ప్రతీకాత్మక చిత్రం
నేను ఉద్యోగం కోసం ఉత్తర భారతదేశం నుంచి హైదరాబాద్ వచ్చాను. ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. మూడుమాసాల పాటు ఒకడు నన్ను వెంటాడాడు. రోజూ ఫాలో అయ్యేవాడు. ఓ రోజు ఏకంగా ఇంటికే వచ్చేశాడు. ఇలా చేయడం బాగా లేదని వార్నింగ్ ఇచ్చినా ఆగలేదు. జనవరి ఒకటో తేదీన నా ఫ్లాట్‌కి వచ్చి కిటికీలో గుండా చాక్లెట్, ఫోన్ నెంబర్ రాసిన కాగితం పెట్టి పోయాడు. ఫోన్ చేయమని ఆ కాగితం మీద రాసి పెట్టాడు. నా స్నేహితులు అతనికి కాల్ చేసి – ఇలా చేయడం బాగా లేదని నచ్చచెప్పబోయారు. అతగాడు చాలా నీచంగా మాట్లాడాడు. స్టాకింగ్ కారణంగా చాలా భయపడ్డాను. రోజంతా ఆఫీసులోనే ఉండిపోయాను. స్నేహితుల సాయంతో షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశాను. పోలీసులు కేస్ బుక్ చేశారు. స్టేషన్‌లో అతడు నాకు సారీ చెప్పాడు. దీంతో కేసును వెనక్కి తీసుకున్నాను. ఒకవేళ అతనికి శిక్ష పడితే, బయటకొచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాడేమోననే భయం కూడా కొంతమేరకు నన్ను ఇన్‌ఫ్లుయన్స్ చేసింది. రెండు నెలల దాటినా ఆ చేదు జ్ఞాపకం నుంచి బయటపడలేకపోతున్నాను. అసలు నేను కేసు వెనక్కి తీసుకోవడం కరెక్టేనంటారా? – సంజన
జవాబు: మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయం ఉంటే 100కి డయిల్ చేయొచ్చు. షీటీమ్స్ దగ్గర అతని మొత్తం వివరాలూ ఉంటాయి. ఒకవేళ అతడు ఇంకోసారి వేధించినా, స్టాక్ చేసినా మీరు షీ టీమ్స్‌కు మళ్లీ ఫిర్యాదు చేయొచ్చు. ఈసారి మరింత తీవ్రమైన చర్యలుంటాయి. అసలు మొదటే మీరు కేసును వెనక్కి తీసుకుని ఉండాల్సింది కాదు. వేధించిన వాళ్లకి శిక్ష పడాలి. లేదంటే ఇంకొంత మంది అమ్మాయిల్ని స్టాక్ చేసి హింసిస్తారు. మీలాంటి బాధితులకు చెప్పేది ఒక్కటే. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే రిపోర్టు చేయండి. కేసు పెట్టాక దానికి కట్టుబడి ఉండండి. మీకు ఎవరిమీదైనా సందేహం ఉన్నప్పుడు కూడా షీ టీమ్స్‌కి తెలియచేయవచ్చు. మేం వెరిఫై చేస్తాం. ఎంక్వైరీ చేసే ప్రొసీడ్ అవుతాం. బాధితులు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. షీ టీమ్స్ కార్యాలయానికి వచ్చి డైరెక్టుగానూ కంప్లయింట్ చేయొచ్చు.
– స్వాతి లక్రా, షీ టీమ్స్ ఇన్‌చార్జ్, హైదరాబాద్
మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ లేదా సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి.ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన
మెయిల్ ఐడీ :nenusakthiquestions@gmail.com
Comments
Please login to add a commentAdd a comment