సాక్షి, నల్లగొండ: వీఆర్‌ఓ (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పల్లెల్లో కొలువుదీరడానికి అభ్యర్థులు తహతహలాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ గగనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల ప్రకటన నిరుద్యోగులకు సువర్ణావకాశంగా మారింది. వీటిని దక్కించుకునేందుకు ఉన్నత విద్యావంతులూ పోటీ పడుతున్నారు. దర ఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. వాస్తవంగా వీఆర్‌ఏకు ఎస్సెస్సీ, వీఆర్‌ఓకు ఇంటర్మీడియెట్ అర్హతగా ఉన్నా పీజీ చేసినవారూ దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 70శాతం వారివేనని అధికారులు పేర్కొంటున్నారు.
ఎందుకంత పోటీ..?
జిల్లాలో 68 వీఆర్‌ఓ, 201 వీఆర్‌ఏ పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 2న రాత పరీక్ష జరగనుంది. గతనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించారు. గడువు ముగిసేనాటికి మొత్తం 88,299 దరఖాస్తులు అందాయి. ఇందులో ఒక్కో వీఆర్‌ఓ పోస్టు దక్కించుకునేందుకు దాదాపు 1,255మంది పోటీపడుతున్నారు. వీఆర్‌ఓ ఉద్యోగం పొందితే జీవితానికి ఢోకా లేదన్న ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. విద్యార్హతలు బట్టి కొన్నేళ్లలోనే తహసీల్దార్ వరకు పదోన్నతి ద్వారా వెళ్లొచ్చు. వీఆర్‌ఏలు.. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎదగవచ్చు.
అన్నీ కలుపుకుని వీఆర్‌ఓకు ప్రారంభం వేతనం 15వేలు. అది కూడా సొంత జిల్లాలో. ఈ కారణాల వల్ల ఈ పోస్టులకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని చేజిక్కించుకునేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు నిరుద్యోగులు. ఈ నెల 15వ తేదీలోపు ఫొటో పరిశీలన పూర్తికాగానే హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాలతోపాటు ఆయా మండల కేంద్రాల్లో దాదాపు 250 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
కోచింగ్ సెంటర్లు కిటకిట....
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ భర్తీ ప్రకటన రాగానే ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఆరు నుంచి ఇంటర్ వరకు సిలబస్ లభ్యం కావాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో దరఖాస్తుదారులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడల్లోని ఒక్కో ఇనిస్టిట్యూట్ 2వేల నుంచి 4వేల వరకు అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. అంతేగాక జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్, మల్లు వెంకట నర్సింహారెడ్డి(ఎంవీఎన్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
ఉన్నత విద్యావంతులూ ఇదే బాటలో...
ఉద్యోగ భద్రత ఉన్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులను పొందేందుకు ఉన్నత విద్యావంతులూ రంగంలోకి దిగారు. గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే వారు సైతం ఈ పోస్టులకు పోటీపడుతుండడం విశేషం. ఎంసీఏ, ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులు, ఇంజినీరింగ్, బీఈడీ చేసిన వాళ్లూ దృష్టిపెట్టారు.
కొలువుదీరుతాం
Published Tue, Jan 14 2014 1:24 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement