
వెయిన్‌స్టీన్ ఎంత నీచుడో వెల్లడించిన మాజీ మోడల్..
న్యూయార్క్ : సినీ అవకాశాల కోసం తనను ఆశ్రయించే మహిళలు, నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు పెనుదుమారం రేపగా, తాజాగా మరో మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. తాను పదహారేళ్ల వయసులో ఉండగా వెయిన్‌స్టీన్ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మాజీ మోడల్ జేన్ డో ఆరోపించారు. 2002లో తాను ఓ బిజినెస్ లంచ్ సందర్భంగా వెయిన్‌స్టీన్‌ను కలిశానని అనంతరం సోహోలోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన ఫిల్మ్‌మేకర్ తనకు శారీరకంగా దగ్గరవ్వాలని బలవంతపెట్టాడన్నారు.
నటిగా ఎదగాలని కోరకుంటే తన కోరికలు తీర్చాల్సిందేనని వెయిన్‌స్టీన్ తనను బెదిరించినట్టు కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనకు సహకరించిన ఎంతోమంది నటీమణులకు మంచి కెరీర్‌ను ఇచ్చానని ప్రలోభపెట్టాడని వెల్లడించారు. ఆపై జేన్ డోను తన దగ్గరికి తీసుకుని అమర్యాదకరంగా వ్యవహరించాడని కోర్టుకు సమర్పించిన దావాలో పేర్కొన్నారు. ఇక 2008లో మరోసారి జేన్ డోను కలిసిన వెయిన్‌స్టీన్ ఆమెకు సాయపడతానని తన కార్యాలయానికి రావాలని కోరాడు. తన కార్యాలయానికి వచ్చిన జేన్ డో పట్ల మరోసారి లైంగిక దాడికి యత్నించడంతో భయంతో అక్కడి నుంచి పరుగు తీసినట్టు మాజీ మోడల్ పేర్కొన్నారు.
ఏంజెలినా జోలీ, పాల్ట్రో, మెక్‌గొవన్ సహా 80 మందికి పైగా మహిళలు వెయిన్‌స్టీన్ లైంగిక ఆగడాలపై మీటూ పేరుతో గళమెత్తిన సంగతి తెలిసిందే. మహిళలను బెదిరించి లోబరుచుకోవడం, సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నటీమణులపై లైంగిక దాడికి పాల్పడటం ఆయనకు పరిపాటి అంటూ పలువురు బాధితులు పెద్దసంఖ్యలో వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు లైంగికంగా సహకరించకుంటే వారి కెరీర్లను నాశనం చేస్తానంటూ వెయిన్‌స్టీన్ బెదిరించేవారని కూడా బాధితులు వెల్లడించారు.