VRO/VRA posts
-
కొలువుదీరుతాం
సాక్షి, నల్లగొండ: వీఆర్ఓ (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పల్లెల్లో కొలువుదీరడానికి అభ్యర్థులు తహతహలాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ గగనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల ప్రకటన నిరుద్యోగులకు సువర్ణావకాశంగా మారింది. వీటిని దక్కించుకునేందుకు ఉన్నత విద్యావంతులూ పోటీ పడుతున్నారు. దర ఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. వాస్తవంగా వీఆర్ఏకు ఎస్సెస్సీ, వీఆర్ఓకు ఇంటర్మీడియెట్ అర్హతగా ఉన్నా పీజీ చేసినవారూ దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 70శాతం వారివేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంత పోటీ..? జిల్లాలో 68 వీఆర్ఓ, 201 వీఆర్ఏ పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 2న రాత పరీక్ష జరగనుంది. గతనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించారు. గడువు ముగిసేనాటికి మొత్తం 88,299 దరఖాస్తులు అందాయి. ఇందులో ఒక్కో వీఆర్ఓ పోస్టు దక్కించుకునేందుకు దాదాపు 1,255మంది పోటీపడుతున్నారు. వీఆర్ఓ ఉద్యోగం పొందితే జీవితానికి ఢోకా లేదన్న ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. విద్యార్హతలు బట్టి కొన్నేళ్లలోనే తహసీల్దార్ వరకు పదోన్నతి ద్వారా వెళ్లొచ్చు. వీఆర్ఏలు.. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎదగవచ్చు. అన్నీ కలుపుకుని వీఆర్ఓకు ప్రారంభం వేతనం 15వేలు. అది కూడా సొంత జిల్లాలో. ఈ కారణాల వల్ల ఈ పోస్టులకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని చేజిక్కించుకునేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు నిరుద్యోగులు. ఈ నెల 15వ తేదీలోపు ఫొటో పరిశీలన పూర్తికాగానే హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాలతోపాటు ఆయా మండల కేంద్రాల్లో దాదాపు 250 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్ సెంటర్లు కిటకిట.... వీఆర్ఓ, వీఆర్ఏ భర్తీ ప్రకటన రాగానే ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఆరు నుంచి ఇంటర్ వరకు సిలబస్ లభ్యం కావాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో దరఖాస్తుదారులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడల్లోని ఒక్కో ఇనిస్టిట్యూట్ 2వేల నుంచి 4వేల వరకు అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. అంతేగాక జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్, మల్లు వెంకట నర్సింహారెడ్డి(ఎంవీఎన్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉన్నత విద్యావంతులూ ఇదే బాటలో... ఉద్యోగ భద్రత ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను పొందేందుకు ఉన్నత విద్యావంతులూ రంగంలోకి దిగారు. గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే వారు సైతం ఈ పోస్టులకు పోటీపడుతుండడం విశేషం. ఎంసీఏ, ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులు, ఇంజినీరింగ్, బీఈడీ చేసిన వాళ్లూ దృష్టిపెట్టారు. -
దరఖాస్తుల వెల్లువ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఒక్కపోస్టుకు సుమారుగా 200 మంది పోటీ.. ఇదేదో తహశీల్దార్.. ఆపై పోస్టులకు కాదు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు పోటీపడుతున్న జిల్లా అభ్యర్థుల సంఖ్య. దరఖాస్తు గడువుకు సోమవారమే చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్లో క్యూ కట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి జిల్లాలో 98 వీఆర్ఓ, 172 వీఆర్ఏ పోస్టులుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 59,342 దరఖాస్తులు అందాయి. వీఆర్ఓ పోస్టులకు అత్యధిక మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీఆర్ఓ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ మొదలు పీజీ, బీటెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 98 వీఆర్ఓ పోస్టులకు 56,710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక జిల్లాలో 172 వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 1,631 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ రెండు పోస్టులకు జిల్లాలో 1,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు సోమవారం రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తారు. -
వీఆర్ఏ,వీఆర్వో పోస్టుల రిజర్వేషన్ రోస్టర్
సాక్షి, కాకినాడ : జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. డివిజన్ల వారీగా వీఆర్ఏ పోస్టులు మొత్తం 357 కాగా కాకినాడ డివిజన్ నుంచి 49,పెద్దాపురం డివిజన్ నుంచి 41,రాజమండ్రి డివిజన్ నుంచి 43,అమలాపురం నుంచి 129,రంపచోడవరం డివిజన్ నుంచి 28,రామచంద్రపురం డివిజన్ నుంచి 67 ఉన్నాయి. అలాగే వీఆర్ఓ పోస్టులు 87 ఉండగా వీటిలో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని 82 ఖాళీల్లో రిజర్వేషన్ల రోస్టర్ ఇలా ఉంది. ఓసీ జనరల్‌కు 16,ఓసీ మహిళలకు 10,ఎస్సీ జనరల్‌కు 7,ఎస్టీ జనరల్‌కు 5,ఎస్టీ మహిళలకు 3,బీసీ ఎ జనరల్‌కు 4,బీసీ మహిళలకు 3,బీసీ బీ జనరల్‌కు 7,బీసీ బీ మహిళలకు 3, బీసీ సీ జనరల్‌కు 1,బీసీ డీ జనరల్‌కు 7,బీసీ డీ మహిళలకు 2,బీసీ ఈ జనరల్‌కు 4,బీసీ ఈ మహిళలకు 1,ఎక్సు సర్వీసు మెన్ జనరల్‌కు 2, రిజర్వు చేశారు. మిగిలిన అయిదు ఖాళీలు షెడ్యూల్ ప్రాంతాలలో ఎస్టీ జనరల్‌కు 4,ఎస్టీ మహిళలకు 1 రిజర్వు చేశారు. వీఆర్ఏ పోస్టుల రిజర్వేషన్ల వివరాలు ఇక 56 మండలాల్లోని 306 గ్రామాల్లో భర్తీ చేయనున్న 357 వీఆర్ఏ పోస్టులకు కేటగిరీల వారీగా ఓసీ జనరల్‌కు 84,ఓసీ మహిళలకు 46, ఎస్సీ జనరల్‌కు 38,ఎస్సీ మహిళలకు 8,ఎస్టీ జనరల్‌కు 25, ఎస్టీ మహిళలకు 29,బీసీ ఏ జనరల్‌కు 15,బీసీ ఏ మహిళలకు 8,బీసీ బీ జనరల్‌కు 6, బీసీ బీ మహిళలకు 14,బీసీ సీ జనరల్‌కు 17,బీసీ డీ మహిళలకు 18, బీసీ ఈ మహిళలకు 15,ఎక్సు సర్వీస్ మెన్ మహిళలకు 17,వికలాంగ(అంధులు)మహిళలకు 15,హెచ్ హెచ్ జనరల్‌కు 2 రిజర్వు చేశారు.