చదువులోను, పరిశుభ్రతను పాటించడంలోనూ ముస్లిం బాలికలు ముందుంటున్నారని ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అన్నారు. అభివృద్ధి ఆర్థికవేత్త, ‘సుధీర్ కమిషన్’ సభ్యుడు అయిన ఖాన్ హైదరాబాద్‌లో జరిగిన ‘అనాథలకు ఆర్థిక సహాయం’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ఇండియాలో ముస్లిం బాలికలు చదువులో వెనుకబడి ఉంటారన్న ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. దేశంలో చదువు అందుబాటులో ఉన్న 80 శాతం మంది బాలికల్లో 90 శాతం మంది ముస్లిం బాలికలే. ఈ తొంభై శాతం అంతా కూడా జీవించడానికి అత్యవసరమైన ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నవారే. ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ వీళ్లు ముందున్నారు. ‘శుద్ధీకరణ’ (అబ్లూషన్) ఆచారంలో భాగంగా ముస్లిం బాలికలు రోజుకు ఐదుసార్లు చేతులు శుభ్రపరచుకుంటారు’’ అని అమీరుల్లా ఖాన్ వివరించారు. ‘‘చదువుకున్న అమ్మాయిల్ని ముస్లిం సమాజం గౌరవిస్తుంది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఎక్కువమంది బాలికలు ఉన్నతస్థాయి విద్యకు నోచుకోలేకపోతున్నారు’’ అని ఖాన్ అన్నారు. ‘సుధీర్ కమిషన్’ రాష్ట్రంలోని ముస్లింల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేస్తుంటుంది. ఈ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మెక్సికో నుంచి యు.ఎస్.కి శరణార్థులుగా వచ్చే వారిని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘వలస శరణార్థుల నియంత్రణ’ బిల్లుకు వ్యతిరేకంగా మహిళా న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్.. ఆసుపత్రి పడక మీద నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులు ఆమె ఎడమ ఊపిరితిత్తిలోని రెండు క్యాన్సర్ కణుతులను తొలగించిన అనంతరం, వైద్య సేవల కోసం ఆమె ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన బిల్లు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐదుగురిలో నలుగురు జడ్జీలు ఓటు వేయగా, మిగిలిన ఒక ఓటు కూడా వ్యతిరేకంగా పడితే ప్రతిపాదన వీగిపోయే కీలకమైన స్థితిలో గిన్స్‌బర్గ్ తన ఓటును నిరర్థకం చేసుకోదలచుకోలేదు. సన్నిహితులు చుట్టూ ఉండగా, ఆసుపత్రి కుర్చీలో కూర్చుని 85 ఏళ్ల వయసులోఎంతో ఉత్సాహంగా ట్రంప్ కోరుకుంటున్న బిల్లుకు వ్యతిరేకంగా ఆమె ఓటు వేశారు. ప్రస్తుతం గిన్స్‌బర్గ్ ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి జనవరి ఆరంభంలో మొదలయ్యే కోర్టు వాదోపవాదాలకు హాజరవుతారు.
‘టైమ్’ మ్యాగజీన్ 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో మలాలా యూసఫ్జాయ్ కూడా ఒకరు. ‘కూడా ఒకరు’ కాదు. ఆ జాబితాలో ఒబామాకు 51వ స్థానం వస్తే, మలాలా 15వ స్థానంలో ఉన్నారు! ఆ సంచిక విడుదల అయినప్పుడు మలాలా ఆసుపత్రిలో ఉన్నారు. తాలిబన్‌ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా తను బడికి వెళ్లడమే కాకుండా, బాలికలకు చదువు ఎంత అవసరమో ఆమె చెప్పడం తప్పయింది. తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బులెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకుంటుండగానే టైమ్ జాబితాలో మలాలా పేరు వచ్చింది. ఆ సంగతిని మలాలా తండ్రి జియావుద్దీన్‌కి ఆయన డ్రైవర్ ద్వారా తెలిసింది. వెంటనే తన ఫోన్‌లోకి ఫార్వర్డ్ చేయించుకుని టైమ్ కవర్ పేజీపై ఉన్న మలాలా ముఖచిత్రాన్ని కూతురుకి చూపించాడు. అప్పుడు మలాలా స్పందన ఆయన్ని ఆశ్చర్యపరిచింది. ‘మనుషుల్ని ప్రత్యేకంగా చూపించే ఇలాంటి విభజనలపై నాకు నమ్మకం లేదు నాన్నా’ అని ఆ వయసులోనే మలాలా అన్నారట. ఈ విషయాన్ని తన తాజా పుస్తకం ‘లెట్ హర్ ఫ్లయ్ : ఎ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ’ అనే పుస్తకంలో రాసుకున్నారు జియావుద్దీన్. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘డబ్లు్య.హెచ్. అలెన్ అండ్ కంపెనీ’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
స్త్రీలోక సంచారం
Published Wed, Dec 26 2018 12:53 AM | Last Updated on Wed, Dec 26 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment