ఫైటర్‌ పైలట్‌..బ్రైట్‌ అండ్‌ ఫైట్‌ | Maharashtra 23-year-old woman fighter pilot from Thane | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ పైలట్‌..బ్రైట్‌ అండ్‌ ఫైట్‌

Published Sun, Jan 2 2022 6:27 AM | Last Updated on Sun, Jan 2 2022 6:27 AM

Maharashtra 23-year-old woman fighter pilot from Thane - Sakshi

‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’

ఆకాశంలో బొయ్య్‌మని విమానం చేసే శబ్దాలు వినడమన్నా, చిన్ని విమానాన్ని కళ్లు పెద్దవి చేసి చూడడమన్నా అందరు పిల్లల్లాగే రోషిణికీ ఇష్టం. ఆ ఇష్టం ఆమెను వైమానిక చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేలా చేసింది.

ఠాణె (మహారాష్ట్ర)లోని లోక్‌ పురం పబ్లిక్‌ స్కూల్‌లో చదివే రోజుల్లో రోషిణికి వచ్చే సందేహాలు...ఆమె విజ్ఞాన దాహానికి నిదర్శనాలుగా ఉండేవి.
మాజీ రాష్ట్రపతి, ఏరోస్పేస్‌ సైంటిస్ట్‌ అబ్దుల్‌ కలామ్‌ అంటే రోషిణికి ఎంతో అభిమానం. తాను ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చేయడానికి, ఫైటర్‌ పైలట్‌ కావడానికి ఆయనే స్ఫూర్తి.
మంచి మాటలు మంచి కలలను ఇస్తాయి.

కలామ్‌ ఏం అన్నారు?
‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ... ఇదిమాత్రమే కాదు, ‘ప్రతి గురువు ఒకప్పుడు విద్యార్థే. ప్రతి విజేత ఒకప్పుడు పరాజితుడే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు తొలి అడుగులు వేసిన వాడే. అందరూ నేర్చుకోవడం అనే వంతెనను దాటి వచ్చినవారే’ ఇలాంటి మాటలు రోషిణి ఆశయ బలానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి.

‘చిన్నప్పటి నుంచి తన ఆలోచనలకు విలువ ఇస్తూ వచ్చాం. ఫైటర్‌ పైలట్‌ కావాలనేది తన లక్ష్యమని చెప్పినప్పుడు ఆశీర్వదించాం. మా అమ్మాయి ఫైటర్‌ పైలట్‌ అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు, పిల్లల కలలను నిరక్ష్యం చేయకండి. వారి కలలకు బలాన్ని ఇవ్వండి...అని తల్లిదండ్రులకు చెప్పే సందర్భాన్ని ఇచ్చాయి’ అంటున్నాడు రోషిణి తండ్రి రవి అయ్యర్‌.

చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చేసిన అయ్యర్‌ ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌సీఏటి) ద్వారా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. ‘ఫైటర్‌ పైలట్‌ అంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. బృహత్తరమైన బాధ్యత. జాతికి సేవ చేసుకునే అదృష్టం’ అంటుంది రోషిణి. స్కూల్లో చదివే రోజుల్లో రోషిణి జాతీయస్థాయిలో ఆటలు ఆడింది.

రీడింగ్, ట్రెక్కింగ్, పెయింటింగ్‌ అంటే రోషిణికి బాగా ఇష్టం. మూడు అభిరుచులను ముచ్చటగా సమన్వయం చేసుకోవడం కూడా ఆమెకు తెలుసు. చదువు ఊహలను ఇస్తుంది. ఆ ఊహాలు అందమైన పెయింటింగ్స్‌గా మారతాయి. ఆ చిత్రాల భావుకత తనను ప్రకృతి ప్రపంచంలోకి తీసుకెళ్లి ట్రెక్కింగ్‌ చేయిస్తుంది. ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌’గా చెప్పుకునే ఠాణెలోని ఈడెన్‌వుడ్‌ కాంప్లెక్స్‌లో రోషిణి బాల్యం గడిచింది. ఇప్పుడు కాంప్లెక్స్‌ వాసులతో సహా ఎంతోమందికి రోల్‌మోడల్‌గా మారింది  రోషిణి. ఫైటర్‌ పైలట్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement