యోగాలుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఎండీ స్థాయికి చేరిన వారంతా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించినవారే.. అంటే సుమారు 25 ఏళ్లకు కెరీర్‌ను ప్రారంభించిన వారు 35 ఏళ్లకు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశముంది.
జీతభత్యాలు:
పీవోల జీతం వారు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని చోట్లా మూల వేతనం, కరువు భత్యం వంటివి సమానంగా ఉన్నా.. హెచ్‌ఆర్‌ఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వంటివి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఒకరకంగా; జైపూర్, చండీగఢ్, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో మరో విధంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తక్కువగా ఉంటాయి. నెలకు రూ.25 వేల కనీస వేతనం నుంచి కెరీర్ ప్రారంభమవుతుంది. చాలా బ్యాంకుల్లో ఆఫీసర్ ఇల్లు వెతుక్కుంటే దాన్ని బ్యాంకే లీజుకు తీసుకొని, అందులో ఫర్నిచర్ సమకూరుస్తుంది. ఆ ఫర్నిచర్ నిర్వహణకు అదనపు అలవెన్సు అందిస్తుంది.రెండు/నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. వాహనాల కోసం ఆఫీసర్ స్థాయికి అనుగుణంగా పెట్రోలు ఇస్తారు.
ఇల్లు కొనుగోలుకు/నిర్మాణానికి తక్కువ వడ్డీకి, సాధారణ వడ్డీపై రుణాలిస్తారు (సాధారణంగా బ్యాంకుల్లో అన్ని రుణాలపైనా నెలవారీ చక్రవడ్డీ వసూలు చేస్తారు). బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంచుకునేందుకు రెండు/మూడు దినపత్రికలు, మ్యాగజైన్లు సమకూర్చుకునేందుకు అవకాశమిస్తారు. నాలుగేళ్లకోసారి ఉద్యోగం చేసే చోటు నుంచి, స్వస్థలానికి వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి డబ్బులిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కుటుంబంతో కలిసి పర్యటించేందుకు అవకాశమిస్తారు. కొన్ని బ్యాంకులు సీనియర్ స్థాయి అధికారులకు విదేశీ పర్యటనకు అవకాశమిస్తున్నాయి. మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి క్రాస్ సెల్లింగ్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీటివల్ల రాజమార్గంలో అదనపు ఆదాయం సమకూరుతుంది. క్రాస్ సెల్లింగ్ బాగా చేసిన వారికి ధన రూపంలోనే కాకుండా, విదేశీ పర్యటన అవకాశాం కూడా కల్పిస్తున్నారు.
విధుల నిర్వహణ:
ఉద్యోగంలో బాధ్యతల విషయానికొస్తే ఎప్పుడైనా కనీసం మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి. ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ప్రత్యేక అలవెన్సు ఇస్తారు. ప్రొబేషన్ పూర్తికాగానే ఫీల్డ్ ఆఫీసర్‌గా, ఐదారు ఏళ్ల తర్వాత స్వతంత్రంగా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ప్రతిభ కనబరిస్తే, పెద్ద బ్రాంచ్‌లో మేనేజర్ అవకాశమిస్తారు. ఆపైన పదోన్నతలు ద్వారా 30-45 బ్రాంచ్‌ల సమాహారమైన ప్రాంతీయ కార్యాలయం; 100-150 బ్రాంచ్‌ల సమాహారమైన జోనల్ కార్యాలయాల్లో వివిధ సాయిల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. క్రెడిట్, కంప్యూటర్, ఫారెన్ ఎక్స్ఛ్‌ంజ్, రికవరీ, ట్రెజరీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధచూపి, ప్రావీణ్యం సంపాదించిన వారికి ప్రధాన కార్యాలయంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ తదితర బ్యాంకులకు విదేశాల్లో శాఖలున్నాయి. ఆయా దేశాల్లో క్లరికల్ ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారుగానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై పంపిస్తారు. వీరికి ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి. విభిన్న నేపథ్యాల నుంచి బ్యాంకుల్లో చేరిన వారికి బ్యాంకింగ్ దైనందిన జీవితంలో అవసరమైన విద్యను అందించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ముంబై).. జేఏఐఐబీ/సీఏఐఐబీ కోర్సులు అందిస్తోంది. వీటిని పూర్తిచేసిన వారికి ఒక్కో పరీక్షకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారు. వీటి ప్రభావం పదోన్నతులపైనా ఉంటుంది. ఈ కోర్సులకు అదనంగా మరికొన్ని డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ప్రాక్టీస్ కొద్దీ ఫలితం రోజువారీ పరీక్షలు:
రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ‘బ్యాంకింగ్ అండ్ యూ’ మ్యాగజైన్లు ఉపయోగపడతాయి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేశామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్‌లో దానికే ప్రాధాన్యమివ్వాలి.
ముఖ్యమైన అంశాలు:
రీజనింగ్‌లో ఎరేంజ్‌మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది.
నమూనా పరీక్షలు:
ప్రతి రోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించి పేరున్న పబ్లికేషన్ల మ్యాగజైన్లలో మోడల్ టెస్ట్‌లు ఇస్తున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రచురణ సంస్థలు ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ల ప్యాకేజీలను అందిస్తున్నాయి. కొంత మొత్తం చెల్లించి వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి మాక్ టెస్ట్‌ల వల్ల విజయంలో కీలకపాత్ర పోషించే టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. అసలు పరీక్ష రోజున ఒత్తిడికి చోటు లేకుండా చేయొచ్చు.
వ్యూహం:
పరీక్షలో తొలుత ఒక్కో విభాగానికి 20 నిమిషాలు చొప్పున కేటాయిస్తూ వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలో మిగిలిన ప్రశ్నలను సాధించేందుకు ప్రయత్నించాలి. తొలుత న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలను సాధిస్తే మంచిది.