స్టార్ రైటర్ చేతన్ భగత్ కొన్నాళ్లుగా ‘మీ టూ’ ఆరోపణల్ని మోస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు చేతన్ తమను లైంగికంగా వేధించాడని బహిర్గతం చేశారు. వారిలో ఒకరు ఇరా త్రివేది. ఆమె కూడా ప్రముఖ రచయిత్రి. కాలమిస్టు, యోగా టీచర్ కూడా. చేతన్ తనతో చాటింగ్ చేస్తున్నప్పుడు తన అసలు స్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నాడని, అసభ్యకరమైన మెయిల్స్ కూడా తనకు పంపాడని గత అక్టోబర్ 22 ఇరా అతడికి లీగల్ నోటీసు కూడా పంపారు. చేతన్‌పై ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, ఇతర సైబర్ నేరాలు కూడా ఇరా ఫిర్యాదుపై నమోదు అయ్యాయి. అయితే ఇవన్నీ అబద్ధం అని చేతన్ కొట్టిపడేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే.. ఇరా ‘మీ టూ’ ఆరోపణలు చేతన్ ఎక్కడికి వెళ్లినా అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘సాహిత్య ఆజ్ తక్’ కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం నాడు (నిన్న).. సభలో అతడి ‘లీలల’ ప్రస్తావన వచ్చినప్పుడు చేతన్ తన సచ్చీలతను ప్రదర్శించుకోడానికి ప్రయత్నించారు. ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి చెప్పారు. ‘‘నాపై ఇరా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగానే నిజమేనా? నిజమేనా? అని నా భార్య అనూష నస మొదలు పెట్టింది. ఆ నసను తట్టుకోలేక ‘నన్నొదిలేసి వెళ్లిపో అని పెద్దగా అరిచేశాను. కానీ తను స్ట్రాంగ్ ఉమన్. చాలా కూల్‌గా ఉంది. ఉండడమే కాదు, ‘నువ్వూ నేను పార్వతీ పరమేశ్వరుల లాంటి వాళ్లం. ఒకర్నుంచి ఒకరం విడిపోవడం కష్టం’ అంది! ఆ మాట నన్ను టచ్ చేసింది. ఆ మాటతో నా భార్య నన్ను మార్చేసింది (అంటే వేధింపులు నిజమేనన్నమాట). నాపై లైంగిక ఆరోపణలు వచ్చాక, మా అత్తగారికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. దక్షిణ భారతదేశపు సంప్రదాయ కుటుంబం ఆమెది. మాదేమో పంజాబ్. ఏది ఏమైనా అనూష వంటి భార్య ఉన్నప్పుడు అపనిందలన్నీ తేలిపోతాయి. భర్తకు ధైర్యంగా ఉంటుంది’’ అని చెప్పాడు చేతన్ భగత్. అయితే అది కట్టు కథా, నిజమా అనేది నిర్థారణ కాలేదు. రైటర్ కదా. ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇరా మాత్రం తన ఆరోపణలపై తను గట్టిగా నిలబడింది. అవసరం వచ్చినప్పుడు మరిన్ని ప్రూఫ్స్ చూపిస్తానంటోంది.
టీనేజ్ వివాహాలను నిరోధించడానికి గట్టి చట్టాన్ని తేవాలని ఎన్.హెచ్.ఆర్.సి. (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టీనేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వారి భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకు పంపిన ఈ నివేదికలో.. టీనేజ్‌లో పెళ్లయిన బాలికలు 13–19 సంవత్సరాల మధ్య వయసుకే తమ తొలి బిడ్డను ప్రసవిస్తున్నారని పేర్కొంది. యూనిసెఫ్ అంచనాల ప్రకారం చూసినా కూడా 18 ఏళ్ల వయసుకు చేరేలోపే భారతదేశంలో 27 శాతం మంది మహిళలకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి! (ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు శాంతాదేవి మేఘ్‌వాల్. ఆమెది రాజస్థాన్. 11 నెలలకే (ఏళ్లకు కాదు) శాంతాదేవికి పెళ్లైపోయింది! అప్పటికి వరుడి వయసు 9 ఏళ్లు. మూడేళ్ల క్రితం తన 20 ఏళ్ల వయసులో విదేశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె విలపిస్తున్నప్పటి చిత్రమిది.)
లేడీ డయానా దుర్మరణం చెందాక కామిల్లా పార్కర్‌ను రెండో పెళ్లి చేసుకుని, ప్రస్తుతం తన 70 ఏళ్ల వయసులో మనవలు, మనవరాళ్లతో సంతోషంగా ఉంటూ, రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 తర్వాత సింహాసనం అధిష్టించడానికి సిద్ధంగా ఉన్న దశలో ప్రిన్స్ చార్ల్స్ గురించి ఒక పాత విషయమే కొత్తగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ‘ది రాయల్ హౌస్ ఆఫ్ విండ్సర్’ టీవీ సీరీస్‌లో భాగంగా త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో.. 1979తో చార్ల్స్.. అమందా నాచ్‌బుల్ అనే సామాజిక కార్యకర్తను (ఇప్పుడు ఆమె వయసు 61) ప్రేమించి, ఆమెతో కలిసి తిరిగి, ఆమెతో తన జీవితాన్ని ఊహించుకున్నాడని, చివరికి ఆమె తిరస్కారంతో భంగపడి, ఆ గాయం నుంచి కోలుకునేందుకు డయానాతో డేటింగ్ చేశాడని చూపించే సన్నివేశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment