‘మీ టూ ’ ఉద్యమం ఏమైంది? మగవాళ్ల దాష్టీకాలు ఇలాగే ఉంటాయని సరిపెట్టుకుంటున్నారా ఆడవాళ్లు. కొన్నేళ్ల కిందట బీజం పడిన ఈ ఉద్యమం, ఏడాది కిందట మొలకెత్తింది. హాలీవుడ్ డైరెక్టర్ హార్వీ వైన్‌స్టీన్ దురాగతాలతో ఒక్కొక్కరుగా బయటకొచ్చారు బాధిత మహిళలు. హార్వీ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వాళ్లు గళమెత్తినప్పుడు ప్రపంచం.. ‘నిజమే కదా పాపం’ అని నిట్టూర్చింది. అదే ‘మీటూ’ ఈ ఏడాది మనదేశాన్ని కూడా కుదిపేసింది. సినిమా, రాజకీయ, మీడియా రంగాల్లో చాలామంది మగవాళ్లు తొడుక్కున్న పెద్ద మనిషి ముసుగును ఆమాంతం లాగి పడేసింది. ఆఫీసుల్లో మగ ఉన్నతాధికారులు గుండెల్లో పరుగెత్తుతున్న రైళ్ల మోత బయటకు వినిపించకుండా ఛాతీని చిక్కబట్టుకున్నారు. అంత ఉధృతంగా విస్తరించిన ఈ లైంగిక వేధింపు నివారణోద్యమం కొద్ది రోజులుగా ఒక రూపుదిద్దుకున్నట్లే, ఒక మలుపు తిరుగుతున్నట్లే కనిపించింది. నిజానికి ఏమైంది? ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు అనేక మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. ‘మీటూ’కి మద్దతు పలికిన మహిళలకు తెర వెనుక వేధింపులు మొదలయ్యాయా? అందుకే వాళ్లు తెరమరుగయ్యారా... అనే సందేహాలూ వచ్చాయి. మహిళా ఉద్యమకారులూ మిన్నకుండి పోయారేంటని అనేక నుదుళ్లు ముడివడ్డాయి. వాళ్ల మగవాళ్లు కూడా ఈ పంకిలంలో ఉన్నారా అనే సందేహాలూ పురుడుపోసుకున్నాయి. వీటన్నింటì పై ఆలోచన రేకెత్తించేందుకు ‘డిగ్నిటీ మార్చ్ ముంబయి టూ ఢిల్లీ’ అంటూ కదం తొక్కనున్నారు భారతీయ మహిళలు.
పదివేల కిలోమీటర్లు
ఇంతకాలం ఒక నిశ్శబ్ద విప్లవమే నడిచింది. వేధింపులకు గురైన మహిళలు సోషల్ మీడియాలో తమకు ఎదురైన లైంగిక దాడుల గురించి షేర్ చేసుకున్నారు. బాధితులు సంఘటితమయ్యారు. చాప కింద నీరులా ప్రవహించింది ఉద్యమం. పాదం పాదం కలుపుతూ ఒక మహా ప్రస్థానానికి నాంది పలుకుతోందిప్పుడు. ఈ రోజు (డిసెంబర్ 20వ తేదీ) ముంబయిలో మొదలయ్యే ఈ ప్రయాణం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ముంబయిలో మొదలయ్యే ఈ పాదయాత్ర దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. పదివేల కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర... ముంబయి, పుణే, షోలాపూర్, పనాజి, బెంగళూరు, త్రివేండ్రం, వెల్లూరు, నెల్లూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, డార్జిలింగ్, పాట్నా, లక్నో, భోపాల్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, అజ్మీర్, జైపూర్, శ్రీనగర్, సిమ్లా, చండీగఢ్, డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలు మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొత్తం రెండు వందల జిల్లాల మీదుగా సాగుతుందీ మార్చ్.
‘అడుగడుగునా’ సంఘీభావం
అరవై రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర నిర్వహణలో రాష్ట్రీయ గరిమా అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన భూమిక పోషిస్తోంది. రాష్ట్రీయ గరిమా అభియాన్ సంస్థ ఈ డిగ్నిటీ మార్చ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మూడు వందల చిన్నచిన్న ఎన్‌జీవోలతో కలిసి నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ప్రధానంగా కొంతమంది బాధిత మహిళలు, నిర్వాహకులు మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతారు. మిగిలిన వాళ్లు పాదయాత్రికులకు సంఘీభావంగా వారి వారి నగరాల్లో వచ్చి కలిసి, సమావేశాలను విజయవంతం చేస్తారు. ట్రాఫికింగ్‌కి గురై రక్షింపబడిన మహిళలు కూడా మీటూకి కొనసాగింపుగా జరుగుతోన్న డిగ్నిటీ మార్చ్‌కు మద్దతిస్తున్నారు.
ఇకపై సహించం
ముంబయిలో మొదలై ఢిల్లీకి చేరే ఈ డిగ్నిటీ మార్చ్‌లో పాల్గొనే మహిళల మధ్య సామాజిక, ఆర్థిక సరిహద్దులుండవు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వాళ్లతో పాటు, వ్యవస్థీకృతం అయిన రంగాలతోపాటు వ్యవస్థీకృతం కాని రంగాల మహిళలకు కూడా ఇది వేదికే. బాధిత మహిళలు, వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పోలీసులు అందరినీ ఒక వేదిక మీద తీసుకువస్తున్న ప్రయత్నమిది. లైంగిక వేధింపుకు, లైంగిక దోపిడీకి గురైన మహిళలు సంఘటితం కావాలి, తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బిడియ పడకుండా ధైర్యంగా బయటపెట్టాలి. ఇలాంటి దురాగతాలను ‘ఇకపై సహించేది లేద’ని సమాజాన్ని ఎలుగెత్తి చాటాలి. పురుష సమాజంలో పరివర్తన వచ్చే వరకు నినదిస్తూనే ఉండాలి, గళం వినిపిస్తూనే ఉండాలి. మహిళ సెకండ్ సిటిజెన్‌గా ఉన్న ఈ సమాజంలో ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణం నెలకొనే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి. లైంగికవేధింపులు, బాడీ షేమింగ్‌కు పాల్పడే ఆలోచనలు చెరిగిపోయేవరకు పోరాడాలనేదే ఈ డిగ్నిటీ మార్చ్ లక్ష్యం.
నివారించాలంటే నోరు విప్పాలి
వయొలెన్స్ అగైనెస్ట్ ఉమెన్... ఈ అంశం మీద ఎంత ఎక్కువ మాట్లాడితే అంత త్వరగా సమస్య పరిష్కారమవుతుంది. మౌనంగా భరిస్తూ ఉన్నంత కాలం ఈ దురాచారం మరింతగా వేళ్లూనుకుంటుంది. అందుకే వేధింపుకు గురైన ప్రతి ఒక్కరూ ప్రతిచోటా గొంతెత్తాలి. ఈ హింసను నిరసిస్తూ అంతర్జాతీయస్థాయిలో గడచిన నవంబర్ 25 నుంచి డిసెంబర్ పది వరకు పదహారు రోజులు సదస్సులు జరిగాయి. స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ రాబోయే జనవరి 15 నుంచి 25 వరకు జరిగే వన్ బిలియన్ ర్యాలీలో శతకోటి ప్రజాదళం పాల్గొంటుంది. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ గళమెత్తే ఉద్యమాల్లో ‘మీటూ’ ఒకటి. మీటూ ఎంతటి విజయవంతమైన ఉద్యమమంటే.. కేంద్రమంత్రి ఎం.జె అక్బర్, తరుణ్ తేజ్‌పాల్ వంటి సీనియర్ జర్నలిస్టులను ఎడిటర్స్ గిల్డ్ నుంచి తొలగించే వరకు వెళ్లింది. ఇప్పుడు వార్తల్లో కనిపించడం లేదనే కారణంతో అంతటి పతాకస్థాయికి వెళ్లిన ఉద్యమం చల్లారిపోయిందనుకుంటే పొరపాటే. సమాజంలో లింగ వివక్ష, లైంగిక దోపిడీ ఉన్నంత కాలం ఈ ఉద్యమాలన్నీ ఉంటాయి. ఈ డిగ్నిటీ మార్చ్ కూడా అందులో భాగమే. ఈ రోజు ముంబయిలో మొదలయ్యే మార్చ్ జనవరి ఐదవ తేదీకి హైదరాబాద్‌కి వస్తుంది. మేము (భూమిక స్వచ్ఛంద సంస్థ, ఇతర భావసారూప్యం కలిగిన సంస్థలు, వ్యక్తులు) పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి, ఇక్కడ సమావేశాలు నిర్వహించిన తర్వాత పోచంపల్లి, సూర్యాపేట వరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లోకి సాగనంపుతాం. ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలూ పాల్గొంటున్నాయి.
– కొండవీటి సత్యవతి, రచయిత్రి, భూమిక స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment