Domestic violence prevention
-
గృహహింస కేసులో దోషిగా లియాండర్ పేస్..
గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రియా పిళ్లై తన భాగస్వామి అయిన లియాండర్ పేస్ ఇంటిని విడిచి వెళ్లాలి అనుకుంటే. .తనకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అద్దె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని పేస్‌ను కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా తాము ఇద్దరం లివ్ఇన్ రిలేషన్లో ఉన్నామని.. పలు సార్లు పేస్ గృహ హింసకు పాల్పడ్డాడని రియా పిళ్లై ఆరోపించింది. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిళ్లై 2014లో కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడించింది. చదవండి: ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను' -
కేసు వెనక్కి తీసుకొని తప్పు చేశానంటారా?
నేను ఉద్యోగం కోసం ఉత్తర భారతదేశం నుంచి హైదరాబాద్ వచ్చాను. ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. మూడుమాసాల పాటు ఒకడు నన్ను వెంటాడాడు. రోజూ ఫాలో అయ్యేవాడు. ఓ రోజు ఏకంగా ఇంటికే వచ్చేశాడు. ఇలా చేయడం బాగా లేదని వార్నింగ్ ఇచ్చినా ఆగలేదు. జనవరి ఒకటో తేదీన నా ఫ్లాట్‌కి వచ్చి కిటికీలో గుండా చాక్లెట్, ఫోన్ నెంబర్ రాసిన కాగితం పెట్టి పోయాడు. ఫోన్ చేయమని ఆ కాగితం మీద రాసి పెట్టాడు. నా స్నేహితులు అతనికి కాల్ చేసి – ఇలా చేయడం బాగా లేదని నచ్చచెప్పబోయారు. అతగాడు చాలా నీచంగా మాట్లాడాడు. స్టాకింగ్ కారణంగా చాలా భయపడ్డాను. రోజంతా ఆఫీసులోనే ఉండిపోయాను. స్నేహితుల సాయంతో షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశాను. పోలీసులు కేస్ బుక్ చేశారు. స్టేషన్లో అతడు నాకు సారీ చెప్పాడు. దీంతో కేసును వెనక్కి తీసుకున్నాను. ఒకవేళ అతనికి శిక్ష పడితే, బయటకొచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాడేమోననే భయం కూడా కొంతమేరకు నన్ను ఇన్ఫ్లుయన్స్ చేసింది. రెండు నెలల దాటినా ఆ చేదు జ్ఞాపకం నుంచి బయటపడలేకపోతున్నాను. అసలు నేను కేసు వెనక్కి తీసుకోవడం కరెక్టేనంటారా? – సంజన జవాబు: మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయం ఉంటే 100కి డయిల్ చేయొచ్చు. షీటీమ్స్ దగ్గర అతని మొత్తం వివరాలూ ఉంటాయి. ఒకవేళ అతడు ఇంకోసారి వేధించినా, స్టాక్ చేసినా మీరు షీ టీమ్స్‌కు మళ్లీ ఫిర్యాదు చేయొచ్చు. ఈసారి మరింత తీవ్రమైన చర్యలుంటాయి. అసలు మొదటే మీరు కేసును వెనక్కి తీసుకుని ఉండాల్సింది కాదు. వేధించిన వాళ్లకి శిక్ష పడాలి. లేదంటే ఇంకొంత మంది అమ్మాయిల్ని స్టాక్ చేసి హింసిస్తారు. మీలాంటి బాధితులకు చెప్పేది ఒక్కటే. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే రిపోర్టు చేయండి. కేసు పెట్టాక దానికి కట్టుబడి ఉండండి. మీకు ఎవరిమీదైనా సందేహం ఉన్నప్పుడు కూడా షీ టీమ్స్‌కి తెలియచేయవచ్చు. మేం వెరిఫై చేస్తాం. ఎంక్వైరీ చేసే ప్రొసీడ్ అవుతాం. బాధితులు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. షీ టీమ్స్ కార్యాలయానికి వచ్చి డైరెక్టుగానూ కంప్లయింట్ చేయొచ్చు. – స్వాతి లక్రా, షీ టీమ్స్ ఇన్చార్జ్, హైదరాబాద్ మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ లేదా సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి.ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్ ఐడీ :nenusakthiquestions@gmail.com -
గృహహింసకు గోరీ కట్టాలి
సాక్షి, హైదరాబాద్: పురుషాధిక్య సమా జంలో హింస నుంచి మహిళలను కాపా డేందుకు గృహహింస నిరోధక చట్టం ఎంతగానో దోహదపడుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళల హక్కులను కాపాడి, వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసన కర్తలు తీసుకొచ్చిన చట్టాల్లో ఇదొక అత్యుత్తమమైన చట్టమని హైకోర్టు తెలిపింది. గృహహింసకు గురయ్యే మహిళలకు అండగా నిలిచే ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో మేజిస్ట్రేట్ కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పునఃపరిశీలన (రివిజన్) చేయాలని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలపై సెషన్స్, అద నపు జిల్లా, జిల్లా కోర్టుల్లో మాత్రమే అప్పీల్ చేసు కోవాలని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. రివిజన్ పిటిషన్లను తాము విచారణ చేయడం ప్రారంభిస్తే.. బాధిత మహిళలు వ్యయ ప్రయాసల కోర్చి హైకోర్టుకు రాలేరని, దీంతో వారికి నష్టం జరిగే అవకాశముందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. గృహహింస నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జె.