
ఆకస్మిక గుండె జబ్బులతో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిన మహిళలకు కనుక లేడీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అందినట్లయితే వారు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యు.ఎస్. వైద్య పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది! ఫ్లోరిడాలో గత 19 ఏళ్లుగా 5 లక్షల 82 వేల గుండెపోటు కేసులను అధ్యయనం చేస్తూ వచ్చిన ఈ పరిశోధకులు.. మగవైద్యుడి సేవల కన్నా , స్త్రీ వైద్యుల సేవలకే మహిళలు త్వరగా కోలుకున్నారని, వీరిలో మరణాల శాతం కూడా బాగా తక్కువగా ఉందని గుర్తించారు.
మహిళలు రోజుకు 352 నిమిషాల పాటు వేతనం లేని పనిని చేస్తున్నట్లు న్యూఢిల్లీలోని ‘నేషనల్ సర్వే ఆఫీస్’ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ ‘టైమ్–యూజ్’ సర్వే 2020 వరకు కొనసాగుతుందని, ఆ ఏడాది జూన్‌లో వెలువడే పూర్తిస్థాయి ఫలితాలు గృహిణుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించిన సర్వే ఆఫీస్ డైరెక్టర్ జనరల్ దేవిప్రసాద్ మండల్.. ఆ తర్వాతి నుంచీ ప్రతి మూడేళ్లకొకసారి ఈ విధమైన సర్వే జరుగుతుంటుందని ప్రకటించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుప్రీంకోర్టు జడ్జిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిదవ మహిళ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఏకకాలంలో ముగ్గురు మహిళా జడ్జీలు విధి నిర్వహణలో ఉండటం ఒక రికార్డు అయింది. జస్టిస్ ఇందిరకు ముందు ఏడవ జడ్జిగా ఇందు మల్హోత్రా, ఆరవ జడ్జిగా ఆర్.భానుమతి, ఐదవ జడ్జిగా రంజనా ప్రకాశ్ దేశాయ్, నాల్గవ జడ్జిగా జ్ఞానసుధా మిశ్రా, మూడవ జడ్జిగా రుమాపాల్, రెండవ జడ్జిగా సుజాతా మనోహర్, మొట్టమొదటి జడ్జిగా ఫాతిమా బీవీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
దేశంలో ‘లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్’ గా (నిరంతరం, ప్రతిచోటా) మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోబోతున్నదీ కోర్టుకు తెలియబరచాలని జస్టిస్ మదన్ బి.లోకూర్ అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో లైంగిక అకృత్యాలకు గురైన 34 మంది బాలికలను సుశిక్షితులైన మానసిక వైద్యుల సమక్షంలో మాత్రమే ఎన్.సి.పి.సి.ఆర్. (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) సభ్యులు మాట్లాడించాలని పట్నా పౌరుడొకరు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం ‘సూయి ధాగా’ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే ‘మమత’ అనే యువతి పాత్రలో అనుష్క శర్మ విలక్షణంగా కనిపించబోతున్నారని ట్విట్టర్‌లో ఆ చిత్రం హీరో వరుణ్ ధావన్ (టైలర్)తో కలిసి ఉన్న ఆమె ఫొటోలను బట్టి తెలుస్తోంది. అయితే చిత్రం లోగోను విడుదల చేసిన వీడియోలో ‘మమత’ పాత్రకు పూర్తి భిన్నమైన ఆధునిక వస్త్రధారణలో అనుష్కను చూసినప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆమెలో చక్కగా ఇమిడిపోతుందేమో అనిపించేలా ఉండటం విశేషం.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా గత జూన్‌లో పదవీ విరమణ పొందిన పి.జె.కురియన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇవాళ జరుగుతున్న ఎన్నికకు ప్రతిపక్ష అభ్యర్థిగా మొదట ఎన్.సి.పి. (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) ఎం.పి. వందనా చవాన్‌ను అనుకున్న కాంగ్రెస్ చివరి నిముషంలో ఆమెను పక్కన పెట్టింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా వందన పేరును బహుజన్ సమాజ్‌వాది పార్టీ నేత సతీశ్ చంద్ర మిశ్రా ప్రతిపాదించగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరెక్ ఒబ్రియన్ బలపరిచారు.
ప్రసవానంతర కుంగుబాటును (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) తట్టుకుని నిలబడకపోతే అది మూడేళ్ల వరకు వెంటాడుతూనే ఉంటుందని పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చదివినట్లు చెబుతూ, కుంగుబాటు కారణంగా బిడ్డకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాం అనే బాధ పడే కొత్త తల్లులందరి తరఫునా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో సాంత్వన వచనాలను పలికారు. వెనువెంటనే ఆమెను ప్రశంసిస్తూ అనేక మంది తల్లులు తమ అనుభవాలను సెరెనాతో పంచుకోవడంతో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌పై బహిరంగంగా మాట్లాడుకోవడం అనే ఒక మంచి ఆరోగ్యకరమైన, ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయానికి నాంది పలికినట్లయిందని వైద్య పరిశోధకులు, మనోవైజ్ఞానిక నిపుణులు సైతం సెరెనాను అభినందిస్తున్నారు.
ఇస్లామాబాద్‌లోని యుద్ధవ్యూహ పండితురాలు షిరిన్ మజారీని పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రిగా (ఆ దేశానికి కాబోయే) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్–పాక్‌ల మధ్య అంతిమయుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్ మొదట ఇండియాలో అత్యధిక జనాభా గల ప్రాంతాలపై న్యూక్లియర్ బాంబులు వేయడం మంచి ఎత్తుగడ అవుతుందని 1999 అక్టోబర్‌లో ‘ది డిఫెన్స్ జర్నల్’ అనే పత్రికకు రాసిన తన వ్యాసంలో షిరిన్ మజారీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment