దరఖాస్తు గడువుకు సోమవారమే చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్‌లో క్యూ కట్టారు.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఒక్కపోస్టుకు సుమారుగా 200 మంది పోటీ.. ఇదేదో తహశీల్దార్.. ఆపై పోస్టులకు కాదు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు పోటీపడుతున్న జిల్లా అభ్యర్థుల సంఖ్య. దరఖాస్తు గడువుకు సోమవారమే చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్‌లో క్యూ కట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి జిల్లాలో 98 వీఆర్‌ఓ, 172 వీఆర్‌ఏ పోస్టులుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 59,342 దరఖాస్తులు అందాయి. వీఆర్‌ఓ పోస్టులకు అత్యధిక మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీఆర్‌ఓ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ మొదలు పీజీ, బీటెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో 98 వీఆర్‌ఓ పోస్టులకు 56,710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక జిల్లాలో 172 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 1,631 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ రెండు పోస్టులకు జిల్లాలో 1,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు సోమవారం రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తారు.