
సాక్షి, హైదరాబాద్ : 2018 ఏడాదికిగానూ బీటెక్ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చెందిన కట్టాన్‌కులాంతుర్, రామపురం, వడపలాని, ఎన్‌సీఆర్ ఢిల్లీ క్యాంపస్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హర్యానా సోనేపట్లలో బీటెక్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు 1 నవంబర్ 2017 నుంచి 31 మార్చి 2018 వరకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ ప్రవేశ అర్హతా పరీక్ష ఉత్తీర్ణత, ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దేశంలోని 130 కేంద్రాలతో పాటూ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 2018 ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వరకు అభ్యర్థులు తమ సౌలభ్యాన్ని బట్టి ఏరోజైనా పరీక్షకు హాజరు కావచ్చు.
గత ఏడాది ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో 1,50,000 విద్యార్థులు బీటెక్ విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో పాటూ, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారు.