గురుకుల విద్యాలయాలు | Andhra Pradesh Gurukul schools Company | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యాలయాలు

Published Tue, May 10 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

గురుకుల విద్యాలయాలు

గురుకుల విద్యాలయాలు

ఉత్తమ విద్యా - ఉచిత వసతి
 ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నాయి.. గురుకుల విద్యాలయాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల విద్యాలయాల సంస్థల పరిధిలో 97 రెసిడెన్షియల్ స్కూళ్లు, 14 ఇంటర్ కాలేజీలు, 2 డిగ్రీ కాలేజీలు పేద విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి.  టీఎస్ ఆర్‌జేసీ, ఏపీ ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష (సెట్)లు వరుసగా  నేడు, ఈ నెల 12న జరగనున్నాయి. అలాగే ఆర్‌డీసీని కూడా మే 12న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుకుల విద్యాలయాలపై సమగ్ర కథనం.
 
  ఆంధ్రప్రదేశ్‌లో...
 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) పరిధిలో 38 సాధారణ, 12 మైనారిటీ  గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా జనరల్ బాయ్స్ కేటగిరిలో 4, జనరల్ (గర్ల్స్) 2, జనరల్ (కో ఎడ్యుకేషన్) 1, మైనారిటీ (బాయ్స్) 2, మైనారిటీ (గర్ల్స్) 1 మొత్తం 10 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు దీని ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల- నాగార్జున సాగర్, గుంటూరు జిల్లా, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల- కర్నూలులలో రెండు డిగ్రీ కాలేజీలు పనిచేస్తున్నాయి.
 
  తెలంగాణలో..
 తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌ఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో 35 జనరల్, 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయి. అలాగే జనరల్ బాయ్స్ 1, జనరల్ గర్ల్స్-1, మైనారిటీ (బాయ్స్) 2.. మొత్తం 4 జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి.
 
 రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాలు..
 రెసిడెన్షియల్ స్కూళ్లకు 5వ తరగతి స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు/ఉర్దూ (30 మార్కులు), మ్యాథ్స్ 35 మార్కులు), పరిసరాల విజ్ఞానం (సైన్స్, సోషల్-35 మార్కులు)లలో 4వ తరగతి స్థాయిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో ప్రతిభ చూపినవారు పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు.
 
 ప్రయోజనాలెన్నో..
 గురుకుల విద్యాసంస్థల రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదో తరగతిలో ప్రవేశం పొందడం ద్వారా పది వరకు ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యను పూర్తి ఉచితంగా అందుకోవచ్చు. ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌లో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా ఇంటర్, డిగ్రీని కేవలం నామమాత్ర రుసుముతో అభ్యసించవచ్చు.భోజన, వసతి సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తారు. ఉన్నత విద్యార్హతలు గల ఉపాధ్యాయులతో బోధన ఉంటుంది.  చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యార్థులు తమ ఆసక్తులకు పదును పెట్టుకునే అవకాశం లభిస్తుంది.  ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.  జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, జేఈఈ, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తారు.
 
  జూనియర్ కాలేజీల్లో..
 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏటా ప్రవేశ పరీక్ష (ఏపీ/టీఎస్ ఆర్‌జేసీసెట్) నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఈఈటీ, సీజీడీటీ విభాగాల్లో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. కాల వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో సాధించిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది ఏపీ ఆర్‌జేసీలలో 1080 సీట్లకు దాదాపు 74 వేల మంది దరఖాస్తు చేశారు. తెలంగాణలోని 4 జూనియర్ కాలేజీల్లో 690 సీట్లకు 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
  డిగ్రీలో ప్రవేశాలు..
 డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఆర్‌డీసీ-సెట్) నిర్వహిస్తారు. 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. రెండు రాష్ట్రాల విద్యార్థులూ దీనికి హాజరు కావచ్చు. బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీకాం జనరల్, బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీఎస్సీ (బోటనీ, మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండు డిగ్రీ కాలేజీల్లో దాదాపు 432 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
  మెరుగైన ఫలితాలు..
 టీఎస్‌ఆర్‌ఈఐఎస్ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో  2015-16 ఇంటర్ సెకండియర్‌లో 89 శాతం మంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 86.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు టీఎస్‌ఆర్‌ఈఐఎస్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ఫ్యాకల్టీతో ప్రత్యేకంగా ఎంసెట్ మెటీరియల్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. నిపుణులైన ఫ్యాకల్టీతో ఎంసెట్, జేఈఈ కోచింగ్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్‌ఆర్‌ఈఐఎస్ పరిధిలోని నాలుగు జూనియర్ కాలేజీల నుంచి పదిహేను మంది విద్యార్థులు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి ఆర్‌జేసీ విద్యార్థిని ఎన్.హేమిక జేఈఈ మెయిన్స్‌లో అధికంగా 121 మార్కులు సాధించినట్లు చెప్పారు.
 
  29 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత..
 ఏపీఆర్‌ఈఐఎస్ పరిధిలోని 10 జూనియర్ కాలేజీల నుంచి 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 29 మంది అర్హత సాధించారు. నాగార్జునసాగర్ జూనియర్ కాలేజీ విద్యార్థి డి.గుణశేఖర్ అత్యధికంగా జేఈఈ మెయిన్‌లో 186 మార్కులు సాధించాడు. ఏపీఆర్‌ఈఐఎస్ పరిధిలోని 38 రెసిడెన్షియల్ స్కూళ్లు టెన్త్‌లో ఏటా 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. 2015-16 ఇంటర్ సెకండియర్‌లో సగటు ఉత్తీర్ణత దాదాపు 97.1 శాతం. నిమ్మకూరు (కృష్ణా), నాగార్జునసాగర్, వెంకటగిరి (నెల్లూరు) జూనియర్ కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ఫస్ట్‌ఇయర్ ఉత్తీర్ణత శాతం 92.3. అన్ని జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, జేఈఈ కోచింగ్ అందిస్తున్నాం. ఈ ఏడాది నుంచి నీట్‌కు కూడా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.
 
 ఏపీఆర్‌ఈఐఎస్ పరిధిలోని డిగ్రీ కాలేజీలు, కోర్సులు, సీట్లు
 1) నాగార్జునసాగర్: బీఏ (హెచ్‌ఈపీ), బీకాం (జనరల్), బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంఎస్‌సీ), మొత్తం సీట్లు: 152 2) సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కాలేజీ, కర్నూలు: బీఏ (హెచ్‌ఈపీ), బీకాం (జనరల్), బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (బీజెడ్‌సీ), బీకాం (ప్రొఫెషనల్), బీఎస్సీ (మ్యాథ్‌‌స, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్‌‌స), బీఎస్సీ (ఎంపీఈకే), బీఎస్సీ (బోటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ), బీఎస్సీ (బోటనీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్), బీఎస్సీ (జువాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ), మొత్తం సీట్లు:  280
  - పి. జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement