సాక్షి, హైదరాబాద్: పురుషాధిక్య సమా జంలో హింస నుంచి మహిళలను కాపా డేందుకు గృహహింస నిరోధక చట్టం ఎంతగానో దోహదపడుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళల హక్కులను కాపాడి, వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసన కర్తలు తీసుకొచ్చిన చట్టాల్లో ఇదొక అత్యుత్తమమైన చట్టమని హైకోర్టు తెలిపింది.
గృహహింసకు గురయ్యే మహిళలకు అండగా నిలిచే ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో మేజిస్ట్రేట్ కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పునఃపరిశీలన (రివిజన్) చేయాలని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలపై సెషన్స్, అద నపు జిల్లా, జిల్లా కోర్టుల్లో మాత్రమే అప్పీల్ చేసు కోవాలని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. రివిజన్ పిటిషన్లను తాము విచారణ చేయడం ప్రారంభిస్తే.. బాధిత మహిళలు వ్యయ ప్రయాసల కోర్చి హైకోర్టుకు రాలేరని, దీంతో వారికి నష్టం జరిగే అవకాశముందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.
గృహహింస నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జె.లక్ష్మణ్ రావుకు పదవీ విరమణ సమయంలో చెల్లించాల్సిన నగదులో రూ.5 లక్షలను నిలుపుదల చేయాలని సింగరేణి కాలరీస్ మేనేజర్‌కు కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇచ్చారు. మరో కేసులో జగిత్యాల మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బాధిత మహిళకు మనోవర్తిగా రూ.5 వేలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు.
ఆ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం మేజిస్ట్రేట్లు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రివిజన్ చేయాలని గృహహింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ వేరువేరుగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి కొట్టివేస్తూ.. గృహ హింస నిరోధక చట్టం గొప్పతనాన్ని తెలిపారు. రాజ్యాంగంలోని 227 అధికరణ ప్రకారం రివిజన్ పిటిషన్లు దాఖలు, సీఆర్‌పీసీలోని 482 ప్రకారం కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయమనడం ఎంతమాత్రం సబబుకాదన్నారు.
సెక్షన్లు 397, 401ల ప్రకారం వేసిన రివిజన్ పిటిషన్లకు విచారణార్హత లేదన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై సంబంధిత సెషన్స్, జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవడం వల్ల కేసు పూర్వాపరాలపై విచారణకు అవకాశం ఉంటుం దన్నారు. రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణ చేస్తే గృహ హింస నిరోధక చట్టం స్ఫూర్తి నీరుగారే ప్రమాదం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment