ఇదెక్కడి హింస?
- గృహహింస నివారణ సెల్
- మహిళా ఉద్యోగులకు జీతాల్లేక అవస్థలు
- 10 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
- విశాఖలో పరిస్థితి మరింత దయనీయం
- భర్తీకాని న్యాయవాది పోస్టు
విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): మహిళాసాధికారితకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పది నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా గృహహింస నివారణ సెల్ మహిళా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. చాలీచాలని జీతాలు అయినప్పటికీ వాటిని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గృహహింస నివారణ విభాగంలో సుమారు 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి 10 నెలలుగా సుమారు రూ.1.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.
విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్-9లో డీఆర్‌డీఏ ప్రగతి భవనంలో గృహహింస నివారణ సెల్‌లో ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి 10 నెలలకు సంబంధించి సుమారు రూ.65.55 లక్షల మేర జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇచ్చేది తక్కువ అయినప్పటికీ ఇన్నాళ్లు వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని వారు వాపోతున్నారు. ఈ సెల్‌లో న్యాయవాది, సోషల్‌వర్కర్, డేటా ఎ్రంటీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరికి గతంలో రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లించేవారు. ఈసారి డిసెంబర్ నుంచి చెల్లించడం లేదు.
న్యాయవాది లేక..: న్యాయవాది రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పోస్టు ఖాళీగా ఉంది. దీంతో గృహహింస బాధితుల కేసులు కోర్టులో వాయిదాలమీద వాయిదాలు పడుతుండంతో న్యాయంకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా గృహహింసకు గురయ్యే మహిళలు ఈ సెల్‌కు ఫిర్యాదు చేస్తుంటారు. ముందుగా ఇక్కడి సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ద్వారా రాజీ కుదురుస్తారు. రాజీ కుదరని పక్షంలో సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సదరు కేసులను ఇక్కడి న్యాయవాది ఉచితంగానే వాదిస్తారు. ఇంతటి కీలకమైన న్యాయవాది పోస్టు రెండు నెలలుగా ఖాళీగా వుండడంతో ఇటు సిబ్బంది, అటు బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి సంస్థ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించడంతోపాటు, న్యాయవాది పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, బాధితులు కోరుతున్నారు.