మగాళ్లు అలా అనుకునే కాలం పోయింది! | Womens empowerment:Happy Birthday Malaika Arora | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Oct 24 2018 12:12 AM | Last Updated on Wed, Oct 24 2018 1:22 PM

Womens empowerment:Happy Birthday Malaika Arora  - Sakshi

‘మీ టూ’–ఇండియా ఉద్యమానికి మద్దతుగా అనేక రంగాలలోని ప్రముఖ మహిళలంతా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక శోభా డే సరేసరి. ఈ ముక్కుసూటి స్త్రీవాద రచయిత్రి వివిధ వేదికలపై విస్తృతంగా లైంగిక వేధింపు ఆరోపణలను ఒక ముఖ్యమైన, చర్చించి తీరవలసిన అంశంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఆంగ్ల దిన పత్రిక ‘డెక్కన్‌ క్రానికల్‌’లో ఆమె ‘జమానా ఆఫ్‌ మేల్‌ ఎంటైటిల్‌మెంట్, ప్రివిలేజ్‌ ఈజ్‌ ఓవర్‌’ అనే ఒక వ్యాసం రాశారు. ‘హక్కుదారులం’ అని, ‘ఏం చేసినా చెల్లుతుంది’ అని మగాళ్లు అనుకునే కాలం ముగిసిపోయింది అని శోభా డే ఆ వ్యాసంలో స్పష్టం చేశారు. బయటికి వచ్చిన బాధిత మహిళలకు, అజ్ఞాతంలో ఉండిపోయిన బాధితురాళ్లకు ఆమె తన మద్దతు ప్రకటించారు. ‘‘మౌనంగా ఉండిపోవడం అన్నది ఎన్నటికీ, ఎవరికీ.. ఎంచుకోవలసిన ఒక మార్గం కాకూడదు. నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని ఒక మహిళ నోరు తెరిచి చెప్పినప్పుడు అందరం ఆమె తరఫున నిలబడాలి. మేమున్నాము అని ధైర్యం చెప్పాలి. ‘మీ టూ’ అని ఇప్పుడు వినిపిస్తోంది కానీ, ఎప్పటి నుంచో బాధిత మహిళ తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రమే సమాజం ఆమె చెబుతున్న దానిని వినేందుకు ధ్యాస పెట్టింది. ఎం.జె.అక్బర్‌ కానీ, సుభాష్‌ ఘాయ్‌ కానీ.. అలాంటి మగాళ్లకు ‘మీ కాలం చెల్లిపోయింది’ అని తెలియజెప్పే తరుణం వచ్చేసింది. కొత్త ప్రారంభాలకు ఇది నాందీ సమయం. పురుషులతో సమానంగా స్త్రీలూ ఉన్నప్పుడు.. స్త్రీలను లైంగిక వేధింపులతో, ఇతరత్రా నిందలు, ఆరోపణలతో వెనక్కు నెట్టే వృథా ప్రయత్నాలు మగాళ్లు మానుకోవాలి’’ అని శోభా డే తన వ్యాసంలో హెచ్చరించారు.

పెళ్లయ్యాక స్త్రీకి రక్షణ ఉంటుంది. స్వేచ్ఛ పోతుంది. సాధారణంగా జరిగేదిదే. ఎక్కడో కొందరికి రక్షణతో పాటు స్వేచ్ఛా ఉంటుంది. ఈ రెండిటిలో ఏది ఉన్నా లేకున్నా.. స్త్రీ ఏదైతే కోరుకుంటుందో అది ఉంటేనే ఆమెకు సౌకర్యంగా ఉంటుంది. హాలీవుడ్‌ నటి నికోల్‌ కిడ్‌మన్‌కు రెండుసార్లు పెళ్లయింది. మొదటి భర్త టామ్‌ క్రూజ్‌. తన 22 ఏళ్ల వయసులో.. అప్పటికే స్టార్‌ అయిన క్రూజ్‌ను చేసుకుంది నికోల్‌. అతని భార్యగా ఉన్నప్పుడు అతని స్టార్‌డమ్‌ కారణంగా తనకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఉండేదని నికోల్‌ చెప్పారు. ‘‘మీ కెరియర్‌ ప్రారంభంలో గానీ, తర్వాత గానీ మీకేమైనా లైంగిక వేధింపులు ఎదురయ్యాయా?’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలోని ప్రశ్నకు సమాధానంగా ఆమె తన పూర్వపు భర్త ప్రస్తావన తేవలసి వచ్చింది. ఇప్పుడు ఆమె కీత్‌ అర్బన్‌ భార్య. అందుకే.. ‘‘నేనిప్పుడు నా మొదటి భర్త గురించి మాట్లాడ్డం సమంజసం కాదు. మాట్లాడితే నా ప్రస్తుత భర్తను అగౌరవపరచినట్లు ఉంటుంది’’ అని నికోల్‌ అన్నారు. ఇంకో మాట కూడా ఆమె అన్నారు. ‘‘టామ్‌ క్రూజ్‌తో ఉన్నప్పుడు నాకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఉండేది కానీ, స్వేచ్ఛ ఉండేది కాదు. కీత్‌ అర్బన్‌ని చేసుకున్నాక రక్షణతో పాటు స్వేచ్ఛా వచ్చింది. స్వేచ్ఛ.. పెళ్లయిన స్త్రీని శక్తిమంతురాలిని చేస్తుంది. అప్పుడిక రక్షణ కోసం ఆమె తన భర్త పైన కూడా ఆధారపడే అవసరం ఉండదు. కీత్‌ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమ నాకు రక్షణను, స్వేచ్ఛను, శక్తినీ ఇచ్చింది’’ అని చెప్పారు నికోల్‌.

ఇంట్లో పేరెంట్స్‌ మగపిల్లల్ని స్త్రీల పట్ల గౌరవభావంతో పెంచితే కనుక పురుషులలో సంస్కారవంతమైన జనరేషన్‌లను మున్ముందు మనం చూడగలుగుతామని మలైకా అరోరా అంటున్నారు. పురుషాధిక్య భావనలు తగ్గితేనే.. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆగుతాయని కూడా ఆమె అన్నారు. ‘‘నాకో కొడుకు ఉన్నాడు. వాడిని నేను సక్రమంగా పెంచాలి. మహిళలపై గౌరవ భావంతో పెంచాలి. నాతో పాటు.. అందరు తల్లులు ఇలా పెంచితే.. స్త్రీని ఆటబొమ్మగా చూసే సంస్కృతి క్రమంగా అంతరిస్తుంది. స్త్రీ మీద తనకు హక్కు ఉందనుకునే మైండ్‌ సెట్‌ని చిన్న వయసు నుంచీ మార్చాలి. నేనిప్పుడు అదే పని చేస్తున్నా’’ అని మలైకా తెలిపారు. ‘మీ టూ’ పై వ్యాఖ్యానిస్తూ ఈ మాటలు చెప్పిన మలైకా.. ‘‘ఏ స్త్రీ అయినా తన బాధను చెప్పుకుంటున్నప్పుడు సమాజం వినాలి. పెడచెవిన పెట్టకూడదు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడినవారికి తప్పనిసరిగా శిక్ష పడాలి’’ అని మలైకా అన్నారు. 

ఇండియా వచ్చే విదేశీయులు వీసా కోసం ఇక నుంచీ తమ గురించి మరికొన్ని అదనపు వివరాలను పొందుపరిచే విధంగా దరఖాస్తు ప్రశ్నావళిలో భారత ప్రభుత్వం మార్పులు చేస్తోంది. నేర చరిత్ర ఉందా? గతంలో వీసా తిరస్కరణకు గురయ్యారా? అనే రెండు ప్రశ్నల ద్వారా.. వారు బాలలపై లైంగిక అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉందేమో ముందే గుర్తించేందుకు ఈ విధమైన మార్పులను చేయాలనుకుంటున్నట్లు కేంద్ర శిశు, సంక్షేమ శాఖ ఇప్పటికే హోమ్‌ శాఖకు సమాచారం అందజేసింది.  

బ్రిటన్‌ రాకుమారి కేట్‌ మిడిల్టన్‌కి ఒక అలవాటు ఉంది. తొడిగిన బట్టల్నే మళ్లీ మళ్లీ వేసుకుంటూ ఉంటుంది. ఇందులో తప్పేంటి? ఎంత సాధారణ పౌరురాలైనా.. ప్రిన్స్‌ విలియమ్స్‌ని పెళ్లి చేసుకున్నాక.. ఆమె ఇక ఇంగ్లండ్‌ వంశంలోని రాకుమారే కదా! కనుక కొన్నింటిని పాటించాలి. కొన్నేం.. అన్నీ పాటిస్తున్నప్పటికీ వేసుకున్న బట్టల్లోనే మళ్లీ మళ్లీ కనిపించకూడదన్న (అనధికారిక) నియమాన్ని మాత్రం ఆమె పాటించలేకపోతోంది. వర్క్‌కి వెళ్లినప్పుడు కొన్ని దుస్తుల్లో ఆమెకు సౌకర్యంగా ఉంటుందట. ఆ దుస్తుల్ని గుర్తు పెట్టుకుని మరీ కేట్‌ రిపీట్‌ చేస్తుంటారు. అయితే ధరించిన దుస్తుల్నే తరచు ధరించడాన్ని ఉద్యోగం చేసే మహిళలు స్ట్రెస్‌గా ఫీల్‌ అవుతారనీ, అందుకే వారు బట్టల్ని స్పల్పకాల వ్యవధిలో రిపీట్‌ చేయాలని అనుకోరని ‘థైవ్‌ గ్లోబల్‌’, ‘ది బిజినెస్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌’ సంస్థలు ఉమ్మడిగా జరిపిన సర్వేలో వెల్లడయింది. పలుమార్లు అవే బట్టల్లో కోలీగ్స్‌కి కనిపించడానికి తాము ఇష్టపడబోమని సర్వేకు సహకరించిన 2,700 మంది మహిళా ప్రొఫెషనల్స్‌లో 49 శాతం మంది చెప్పారట. ఈ మిగతా 51 శాతం మంది కేట్‌ లాంటి వాళ్లన్నమాట. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement