బీటెక్ టు గేట్.. వయా ఎంబీఏ
బీటెక్ టు గేట్.. వయా ఎంబీఏ
Published Thu, Apr 10 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
సక్సెస్ స్టోరీ
గేట్ ఈసీఈ 4వ ర్యాంకర్
ఎంసెట్.. ఏఐట్రిపుల్‌ఈ.. ఐఐటీ.. బిట్‌శాట్.. ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు. అటు అకడమిక్‌గా పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు మంచి పర్సంటేజీలు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేసి.. తర్వాత ఎంబీఏ చదివి.. మళ్లీ తనకిష్టమైన ఇంజనీరింగ్‌లో పీజీ కోసం దృష్టి సారించి.. అందుకు మార్గంగా గేట్‌ను ఎంచుకుని.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో నిలిచారు కె.కె.శ్రీనివాస్..
నాన్నవృత్తి రీత్యా బరోడా నుంచి హైదరాబాద్ వచ్చాం. ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే చదివాను. అన్ని తరగతుల్లోనూ 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సబ్జెక్ట్‌లను ఇష్టంగా చదవడం వల్లే ఈ ఫలితాలు లభించాయి. అందుకే ఇంటర్మీడియెట్ తర్వాత రాసిన నాలుగు ఎంట్రన్స్‌లలోనూ (ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ, బిట్‌శాట్) మంచి ర్యాంకులు సొంతమయ్యాయి. అన్నిటికంటే బిట్స్ పిలానీ అంటే ఆసక్తి ఉండటంతో అక్కడ బీటెక్‌లో చేరాను.
ఇంజనీరింగ్‌పై మక్కువ తగ్గలేదు:
2011లో బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తిచేసిన వెంటనే ముంబైలోని కె.జె.సోమయ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏలో చేరాను. ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో కోర్సు పూర్తి చేశాను. వాస్తవానికి మేనేజీరియల్ స్కిల్స్ పెంచుకోవాలని ఎంబీఏలో చేరా. కానీ, ఇష్టమైన ఇంజనీరింగ్‌ను వదులుకోలేకపోయా. అందుకే ఎంబీఏ పూర్తి చేశాక మళ్లీ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య ఎంటెక్ కోసం గేట్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. 2013 నుంచి ఏడాదిపాటు హైదరాబాద్‌లో పూర్తిస్థాయి కోచింగ్ తీసుకున్నాను. దీనివల్ల జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు వచ్చింది.
రెండేళ్ల విరామం:
బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరడంతో రెండేళ్ల విరామం వచ్చింది. అయినా బీటెక్‌లోని అన్ని అంశాలను సమగ్రంగా చదివి ఉండటంతో గేట్ ప్రిపరేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా ఉద్దేశంలో బీటెక్ చదివేటప్పుడే అన్ని సబ్జెక్టులను ఔపోసన పడితే గేట్ గురించి ఆందోళన చెందక్కర్లేదు.
ప్రతి సబ్జెక్ట్‌కు సొంత ఫార్ములా:
గేట్ ప్రిపరేషన్ పరంగా పకడ్బందీ కసరత్తు చేశాను. ప్రతి సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన, క్లిష్టంగా భావించిన అన్ని ఫార్ములాలు, కాన్సెప్ట్‌లతో చిన్నపాటి నోట్స్‌లు రూపొందించుకున్నాను. పునశ్చరణకు ఇవి ఎంతో ఉపకరించాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం కూడా లాభించింది.
ఆ మూడు ఇన్‌స్టిట్యూట్‌లలో సీటే లక్ష్యం:
గేట్ ప్రస్తుత ర్యాంకుతో ఐఐఎస్‌సీ బెంగళూరు లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆర్‌ఎఫ్ అండ్ మైక్రోవేవ్ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ సీటు పొందాలని భావిస్తున్నాను. ఐఐటీల్లో ప్రసిద్ధ క్యాంపస్‌గా గుర్తింపు పొందిన ఐఐటీ-బాంబేలో నా బ్రాంచ్‌కు సరిపడే ఏ స్పెషలైజేషన్‌లో సీటు వచ్చినా చేరతాను. ఎంటెక్ పూర్తి చేశాక మంచి కెరీర్‌లో అడుగుపెట్టి.. తద్వారా సమాజానికి సాధ్యమైనంత సేవ చేయడమే లక్ష్యం.
ఔత్సాహికులకు సలహా:
బీటెక్ మూడో సంవత్సరం నుంచే గేట్ కోసం కసరత్తు ప్రారంభించడం వల్ల సత్ఫలితాలు ఆశించొచ్చు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరవడం మంచిది. మాక్‌టెస్టుల వల్ల పరీక్ష అంటే భయం పోతుంది. సబ్జెక్ట్‌ల వారీగా కనీసం రెండు గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం మంచిది. పరీక్షకు కనీసం పదిహేను రోజుల ముందునుంచి రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
బీటెక్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయిలో కాన్సెప్టుల వారీగా పరిజ్ఞానం సంపాదిస్తే గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించవచ్చు. సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అకడమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. ఉన్నత విద్యావకాశాలకు వీలు కల్పించే గేట్‌కు ఏటా పోటీ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వీయ ప్రణాళికలు రూపొందించుకొని పరీక్షకు సిద్ధమవాలి.
అకడమిక్ నేపథ్యం:
పదో తరగతి:
93 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్మీడియెట్: 98.1 శాతం మార్కులు.
ఎంసెట్‌లో 131వ ర్యాంకు; ఏఐఈఈఈలో 795వ ర్యాంకు; బిట్‌శాట్‌లో
317వ ర్యాంకు; ఐఐటీ-జేఈఈలో
3210వ ర్యాంకు.
2011లో బిట్స్ పిలానీ నుంచి 9.42 సీజీపీఏతో బీటెక్ (ఈసీఈ) ఉత్తీర్ణత.
2013లో 72 శాతంతో ఎంబీఏ ఉత్తీర్ణత.
Advertisement
Advertisement