లక్ష్మణ్ రావుకు పదవీ విరమణ సమయంలో చెల్లించాల్సిన నగదులో రూ.5 లక్షలను నిలుపుదల చేయాలని సింగరేణి కాలరీస్ మేనేజర్‌కు కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇచ్చారు. మరో కేసులో జగిత్యాల మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బాధిత మహిళకు మనోవర్తిగా రూ.5 వేలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు. ఆ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం మేజిస్ట్రేట్లు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రివిజన్ చేయాలని గృహహింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ వేరువేరుగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి కొట్టివేస్తూ.. గృహ హింస నిరోధక చట్టం గొప్పతనాన్ని తెలిపారు. రాజ్యాంగంలోని 227 అధికరణ ప్రకారం రివిజన్ పిటిషన్లు దాఖలు, సీఆర్పీసీలోని 482 ప్రకారం కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయమనడం ఎంతమాత్రం సబబుకాదన్నారు. సెక్షన్లు 397, 401ల ప్రకారం వేసిన రివిజన్ పిటిషన్లకు విచారణార్హత లేదన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై సంబంధిత సెషన్స్, జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవడం వల్ల కేసు పూర్వాపరాలపై విచారణకు అవకాశం ఉంటుం దన్నారు. రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణ చేస్తే గృహ హింస నిరోధక చట్టం స్ఫూర్తి నీరుగారే ప్రమాదం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
ఇదెక్కడి హింస?
- గృహహింస నివారణ సెల్ - మహిళా ఉద్యోగులకు జీతాల్లేక అవస్థలు - 10 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి - విశాఖలో పరిస్థితి మరింత దయనీయం - భర్తీకాని న్యాయవాది పోస్టు విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): మహిళాసాధికారితకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పది నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా గృహహింస నివారణ సెల్ మహిళా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. చాలీచాలని జీతాలు అయినప్పటికీ వాటిని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గృహహింస నివారణ విభాగంలో సుమారు 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి 10 నెలలుగా సుమారు రూ.1.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్-9లో డీఆర్డీఏ ప్రగతి భవనంలో గృహహింస నివారణ సెల్లో ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి 10 నెలలకు సంబంధించి సుమారు రూ.65.55 లక్షల మేర జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇచ్చేది తక్కువ అయినప్పటికీ ఇన్నాళ్లు వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని వారు వాపోతున్నారు. ఈ సెల్లో న్యాయవాది, సోషల్‌వర్కర్, డేటా ఎ్రంటీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరికి గతంలో రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లించేవారు. ఈసారి డిసెంబర్ నుంచి చెల్లించడం లేదు. న్యాయవాది లేక..: న్యాయవాది రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పోస్టు ఖాళీగా ఉంది. దీంతో గృహహింస బాధితుల కేసులు కోర్టులో వాయిదాలమీద వాయిదాలు పడుతుండంతో న్యాయంకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా గృహహింసకు గురయ్యే మహిళలు ఈ సెల్‌కు ఫిర్యాదు చేస్తుంటారు. ముందుగా ఇక్కడి సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ద్వారా రాజీ కుదురుస్తారు. రాజీ కుదరని పక్షంలో సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సదరు కేసులను ఇక్కడి న్యాయవాది ఉచితంగానే వాదిస్తారు. ఇంతటి కీలకమైన న్యాయవాది పోస్టు రెండు నెలలుగా ఖాళీగా వుండడంతో ఇటు సిబ్బంది, అటు బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి సంస్థ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించడంతోపాటు, న్యాయవాది పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, బాధితులు కోరుతున్నారు.