
యాడున్నవ్ బిడ్డా
కరీంనగర్ క్రైం: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన శ్రీనిధి ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. ఆరు రోజులుగా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనిధి జ్ఞాపకాలను తల్చుకుంటూ ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఆర్‌కే విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనిధి విహారయాత్రకు వెళ్లిన తోటి విద్యార్థులతో పాటు ఈ నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యింది. మరుసటి రోజు నుంచి నిరంతరాయంగా గాలింపు జరుపుతున్నప్పటికీ శ్రీనిధి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 9న బియాస్ నది వద్దకు చేరుకున్న ఆమె తండ్రి రాజిరెడ్డి కుమార్తె ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్నాడు. ఈ సంఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా, ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు.
అందులో శ్రీనిధి లేకపోవడంతో ఆమె సజీవంగా ఉంటుందన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బియాస్ నది వద్ద నుంచి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. శనివారం నదిపై ఉన్న మూడు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని ఆపివేసి, నదిలో నీటిని పూర్తిగా నిలిపివేసి మరింత ముమ్మరంగా గాలింపు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మూడు గంటల పాటు నీటిని నిలిపివేసి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పారు. దీంతో శ్రీనిధి ఆచూకీ దొరికే అవకాశాలున్నాయని రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.